24 May 2012

నిక్కి నిక్కి చూసేరదే నెరితెర తియ్యరో...

పెళ్ళి - ఈ పదం వినగానే వయసుతో నిమిత్తంలేకుండా అందరి మనసుల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. పెళ్ళయినవారు తమ పెళ్ళివేడుకలను గుర్తుచేసుకుని చిరునవ్వు చిందుతారు. వయసులో ఉన్నవారు తమకు జరగబోయే పెళ్ళిగూర్చిన ఊహా లోకంలో విహరిస్తారు. చిన్న పిల్లలేమో కొత్తబట్టలూ, బంధుజనాల కలయికలూ, ఆటలూ, పాటలూ వీటిని తలచుకుని సంబరపడతారు. పెళ్ళిలో అందరికన్నా ఎక్కువ ఆనందించేది వధూవరులే! మరి వాళ్ళే కదా ఆ వేడుకకి ప్రధాన ఆకర్షణ (center of attraction).

ప్రతి పెళ్ళిలోనూ "పెళ్ళి పెద్ద"గా ఒకాయన వ్యవహరిస్తుంటాడు. ఎవరెవరు ఏ పనులు చెయ్యాలనీ, ఎప్పుడు, ఎలా చెయ్యాలనీ అప్పటికప్పుడు ఆజ్ఞాపిస్తుంటాడు. ఇప్పుడు మనం వీక్షించబోయే పెళ్ళిలో వధూవరులు  శ్రీదేవీ-పురుషోత్తములు; పెళ్ళి పెద్ద మన అన్నమయ్య. ఆయన పెళ్ళి పెద్దగా వ్యవహరించే ఆ కల్యాణాన్ని తిలకించి పులకిద్దామా?

పెళ్ళి జరుగుతోంది; చుట్టూ జనం. అమ్మాయినీ, అబ్బాయినీ పీటల మీద ఎదురెదురుగా కూర్చోబెట్టారు. మధ్యలో ఏమో తెరకట్టేశారు. వధూవరులకేమో ఒకరినొకరు చూడాలన్న ఉత్సుకత(curiosity)! నెమ్మదిగా మంత్రాలు  చదివే ముసలిపంతులవారికి తెలియదుకదా వీళ్ళ కుతూహలం(excitement). ఎంతసేపు చదువుతూనే ఉన్నారు... వీరి ఉబలాటం క్షణక్షణం పెరిగిపోతూ ఉంది... చుట్టూ జనం ఉన్నారనైనా ఆలోచించకుండ, ఆ వధూవరులు మధ్యనున్న తెరపైకి నిక్కి నిక్కి చూస్తున్నారు. ఆ పెళ్ళిలో చోటుచేసుకునే ఇలాంటి ఆహ్లాదకరమైన దృశ్యాలను అన్నమయ్య ఎంత గొప్పగా పదాలలో చిత్రీకరించారో పాటవిని మిరే తెలుసుకోండి.

===============================
గుంటి నాగేశ్వరనాయుడు గారు స్వరకల్పనలో 
వాణీజయరామ్ గారి గళంలో ఈ కీర్తన వినండి

===============================

        పల్లవి
        అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును
        కదిసివున్నారు తమకమున బెండ్లికిని

        చరణం 1
        బాసికములు గట్టరో పైపై దంపతులకు
        శేసపాలందియ్యరో చేతులకును
        సూసకాల పేరంటాండ్లు సోబానంబాడరో
        మోసపోక యిట్టే ముహూర్తమడుగరో

        చరణం  2
        గక్కునను మంగళాష్టకములు చదువరో
        తక్కక జేగట వేసి తప్పకుండాను
        నిక్కినిక్కి చూచేరదే నెరి దెర దియ్యరో
        వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో

        చరణం 3
        కంకణదారములను కట్టరో యిద్దరికి
        సుంకుల బెండ్లిపీట గూచుండబెట్టరో
        లంకె శ్రీవేంకటేశు నలమేల్‌ మంగని దీవించి
        అంకెల బానుపుమీద నమరించరో

    కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు: (సందర్భోచితమైన అర్థాలు)
    కదిసివున్నారు = ఒక్కటవ్వడానికి వేచియున్నారు
    తమకమున = తమకంతో, ఆతురతతో, తొందరపడుతూ
    బెండ్లికిని = పెళ్ళికై

    బాసికము = పెండ్లియందు వధూవరుల నొసట కట్టెడు మౌక్తికహారము
    శేసపాలు = పెళ్ళిలో వధువరులు ఒకరిపై ఒకరు పోసే పువ్వులు, బియ్యము; తలంబ్రాలు
    సూసకాల = చెప్పీ చెప్పనట్టుగా, చాటుమాటుగా
    సోబాన = పెళ్ళిపాట

    గక్కున = తోందరగా; త్వరితముగా; వేగముగా
    తక్కక = అవశ్యముగా
    జేగట = గాజులు; మురుగు
    నిక్కినిక్కి = (తెరపైకి) తలయెత్తి
    ఒనరగ = లక్షణంగా

    సుంకుల = అందముగా అలంకరించబడిన
    లంకె = ఒకటయ్యాడు
    అంకె = పరుపు
    బానుపుమీద = పానుపుమీద; మంచంమీద
    నమరించరో = కూర్చోబెట్టండి
తాత్పర్యం / Meaning :
అదిగో చూడండి, వధూవరులుగా అలంకరించబడిన శ్రీవేంకటేశుడూ, అలమేలుమంగా ఎంత ఆసక్తితో కాచుకునున్నారో పెళ్ళికొరకు!  

కాబోయే ఆ దంపతులకు త్వరగా బాసికాలు కట్టి తలంబ్రాలు చేతికందివ్వండి. ఎవరక్కడ? పేరంటాండ్లా? మీరు పాటలందుకుంటేకదా పెళ్ళి హడావిడి మొదలయ్యేది! పాటలు పాడుతూ, ఆటపట్టిస్తూ అమ్మాయికి అన్ని అలంకారాలూ చెయ్యండి. ఏంటి అమ్మాయి ముఖంలో సిగ్గుమొగ్గలు కనబడవేం? వదలకండి; ఏకాంతంలో శ్రీపతిని కలుసుకోబోయే ఆ శుభగడియ ఎప్పుడో అడగండి; అప్పుడు ఎన్ని సిగ్గులొలకబోస్తుందో చూద్దురుగానీ. 

తొందరగా మంగళాష్టకములు చదివి వధువు చేత గౌరీ వ్రతం చేయించండి. వ్రతం పూర్తవగానే పూజచేయించిన మురుగుని(గాజులు) చేతికి తొడగి తీసుకురండి. పురోహితుల వారూ, మంత్రాలవీ నెమ్మదిగా చదివితే ఎలాగూ? చూడాండి, ఒకరినొకరు చూసుకోవాలని ఉబాలటపడి నిక్కి నిక్కి చూస్తూ నెరితెరని కిందకి లాగేస్తున్నారు. ఇక చాలు ఆ నెరితెర తొలగించండమ్మా! జీలకర్రబెల్లం, మాంగల్యధారణం పూర్తయ్యాయి; ఇక నెమ్మదిగా కొంగుముళ్ళు వేయండి.

ఇద్దరి చేతులకూ కంకణదారాలు కట్టించి, పెండ్లి పీటమీద పక్కపక్కన కూర్చోబెట్టండి. అలమేలుమంగ చేయందుకున్నానన్న విజయగర్వంతో శ్రీవేంకటేశుడు లోలోపల ఎంతలా ఆనందిస్తున్నాడో వికసిస్తున్న ఆ ముఖంలో కనబడట్లేదండీ? చూడ చూడ తనివి తీరని ఈ జంటని అందరూ దీవించండి. దీవెనలవి అయిపోయాయి; ఇక ఇద్దర్నీ తీసుకెళ్ళి అలంకరించబడిన ఆ పానుపుమీద కూర్చోబెట్టిరండి.



=======================================
[ Lyrics in RTS format ]
                pallavi
                ade SreevEMkaTapati alamElu maMgayunu
                kadisivunnaaru tamakamuna beMDlikini

                charaNaM 1
                bAsikamulu gaTTarO paipai daMpatulaku
                SEsapAlaMdiyyarO chEtulakunu
                sUsakAla pEraMTAMDlu sObAna pADarO
                mOsapOka yiTTE muhUrtamaDugarO

                charaNaM  2
                gakkunanu maMgaLAshTakamulu chaduvarO
                takkaka jEgaTa vEsi tappakuMDAnu
                nikkinikki chUchEradE neritera tiyyarO
                vokkaTairi koMgumuLLu vonaraga vEyarO

                charaNaM 3
                kaMkaNadAramulanu kaTTarO yiddariki
                suMkula peMDlipeeTa gUchuMDabeTTarO
                laMke SreevEMkaTESu nalamEl maMgani deeviMchi
                aMkela bAnupumeeda namariMcharO 
=======================================

6 comments:

  1. ఎప్పటి లాగే అద్బుతం....!!
    వహ్వా.....బాపు బొమ్మ :)

    ReplyDelete
  2. ఇది కళ్యాణం...కమనీయం...జీవితం
    శ్రీవేంకటేశుడూ, అలమేలుమంగల కళ్యాణం
    బాపు చిత్రం కమనీయం
    విన్నందుకు, కన్నందుకు, పాడుకున్నందుకు ధన్యమైంది మన జీవితం

    మొదటిసారి మీ ఈ బ్లాగు చూసాక నాలో కలిగిన భావన అద్బుతం!

    Best Wishes,
    Suresh Peddaraju

    ReplyDelete
  3. చాలా బాగుంది భాస్కర్ గారు :) పాడుకోవటానికి వీలుగా సాహిత్యం , పాట, అర్ధము అన్ని చక్కగా ఒకచోట కూరుస్తున్నరు .... great job.. :)

    ReplyDelete
  4. వావ్ భాస్కర్ గారు
    అద్భుతం గా వర్ణించారు.
    kudos to you

    ReplyDelete
  5. impressive narration!బాగుంది భాస్కర్గారు.

    ReplyDelete