27 December 2011

ఇట్టె సంసారికి ఏదియూ లేదాయే...

అజ్ఞానం కారణంగా ఈ జనులు సంసారాన్ని భారమనుకుంటున్నారు. జన్మించిన ప్రతి మానవుడూ, ఆడైనా, మగైనా సంసారసాగరమీదక తప్పదు! విశ్రాంతిలేకుండ ఈ భవసాగరమీదుతుంటే అలసిపోవడమే తప్ప సుఖములేదు. భక్తి అనేటి జ్ఞానంతో శ్రీవేంకటేశుడనే గట్టెక్కి సేదతీర్చుకుంటూ, ఆ విశ్రాంతిని ఆస్వాదించుకుని మరలా ఈదినట్టయితే అలసటతెలియదు, జీవితంమీద విసుగుండదు. ఈ గొప్ప తత్వాన్నిఅన్నమయ్య అందరికీ అర్థమయ్యేలా ఎంత సులువైన ఉదాహరణలతో చెప్తున్నారో వినండి...


===================
రాగం : ఆహిరి
ఇక్కడ వినండి
===================

పల్లవి
ఇట్టె సంసారికేదియు లేదాయ
తట్టువడుటేకాని దరిచేరలేదు

చరణం 1
ములిగి భారమోపు మోచేటివాడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలగని భారమెందును దించలేదు

చరణం 2
తడవి వేపచేదు త్రావెడివాడు
ఎడయెడ దిను దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడు జేదెకాని యెక్కడ దీపులేదు

చరణం 3
దొరకొని హేయమే తోడేటివాడు
పరిఠవించును మేన బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుగలేడు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఇట్టె = అలా త్వరగా, క్షణాలలో
సాంసారికేదియు = సంసారికి + ఏదియు
తట్టువడు = బాధపడు, కష్టములు అనుభవించు
దరిచేరలేదు = గట్టుచేరడమన్నది లేదు, ముగింపులేదు

ములిగి  = కూర్చబడిన (packed)
భారపుమోపు = బరువైన మోపు 
(మోపు అనగా, ఉదాహరణకు గడ్డిని ఉంటగా తాడువేసికట్టితే దాన్ని "గడ్డిమోపు" అంటాము)
మోచేటివాడు = తలమీద మోచుకెళ్ళేవాడు
నాడాడను = ఆడ ఆడ = అక్కడక్కడ
అలరు = రోదించే, ఏడ్చే (ఈ అర్థం సరికాదని ఎందరు పండితులు నన్ను తంతారో - అయినా ఇది సరైన అర్థమే)
తొలగని = విడిపోని, తప్పుకోని

తడవి = కష్టపడి
వేపచేదు = చేదైన పదార్థము/ఔషధము, వేపనూన
త్రావెడివాడు = తాగేవాడు
(ఆ రోజుల్లో కొన్ని జబ్బులకు ఔషధముగా వేపనూనె తాగేవారు)
ఎడయెడ = మధ్యమధ్యలో
దిను = తిను
దీపేమైనను = తీపివస్తువేదైనా
అడరు = కష్టపడే
కడు = అత్యధికమైన
జేదేకాని = చేదేకానీ
దీపులేదు = తీపులేదు 
దొరకొని = (మార్గాంతములేక) సిద్ధపడి
హేయము = మలినము, మురికి
తోడేటివాడు = శుద్ధిచేసేవాడు, శుభ్రపరిచేవాడు
పరిఠవించును = ధరించును, చల్లుకొనును
మేన = శరీరము
బరిమళము = పరిమళము = సుగంధద్రవ్యము
అరిది = ధుర్లభమైన
ఇరవు = స్థిరమైన
నెఱుగలేడు = తెలుసుకోలేడు


తాత్పర్యం : [ పైన ఆడియో విన్నవారికి తాత్పర్యం అవసరం ఉండదు :-) ]
వేంకటవిభుని తెలుసుకోలేని అజ్ఞాని సంసారసాగరంలో పలు కష్టాలుపడుతూ భవసాగరమీదటమే తప్ప గట్టెక్కే మార్గమేలేదు.

అడవిలోనుండి కట్టెలమోపు మోసుకొచ్చేవాడు అలసినప్పుడల్లా అక్కడక్కడా ఆ మోపుని కిందదించిపెట్టి కాసేపు సేదతీర్చుకుంటాడు. అయితే అజ్ఞానియైన సంసారికి అటువంటి ఉపాయాలు తెలియవు. అందుకే మోస్తున్న సంసార భారాన్ని తొలగని భారమనుకుంటూ నిష్ఠూరపడుతుంటాడు.

జబ్బుతోనున్నవాడు చేదైన మందుని తాగేప్పుడు మందులోని చేదు తెలియకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కొంచం తేనో, పంచదారో, లేక మరో తీపి పదార్థమో తింటాడు. వేంకటేశ మంత్రమన్న తీపిని తెలుసుకోలేని సంసారి తన జీవితాన ఉన్న చేదుని తాగుతూ ఇబ్బందులు పడుతుంటాడు; అతనికి చేదే తప్ప తీపియుండదు.

మురికికాలువలు శుభ్రపరిచేవాడు తన పని అయిపోగానే శుభ్రంగా స్నానంచేసి నానా విధములైన సుగంధద్రవ్యాలను తనమేనిపై చల్లుకుంటాడు. దుర్వాసనకు దూరమయ్యేందుకు పరిమళద్రవ్యాలు మార్గాలు. అలాగే సంసారంలో పడి నానాకష్టాలు పడుతున్న సంసారికి విముక్తి కలగాలంటే శ్రీవేంకటేశుని తెలుసుకోవడమే స్థిరమైన మార్గము.

================================
[ Lyrics in RTS format ]

rAgaM :  Ahiri

pallavi
iTTe saMsArikEdiyu lEdAya
taTTuvaDuTEkAni darichEralEdu

charaNaM 1
muligi bhAramOpu mOchETivADu
alasi diMchukonu nADADanu
alaru saMsAriki nadiyu lEdAya
tolagani bhArameMdunu diMchalEdu

charaNaM 2
taDavi vEpachEdu trAveDivADu
eDayeDa dinu deepEmainanu
aDaru saMsAriki nadiyu lEdAya
kaDu jEdekAni yekkaDa deepulEdu

charaNaM 3
dorakoni hEyamE tODETivADu
pariThaviMchunu mEna barimaLamu
aridi saMsAriki nadiyu lEdAya
iravu vEMkaTapati ne~rugalEDu
================================
-  annamayya / annamAchArya
================================

03 December 2011

ఇద్దరి తమకము నిటువలెనే...

అన్నమయ్య రాయని భావంలేదు. కీర్తనల్లోని భావాలు జీవితానికి ఉపయోగపడే పాఠాలుగానో, జీవితంలో ఎదుర్కొన్న గమ్మత్తయిన సంఘటనలుగానో ఉంటాయి. ఇది రాశాడు, ఇది రాయలేదని లేదు. రాసిన ప్రతిభావంలోనూ ఆ స్వామినే కీర్తించాడు, స్వామినే పోల్చాడు, అన్వయించాడు. స్వామివారి అన్ని లీలలనీ కీర్తనల్లో భావాలుగాచేసిన గొప్ప భక్తి అన్నమయ్యది.

ఈ కీర్తనలో శ్రీదేవీ పురుషోత్తములను యౌవనప్రాయమొచ్చిన బావామరదళ్ళుగా ఊహించుకున్నారు. మనసులు కలసిన ప్రేమికులు దొంగచాటుగా కలుసుకోవడం, కబుర్లుచెప్పుకోవడం వలపుధర్మంకదా? పెద్దలు పెట్టిన ముహూర్తంవరకు ఆగమంటే కుదురులేని మనసులు వింటాయా? ఒకరికై ఒకరు తపిస్తుంటారు. అయ్యవారేమో పదే పదే కలవాలని సైగలతో సందేశం ఇస్తుంటారు. ఆయనకు కుదిరినంత సులువుగా ఆమెకు కుదరద్దూ? ఎందరి కన్నులు కప్పి రావాలో. ఇన్నీ దాటుకుని ఆమె వచ్చినా అయ్యవారేమో "నీకు నామీద ప్రేమేలేదు; నన్ను చూడాలనే నీకు తోచదు" అని నిందిస్తున్నారు. నా పొందుకు నువ్వెంత పరితపిస్తున్నావో, నీ పొందుకు నేనూ అంతే పరితపిస్తున్నాననీ, కలుసుకోడంలో తనకున్న కష్టాలు ఇవీయని చెప్తున్నారు అమ్మవారు.

 ============================================
రాగం : మధ్యమావతి
శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో 
AUDIO 1
ఇక్కడ వినండి

AUDIO 2
(గాయకుల పేర్లు తెలిస్తే చెప్పండి)
 ============================================



పల్లవి
ఇద్దరి తమకము నిటువలెనే
పొద్దున నేమని బొంకుదమయ్యా

చరణం 1
లలి నాకధరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడే
పొలతికి నేమని బొంకుదమయ్యా

చరణం 2
అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకె నవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా

చరణం 3
పెక్కులు చెవిలో బ్రియములు చెప్పగ 
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవెంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
తమకము =  తొందర, విరహము
ఇటువలనే = ఇటువంటిదే (ఒకలాంటిదే)
పొద్దున = ఉదయం, తెల్లవాఱు
బొంకు =  అబద్ధము

లలి = ప్రేమ, వికాసము, ఉత్సాహము, సొగసు
లంచము = ఉత్కోచము, bribe
పలు = ఎక్కువ, అనేకము
సోకు = స్పర్శ
పరగెనవే =పరసరించినవి, వ్యాపించినవి, పెరిగినవి
బెరసి = క్రూరంగా
నిందవడే = అపవాదమొచ్చెను
పొలతి = మగువ

అడుగుకొను = ప్రాధేయపడు
తడయక = అడ్డులేక
తొడుకొనిరాగా = పట్టుకునిరాగా
దూఱు = నింద
పొదువుగ = కప్పిపుచ్చేలా
పెక్కులు = పలుమార్లు, చాలాసార్లు (పెక్కులంటే మాటలని కూడా అర్థముంది)
ప్రియములు = ప్రేమపూరితమైన మాటలు
జవ్వాది =  పునుగు, సంకుమదము
మోచెనిదె = అంటినది
సడి = అపకీర్తి, నింద, అపవాదము
పుక్కటి = ఊరకే, అప్రయత్నంగ

తాత్పర్యం :
నన్ను కలసుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో, నేనూ అంతే తపనపడుతున్నాను. మనం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎవరి కంటైనా పడితే వాళ్ళడగరూ ఏం చేస్తున్నారని? ఆ సమయానికి వారికి చెప్పేందుకు ఏం సాకులుంటాయి? నువ్వు రమ్మన్నా నేను రాలేదంటే ప్రేమలేకకాదు; ఏ వంకతో కలవాలో తెలియక.

ఎలాగో కలుసుకున్నా, నాకేమో వెళ్ళాలనీ, నీకేమో ఉండాలనీ ఉంటుంది. నువ్వు ఊరుకుంటావా? నన్ను ఇక్కడే కట్టిపడేసేలా, ప్రేమగా అధరాలతో ముద్దుల లంచములిచ్చిపుచ్చుకుంటాము. అప్పుడు తనువులు తాకి, పరవశములు పెరిగిపోతాయి. స్పర్శలూ పెరుగుతాయి. ఇంతలో నేనుకనబడలేదని మావాళ్ళు నన్ను వెతుక్కుంటారు. వెతికే చెలికత్తెలు నన్నుగనుక ఇక్కడ చూస్తే ఇక అంతే! అనవసరమైన నిందలొస్తాయి. ఇక్కడెందుకున్నావని అడిగితే నేనేంవంక చెప్పను?

వెళ్ళాలి వదులు అని నేను బ్రతిమాలుతుంటే నువ్వోమో ఇంకా నన్ను గట్టిగా లాక్కునే ప్రయత్నం చేస్తావు. ఆ కంగారులో నీ గోళ్ళు నా మేన గాయాలుచేస్తాయి. ఆ గాయాలెంటి అని అడగరూ? నిన్ను తీసుకోస్తునట్టు, నీచేయిబట్టుకొని వద్దామనుకుంటాను. ఏంటి ఇలా చేయిబట్టి తీసుకొస్తున్నావే? అని చెలికత్తెలు దూషించనూవచ్చు. దూషించేవారికి ఏం కట్టుకథలు చేప్పగలము?

మనం కలిసి చిలిపి రహస్యాలు చెవిలో ముచ్చటించినప్పుడు నీ బుగ్గలమీదున్న జవ్వాది నా ముక్కుకంటుకుంటుంది. అది చూసి నా చెలికత్తెలందరూ గుసుగుసగా నవ్వుకుని, అనుమానంగా అడుగుతారు. ముందుగా ఏమీ ఆలోచించుకోకుండా అప్పటికప్పుడే నేను తికమకపడుతూ ఏం కథలు చెప్పినా వారు నన్ను నమ్మరు, స్వామీ! మనిద్దరికీ అపవాదమొస్తుంది.

================================

rAgaM : madhyamAvati

pallavi
iddari tamakamu niTuvalenae
podduna naemani boMkudamayyaa

charaNaM 1
lali naakadharamu laMchamiyyagaa
palu sOkulayi paragenavae
piluvagaraagaa berasi niMdavaDae
polatiki naemani boMkudamayyaa

charaNaM 2
aDugukonuchu ninnaMTi penagagaa
taDayaka nakhamulu taake navae
toDukoniraagaa doo~ru meedabaDe
poDavuga naemani boMkudamayyaa

charaNaM 3
pekkulu chevilO briyamulu cheppaga
mukkuna javvaadi mOche nidae
yikkaDa SreeveMkaTaeSuDa saDivaDe
pukkaTi naemani boMkudamayyaa
================================