26 June 2012

విరహపు మేన మల్లెలు పూచే...

పురుషోత్తముని కలయికకై ఉవ్విళ్ళూరుతోంది పదహారేళ్ళ పడతి శ్రీదేవి. ఆ స్థితిని గమనించిన చెలికత్తెలు ఆమె మదిభావాలను (విరహ వేదనను) పలురకాల పువ్వులతో పోలుస్తున్నారు. కవులు మగువల్ని పువ్వులతోపోల్చడం సహజం;  అన్నమయ్య చూపే వైవిధ్యం ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో చూడండి! మరులుగొన్న శ్రీదేవి మదిలోనూ తనువులోనూ జరిగే మార్పులను అందమైన పువ్వులతో ఉదాహరించారు.

అందం మగువ సహజ లక్షణం. అటువంటిది ఆమె ప్రేమలో పడినప్పుడు ఆ అందం పలురెట్లవుతుంది. గుండెలు నిండిన వలపుతో ప్రియునికై తపించే ఆ పడతి "పూవక పూచిన పూవై" ఎలా వికసించిపోతుందో చెలికత్తెల మాటల్లో వినండి.

======================== 
AUDIO
(నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరకల్పన)
========================

పొలితి జవ్వనమున బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతి చింతాలతలలో సంపెగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోత నడవిజాజులు పూచె
హితవు తెలియ దిక నేమి సేసేదే
తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు పూచె
కొయ్యచూపు గోపముల గుంకుమ పూచె
కయ్యపు వలపుల జీకటిమాకులు పూచె
నియ్యెడ జెలియభావ మేమి సేసేదే
మగువరతులలోన మంకెన పువ్వులు పూచె
మోగి గొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశుపొందుల గప్రము పూచె
ఇగురు బోండ్ల మిక నేమి సేసేదే

ప్రతిపదార్థం : (సందర్భోచితమైన అర్థాలు)
పొలితి = పడతి, మగువ, ఇంతి
జవ్వనము = పదహారేళ్ళ ప్రాయం
బూవక = పూవక
ఎలమి = వికాసము, సంతోషము

చింతాలతలు = చింత+లతలు = అల్లుకుంటున్న ఆలోచనలు
సంపెగ = సంపంగి పువ్వు
తలపోత = వెన్నాడే తలపు, విచారము

తొయ్యలి = మగువ, పడతి
దొంతితామెర = పలురేకులున్న కలువపూవు
కొయ్యచూపు = ప్రేమలేని చూపు
గోపముల => కోపముల
గుంకుమ => కుంకుమ =  కుంకుమపువ్వు [safron]
కయ్యపు = జగడము, గొడవ
జీకటిమాకులు  => చీకటిమాకులు = కదంబం; అంటే కడిమి చెట్టు (కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది)
ఇయ్యెడ = ఇక్కడ
జెలియ => చెలియ

మగువ = పడతి, ఆడది, స్త్రీ
మంకెన = ఎర్రటి రంగు పువ్వు [Pentapetes phoenicea]
మొగి = వరుస
మొగలి = Pandanus odoratissimus
గప్రము = కర్పూరము
ఇగురు =  చిగురు
బోండ్లము = అమ్మాయిలు 

తాత్పర్యం / Meaning :
మొగ్గదశనుండి పూవుగా ఇప్పుడే వికసించినట్లు బాల్య ప్రాయంనుండి యౌవనంలోకి అడుగిడిన పదహారేళ్ళ ఈ పడతి ఆనందించేందుకు మనము చేయగలిగినదేముందే? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

పురుషోత్తముని సతీమణియైన ఈమె మదిలో ఆయన గూర్చి అల్లుకుపోతున్న ఆలోచనలు (చింతాలతలు కదా!) సంపంగిపువ్వుల్లా పూచాయట. ఇక్కడ సంపంగి పూవులనెందుకు ఉపమానంగా వాడారో గమనించాలి. సంపంగి మొగ్గలు విచ్చుకుని పరిమళాన్ని వెదజల్లేది సాయంత్రం సమయాల్లోనే. నిత్యం అతని తలపుల్లోనే తేలియాడుతూ ఉన్నా మలిసంజవేళే కదా ఉద్రేకమైన వలపు భావనలు కలిగేది? అందుకే సంపంగి పూవుల్లా పూచాయట ఆమె మదిలోని తలపులు. ఇంకాస్త సమయం గడిచింది. ఆమె విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలెందుకంటారా? మల్లెల సువాసన మత్తెక్కిస్తుంది; పడతి విరహస్థితి కూడా అదే కదా? మరింత సమయం గడిచింది. ఆ సరసుడు సరసన లేడు; అతని తలచుకుంటూ ఇంకా రాలేదేమని విచారపడుతూ నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పుల తీవ్రత మామూలు జాజుల్లా కాకుండా అడవిజాజులంత హెచ్చుగా ఉందట. "ఈమెకొచ్చిన ఈ కష్టాలు సుఖాలవ్వడానికి మనమేమి చెయ్యగలమే?" అని చెలికత్తెల భావన.

రెండో ఝామైంది; స్వామి రాలేదు. విరహం ఝాము ఝాముకీ హెచ్చింది. తాపాన మరిగిన ఆమె మేను ముచ్చెమటల ఏరయ్యింది. సొగసులు నీట మెరిసే తామరల్లా పూచాయి. దొంతితామరలట! అప్పుడొచ్చాడా కమలనాథుడు. ఏ తొలిఝామో నాయకుడింటికి వచ్చుంటే పాదప్రక్షాళనకు నీళ్ళిచ్చి, చిరునవ్వుల పూవులు గుప్పించి ఆహ్వానించుండేది. ఇలా రెండోఝాము సమయానికొస్తే ఏం చేస్తుంది నాయిక? అదే.. అదే.. నిప్పులుకక్కేంతలా కోపంగా కోయ్యచూపులు చూసిందట. అప్పుడు ఆమె ముఖమూ, కళ్ళూ కుంకుమపువ్వులు పూచినట్టు ఎరుపెక్కాయట. కోపం ఎదిగితే ఏమవుతుంది? గొడవవుతుంది. సిరి హరితో కయ్యానికి దిగి అలిగింది! ఆమె నవ్వులు లేని ఆ రేయి మరింత నల్లబడిందట. కడిమి పూచినంత మనోహరంగా ఆమె అలకలు పూచాయి. చీకటిమాకులు పూచాయని, ప్రేమ నిండిన అలక కూడా చక్కనిదేనని చెప్తున్నారు. అందగత్తె ఏ కళనున్నా అందమే కదా! "స్వామి ఇంటికొచ్చేంతవరకేమో రాలేదే అని బెంగపెట్టుకుంది వచ్చాకేమో దెబ్బలాడుతుంది. ఈ సత్యభామ ప్రవర్తన మనకర్థం కాదే!" అని నొచ్చుకుంటున్నారు చెలికత్తెలు.

తలపోతా, నిట్టూర్పూ, విరహం, కోపం, కయ్యం, అలక - ఇదీ వరుస.  అలక తరువాత ప్రణయం బహు తీయనిది. చురకలూ చెణుకులతో మొదలై గారాలతో సరాగాలలోకి దారితీస్తుంది. గమ్యం వారి కలయిక - వలపుల శిఖరాలు చేరిన ఆ సొగసరి ఎర్రని కోమలమైన మంకెనలా వికసించింది. రతికేళి వేళ స్వామి మునిగోళ్ళు ఆమె కోమల దేహం పై ఏర్పరచిన జాబిలిబుడుగులు మొగలి రేకుల్లా పరిమళించాయి. శ్రీవేంకటేశుని మనసు దోచిన దొరసానినని గర్వించే ఆ పడతి పొగరంతా పరవశించి పవళించిన ఈ వేళ కర్పూరంలా పూచి గాలిలో కరిగిపోయింది అని చెలికత్తెలు "కన్నెపిల్లలం మనకేం తెలుసే వారి వలపులు!" అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

=======================================
[ Lyrics in RTS format ]

politi javvanamuna bUvaka pUche
yelami niMduku manamEmi sEsEdE

sati chiMtAlatalalO saMpegapUvulu pUche
mativirahapu mEna mallelu pUche
atanunitalapOta naDavijAjulu pUche
hitavu teliya dika nEmi sEsEdE

toyyalichemaTaneeTa doMtidAmeralu pUche
koyyachUpu gOpamula guMkuma pUche
kayyapu valapula jeekaTimAkulu pUche
niyyeDa jeliyabhAva mEmi sEsEdE

maguvaratulalOna maMkena puvvulu pUche
mOgi gonagOLLanE mogali pUche
pogaru SreevEMkaTESupoMdula gapramu pUche
iguru bOMDla mika nEmi sEsEdE


=======================================

21 comments:

 1. అద్భుతం!! ఇంత అందమైన కీర్తన ఇన్నాళ్ళూ ఎందుకు దాచి ఉంచారు? మీ వ్యాఖ్యానం మనోహరమైన అన్నమయ్య కృతికి సరిసాటిగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. థాంక్స్ భాస్కర్ గారూ!

  ReplyDelete
  Replies
  1. నేను దాచుకోవడం ఏంటండి? అందరికీ అందుబాట్లోనే ఉంది కదా?

   Delete
 2. ఈ కీర్తన అత్యద్భుతంగా ఉంది. ఎప్పుడూ వినలేదు. చక్కని విశ్లేషణ తోడై ఈ పరిమళపు గాలులు మదిని తాకాయి. ధన్యవాదాలు!
  రంధ్రాన్వేషణ అనుకోకపోతే సంపెంగలు అని లిల్లీ పూలు పెట్టారేమిటి?

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ,
   ఆంధ్రలో లిల్లీ పూవులనబడేవీటినే కర్నాటక, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో "సంపంగి" పువ్వులు అని అంటారండి. అన్నమయ్య కాలంలో తెలుగువారందరుకూడా వీటినే సంపంగి పూవులనేవారండి.
   సంపెగ = సంపెంగ =సంపంగి

   Delete
  2. నాకు తెలిసున్నంతవరకూ సంపెంగలు Magnoliaceae కుటుంబం, లిల్లీలు Liliaceae (Monocots) కుటుంబం. కానీ లిల్లీలని సంపెంగలు అనేవారని అస్సలు తెలియదండీ. క్రొత్త కీర్తనతో పాటూ క్రొత్త విషయం కూడా తెలిపారు. మరో సారి ధన్యవాదాలు!

   Delete
 3. మీకు మీరే మాకు మేమే
  సూపర్ గా రాసారు భాస్కర్ గారు
  పదాలను వివరిమ్పిన విధానం నుండి ఫోటోలు మీరు తీసుకున్నా శ్రద్ధ అద్భుతం
  ఆభినందనలు.

  ReplyDelete
 4. ఈ సంకీర్తన చాలా బాగుంది. మీరు ఇచ్చిన వివరణ,పువ్వుల చిత్రాల సేకరణ.. చాలా శ్రద్దగా చేసారు.
  లిల్లీ పూలని సంపెంగలు అంటారని తెలియదు కానీ ..పున్నాగ పువ్వులని చెట్టు సంపెంగలు అని.. నెల్లూరు ప్రాంతంలో అందం నాకు తెలుసును.
  భాస్కర్ గారు.. చాలా శ్రద్ద తీసుకుని ఈ పోస్ట్ అందించిన మీకు ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ,
   పువ్వులు కదండీ? అందుకే ఈ కీర్తన నాకు నచ్చుతుంది :) మీ అభిమానానికి దన్యుడిని అండి.

   లిల్లీ పూవులన్న పేరు ఈ మధ్య కాలంలో తెలుగులోకి వచ్చుంటుందేమోనన్నది నా భావనండి. ఎందుకంటే ఇది తెలుగు పదం కాదు కదా? అయితే సంపెంగ దండలు వందల సంవత్సరాలుగా మనం వాడుతున్నాము, పండిస్తున్నాము. ఆ రోజుల్లో వీటిని లిల్లీలు అని మాత్రం ఖచ్చితంగా అనుండరనిపిస్తుంది. ద్రావిడ, కన్నడ, సీమ భాషల్లో వీటినే సంపెంగలంటారని తెలుసుగనుక అన్నమయ్య వీటిగురించే చెప్పుంటారన్నది నా గట్టి నమ్మకమండి. ఎవరైనా పెద్దలు చెప్తే విందాం.

   మరోసారి ధన్యవాదములు :)

   Delete
  2. పైన భాస్కర్ గారు పెట్టిన సంపెంగ పూలని ...... నెల సంపెగ అనేవారండి. అది లిల్లి అని మనము పొరబడుతున్నాము .... ఆంగ్లం లో వాటిని ట్యూబ్ రోస్ అంటారు. :-)

   http://en.wikipedia.org/wiki/Polianthes_tuberosa

   The botanical name for Sampangi is Polianthes tuberosa and the Family name Agavaceae (agave family) There are lots of names for Sampangi in India. Rajani gandha in Hindi, Nila sampangi in tamil, Nela sampangi in Telugu , gulcheri, gulshabbo in other languages . In English they are called as Tube roses and it is considered as a common name in many places.

   భాస్కర్ గారు ... కీర్తన విశ్లేషణ మరియూ తాత్పర్యం అద్భుతంగా ఉంది. :-)

   Delete
  3. చంద్రకళ గారూ, మీ స్పందనకీ, ట్యూబ్‌రోజస్ మీద అందించిన వివరాలకూ ధన్యవాదములండి :-)

   Delete
 5. పదాలకు అర్ధాలు వ్రాసి మరీ భావం చక్కగా వివరించారు. మీ నుండి మరిన్ని కీర్తనలు వినాలని వుంది భాస్కర్ గారూ..

  ReplyDelete
 6. 'సిరి హరితో కయ్యానికి దిగి అలిగింది! ఆమె నవ్వులు లేని ఆ రేయి మరింత నల్లబడిందట. కడిమి పూచినంత మనోహరంగా ఆమె అలకలు పూచాయి. చీకటిమాకులు పూచాయని, ప్రేమ నిండిన అలక కూడా చక్కనిదేనని చెప్తున్నారు. అందగత్తె ఏ కళనున్నా అందమే కదా!'

  'అలక తరువాత ప్రణయం బహు తీయనిది. చురకలూ చెణుకులతో మొదలై గారాలతో సరాగాలలోకి దారితీస్తుంది. గమ్యం వారి కలయిక - వలపుల శిఖరాలు చేరిన ఆ సొగసరి ఎర్రని కోమలమైన మంకెనలా వికసించింది. రతికేళి వేళ స్వామి మునిగోళ్ళు ఆమె కోమల దేహం పై ఏర్పరచిన జాబిలిబుడుగులు మొగలి రేకుల్లా పరిమళించాయి.'


  అద్భుతం అనే మాట చిన్నది మాష్టారూ! ఈ రెండు మచ్చుతునకలు చాలు అన్నమయ్యకి సరిసాటిగా ఆయన కీర్తనకి వ్యాఖ్యానం రాశారని చెప్పడానికి. మీరు ధన్యజీవులు!

  ReplyDelete
 7. అన్నమయ్య కీర్తన..అవినేని వర్ణన రెండూ అద్భుతం!
  'విరహము కూడా సుఖమే కాదా..నిరతము చింతన మధురము కాదా
  వియోగ వేళల విరిసే ప్రేమల విలువలు గనలేవా' అని పింగళి వారు కూడా ఈ విరహాన్ని గురించి అద్బుతంగా చెప్పారు.
  చాలా చక్కటి వివరణ ఇచ్చారు భాస్కర్ గారు అభినందనలు!

  ReplyDelete
 8. :)...

  you deserve moreeeeeeeeeeeeeee applaud for doing this..!!
  bomma chala apt ga undi...loved it :)

  ReplyDelete
 9. భాస్కర్ గారు.. మీరెంత అదృష్ట వంతులు అండి!!! నేను ఈ పాట ఒక్కటి వింటే నాకు భావం అస్సలు అర్ధం అయ్యేది కాదేమో!! కానీ మీరు చెప్పిన తాత్పర్యం , ప్రతిపదార్ధాలవల్ల నేను ఆహ్ పాట లోని అందాన్ని... ఆస్వాదించగలిగాను... నిజం గా మీకు వేల వేల ధన్యవాదాలు !! Excellent!! I enjoyed!! :) thanks a lot for the post!!

  ReplyDelete
 10. పైన కామెంటులన్నీ చదివాక ఇంక నేను ఏం చెప్పినా తక్కువే..అద్భుతం అనే పదం తప్ప!

  ReplyDelete
 11. ఎంత మధురమైన కీర్తనండి మీ వివరణ కూడా మహా చక్కగా ఉంది.

  ReplyDelete
 12. అతితీయని అన్నమయ్యపాటలూ వాటి భావాలకోసం వెదుకుతున్నాను. ఇది దొరికింది ఇంతకంటే నేను ఊహించుకోలేకున్నా. దీనిని ఆంగ్లంలోనికి అనువదించి అయినవారికి పంపుకోవాలి.

  ReplyDelete
 13. అద్భుతమయిన కీర్తన. నేను ఇంతకుముంది ఎప్పుడూ వినలేదు. నేను ప్రతి శనివారం ఓ అన్నమయ్య కీర్తన facebook లో పోస్ట్ చేస్తుంటాను. ఈ వారం ఈ కీర్తన మీ వ్యాఖ్యానంతో పోస్ట్ చేసాను. అన్నమయ్య కీర్తనల్లో గొప్ప్తతనానికి నలుగురికీ తెలియజెయ్యడం నా అభిమతం. ధన్యవాదాలు.

  ReplyDelete