27 November 2012

చిలుక పలుకులది ఈ చెలియ...

మనిషి జీవితంలో ఎన్ని రకాల సన్నివేశాలుంటాయో అన్ని సన్నివేశాలనూ కీర్తనల్లో వాడుకున్నాడన్నమయ్య! ఇంట్లో పెళ్ళీడొచ్చిన అబ్బాయుంటే అమ్మాయికోసం వెతుకుతాంకదా? మనకు ఓ సంబంధం అన్నివిధాలా సరిపోతుంది అనిపించగానే అబ్బాయికి చెప్తాము. కొందరబ్బాయిలు మారు మాట్లాడకుండ పెళ్ళి చేసుకుంటారు. కొందరేమో " నాకు పెళ్ళొద్దు, ఇప్పుడు పెళ్ళికేం తొందర? కొన్నేళ్ళ తర్వాత చేసుకుంటాను." అని ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకోడానికి చూస్తారు. 

అలా తప్పించుకునేవారికి ఏం చెప్తాం? "సరే పెళ్ళి చేసుకోవద్దుగానీ, ఓ సారి అమ్మాయి ఫోటో అయినా చూడరా" అనో "ఓ సారి అమ్మాయిని చూసొద్దాము, ఆ తర్వాత నీకు నచ్చలేదంటే వద్దులే!" అనో చెప్తాము. ఎందుకంటే మనవాడు ఆ అమ్మాయి ఫోటో చూసినా, లేకుంటే పెళ్ళిచూపుల్లో అమ్మాయితో ఓ మారు మాట్లాడినా ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటానంటాడని మనం చూసిన సంబంధంమీద మనకున్న నమ్మకం!

పెళ్ళీడొచ్చి పెళ్ళొద్దంటున్న కుర్రాడిగా వెంకన్నని ఊహించి ఆ సన్నివేశానికి అన్నమయ్య కీర్తన రాశాడు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో పెళ్ళిచూపులుండేవి కాదుకదా! (ప్రేమ పెళ్ళిళ్ళు మినహా) అమ్మాయిని మొట్టమొదటగా పెళ్ళిపీటలమీద చూడాల్సిందే! మరి ఆ రోజుల్లో అబ్బాయి పెళ్ళొద్దు అంటే, "అలా కాదబ్బాయ్ మేము చూసొచ్చాం కదా? అమ్మాయి అన్నిరకాలుగానూ నీకు చక్కగా సరిపోతుంది. ఈ సంబంధం వదులుకుంటే ఇలాంటమ్మాయి మళ్ళీ దొరకదు. మా మాటలు వద్దులే; మీ మామ చూశాడు అమ్మాయిని. అమ్మాయి గూర్చి ఆయన ఏంచెప్తాడో ఓ సారి విను పోనీ. విన్న తర్వాత నచ్చలేదని చెప్పులే " అంటారు.
 
మేనల్లుడికి అమ్మాయి గురించి వర్ణించి చెప్పే మేనమామ పాత్ర తీసుకున్నాడు అన్నమయ్య! ఆ మహాకవి మాటల్లో శ్రీదేవి అందచందాలగురించి వింటే వెంకన్న "పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు?" అని అడగడూ?

అన్నమయ్య ఏం చెప్పాడో వినండి. [ఈ కీర్తన కాశీయాత్ర సందర్భానికికూడా సరిపోతుందని గమనించగలరు - కాశీయాత్రప్పుడు అక్కడున్న పెళ్ళిపెద్ద పాడే సన్నివేశానికీ సరిపోతుంది ఈ కీర్తన.]


===================================
గరిమెళ్ళ బాకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి పాడిన
ఈ కీర్తనని ఇక్కడ వినండి
 AUDIO

===================================
            పల్లవి
            ఎంత భాగ్యవంతుడవో యీకె నీకు దేవులాయ
            వింతలుగా నీకుగానే వెదకి తెచ్చితిని

            చరణం 1
            అలివేణి జవరాలు అన్నిటాను జక్కనిది
            చిలుకపలుకుల దీ చెలియ
            కలిగె నీకు గన్నుల గలికి యీకె యొక్కతె
            అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం  2
            యిందుముఖి కంబుకంఠి యిన్నిటా నందమైనది
            చందనగంది యీ సకియ
            పొందుగా దొరకె నీకు పువ్వుబోణి యొక్కతె
            అంది యీకె నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం 3
            జక్కవ చన్నులలేమ చక్కెరబొమ్మ బిత్తరి
            చొక్కపు సింగారాల దీ సుదతి
            దక్కె శ్రీవేంకటేశ యీ తరుణి నీకు నొకతె
            అక్కరతో నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

ప్రతిపదార్ధాలు: (సందర్భోచితమైన అర్థాలు)

యీకె = ఈమె, ఈ అమ్మాయి
దేవులాయ = దేవుడికి స్త్రీ లింగం "దేవుల" (అతను దేవుడుగనుక ఆమె దేవుల)

అలివేణి = తుమ్మెద రెక్కలవంటి కురులు కలది
జవరాలు =  పడుచు, యవ్వనంలో ఉన్న స్త్రీ
అలరి = అవధులు లేని ఆనందంతో

ఇందుముఖి = చంద్రబింబం లాంటి ముఖము గలది ( చంద్రుడి చెల్లెలుకదా మరి)
కంబుకంఠి = శంఖము వంటి తీరైన కంఠము గలది (మేలైన శంఖములో మూడు చారలుంటాయి[lines]. శంఖం మీదున్నట్టు కంఠం మీద మూడు గీతలు ఉండడం అదృష్ట చిహ్నం.)
చందనగంది = చందనపు సువాసన కలిగిన స్త్రీ
పొందుగా =  ప్రాప్తముగా
పువ్వుబోణి = పువ్వు వలె లేత సోయగాలుగల పడతి

జక్కువ = చక్రవాకము (చక్రవాక పక్షులు ఎప్పుడూ జంటగా ఉంటాయి. అందుకే చనుగవకు ఉపమానంగా రాశాడు అన్నమయ్య)
లేమ = లేత వయసులోనున్న అమ్మాయి
చక్కెరబొమ్మ = పంచదార బొమ్మ
బిత్తరి = శృంగార చేష్టలు కలిగిన స్త్రీ
చొక్కపు సింగారాలది = స్వచ్ఛమైన సొగసులు కలది
సుదతి = అందమైన పలువరుస కలది
అక్కర = అపేక్ష , Desire


తాత్పర్యం /  Meaning :
 
ఓ వెంకటేశా, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? గొప్ప సుగుణాలున్న ఈ అమ్మాయిని నీ కోసం అపురూపంగా వెతికి తెచ్చాము.

పొడవైన, ఒత్తయిన కురులున్న ఈ యవ్వనవతి అన్ని రకాలుగాను నీకు చక్కగా సరిపోయే సరిజోడు! ఆమె మాటలెలా ఉంటాయంటావా? అనవసరంగా వాయాడిలా మాట్లాడదు; కుదురుగా, చిలకలాగ ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. "నీకోసమే పుట్టింది ఈ కలికి!" అన్నట్టు ఉంది. ఇంక దేని గురించీ ఆలోచించకు; ఆనందంగా పెళ్ళిచేసుకో.

చల్లని చిరునవ్వులొలికే ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. అంతేనా? ఆమె కంఠం శంఖంలా అందంగా ఉంది. (శంఖం మీదున్నట్టు కంఠంమీద మూడు చారలున్న అమ్మాయిని అదృష్టవంతురాలుగానూ, ఉన్నతమైన సంతానాన్ని కనగలిగినదిగానూ చెప్తారు శాస్త్రజ్ఞులు). చందనపు సువాసనలు వెదజల్లే అందగత్తె! పువ్వులాంటి లేత సోయగాలున్న ఈమె చేయందుకోవడం నీ ప్రాప్తంగా భావించి పెళ్ళిచేసుకో.

చక్రవాక పక్షుల్లాంటి కుచద్వయంతో, చక్కెరబొమ్మలా ఉంది. చక్కనైన పలువరుసతో, పరవశింపజేసే లేత సోయగాలతో నీకు స్వచ్ఛమైన శృంగారమొలికించగలదు! ప్రపంచంలో ఇన్ని యోగ్యమైన లక్షణాలతో మరో అమ్మాయి లేదు. ఈ యవ్వనవతి ఒక్కత్తే నీకు సరైన భాగస్వామి. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండ వచ్చి పెళ్ళిచేసుకోవయ్యా, శ్రీవేంకటేశా!

నా విశ్లేషణ :
అలివేణి, ఇంతి, లేమ, తరుణి, జవరాలు వంటి అన్ని పదాలకూ అర్థాలు ఇంచుమించుగా అమ్మాయి, యువతి అన్నవే. మరెందుకు అన్ని రకాలుగా వాడాడంటే, ప్రతి పదానికీ ఓ విశేషమైన కూడిన అర్థముంది. అలివేణి అంటే "తుమ్మెదవంటి కురులుకల యింతి" కదా. అలివేణి అని చెప్పడంలో భావం ఆ అమ్మాయికి అందమైన జుట్టుంది అని. సుదతి అన్నారంటే, అమ్మాయికి పలువరుస (దంతాలు) చక్కగా ఉందని. పళ్ళు హెచ్చుతక్కువగానో, ముందు వెనకగానో లేదు అని భావం. పువ్వుబోణి - పువ్వులవలే మెత్తటి మేనున్న అమ్మాయని.

తేటైన సింగారాలతో అన్నిటా నీకు ఆనందాన్నిస్తుంది అని చెప్పి అలమేలుమంగతో పెళ్ళికి వేంకటేశ్వరుని ఒప్పించడమే ఈ అద్భుతమైన కీర్తన.


=======================================

                 [ Lyrics in RTS format ]

                pallavi
                eMta bhAgyavaMtuDavO yeeke neeku dEvulAya
                viMtalugA neekugAnE vedaki techchitini

                charaNaM 1
                alivENi javarAlu anniTAnu jakkanidi
                chilukapalukula dee cheliya
                kalige neeku gannula galiki yeeke yokkate
                alari iTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM  2
                yiMdumukhi kaMbukaMThi yinniTA naMdamainadi
                chaMdanagaMdi yee sakiya
                poMdugA dorake neeku puvvubONi yokkate
                aMdi yeeke niTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM 3
                jakkava channulalEma chakkerabomma bittari
                chokkapu siMgArAla d
ee sudati
                dakke SreevEMkaTESa yee taruNi neeku nokate
                akkaratO niTTe peMDli yADuduvu rAvayyA
=======================================

16 November 2012

కామినుల చూచి చూచి కన్నుల కొంతపాపము...

మనం చేసిన పాపములు తెలుసుకుని ఆ ఇందిరనాథుని శరణువేడుకున్నప్పుడు తగిన ప్రాయశ్చిత్తములు చేసుకునే మార్గము చూపుతాడు. ఆ ప్రాయశ్చిత్తములు సులువు కావు! అవి కష్టాలరూపాలోనో, సేవలరూపంలోనో, పశ్చాత్తాపం రూపంలోనో వస్తాయి. ఆ పాపాలు తీరేంతవరకు వీటిని అనుభవించిన వారికే ముక్తి కలుగుతుంది.

ఒంటిలో శక్తున్నంతవరకు అన్నిరకాల పాపాలూ చేసినవాడికి వయసుమళ్ళాక ఏం కష్టాలొచ్చినా, ఎన్ని శిక్షలు పడినా ఏం లాభం అంటారా? మనిషికి పశ్చాత్తాపానికన్నా పెద్ద శిక్ష ఉండదు కదా! అందుకే పాపంచేసినవాడిని దండించడానికి చెరసాలలో పెడతారు. ఒంటరితనమూ, అక్కడివాతావరణమూ, ఖాళీ సమయమూ అన్నీ ఆలోచింపజేస్తాయి; చేసినపాపములకు పశ్చాత్తాపపడి మంచిగా మారుతాడనే. అలాగే వృద్ధాప్యము వచ్చినా మరణం రాకపోవడం మరొకరకమైన పాపఫలితమే.


కన్నులతో, చెవులతో, మాటలతో కూడా పాపములు చేస్తామట. ఇంతెందుకు చెడు ఆలోచనలు మదిలో కలిగినా అది పాపం ఖాతాలోకే వస్తుందిట. అన్నమయ్య మాటల్లో వినండి.

===================
AUDIO  
ఇక్కడ వినండి
===================
పల్లవి
పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా


చరణం 1

కామినుల జూచి చూచి కన్నుల గొంతపాపము
వేమరు నిందలు విని వీనుల గొంతపాపము
నామువార గల్లలాడి నాలిక గొంతపాపము
గోమున పాపము మేన గుప్పలాయ నివిగో

చరణం  2

కానిచోట్లకు నేగి కాగిళ్ళ గొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల గొంతపాపము
మాననికోపమే పెంచి మతి గొంతపాపము
పూని పాపములే నాలో బోగులాయ నివిగో

చరణం 3

చేసినట్టి వాడగాన చెప్ప నీకు జోటులేదు
దాసుడ నేనైతి గొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ బనులు

తాత్పర్యం :
మానవుడిగా ఈ భూమిమీద పుట్టిన రోజునుండి ఇంతవరకు నేను చేసిన మంచిపనులేమైనా ఉన్నాయా? ఏ మంచిపనులూ చేసెరగని నన్ను ఎలా కాడతేరుస్తావో?

వలపుతో సంబంధంలేకుండ కనబడినవారినెల్ల కామముతో చూసి కన్నులతో కొంత పాపము చేశాను. లోలోపలున్న చెడ్డవాణ్ణి(pervert) తృప్తి పరిచేందుకు చేరకూడని వారితో చేరి వినకూడని మాటలు విని చెవ్వులతో కొంత పాపము చేశాను. నోటిలో ఆవిరెండిపోయేంతవరకు అబద్ధమూ, దుర్భాషణమూ ఆడి నాలుకతో కొంతపాపము చేశాను. ఉన్నదెల్లా లెక్కలేని పాపములతో నింపుకున్న కాయము తప్ప మరోకటి లేదు!

వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి చేరకూడనివారిని కూడి భుజాంతరాల్లో కొంతపాపమంటించుకున్నాను. ఒళ్ళు వంచి పని చేయకపోవడమే కాదు నా పనులనుకూడా నౌకర్లతో చేయించుకుని చేతులకు మట్టంటకుండ చూసుకొని పాపమంటించాను. ఎల్లవేళలా అంతులేని కోపంతో రగిలే మతితో విహరించి మనసుకి పాపమంటించాను. ఇలా పాపుములు నాలో పూని మేనంతా పోగులైయున్నది.

ఎంతవాడైనాగానీ తాను చేసిన అన్ని తప్పులూ తానంతట తాను చెప్పుకోలేడు; దాచేస్తాడు. నేనూ అంతే! ఇన్ని పాపములు చేసినవాడిని నేనే; అన్నీ చెప్పలేకున్నాను. నీకు తెలుసు నేను పాపిని అని. నిన్ను శరణని దాస్యం వేడి వచ్చినరోజు నన్ను క్షమించ దయతలచుకున్నావు! ఇంతటి దయాళుత్వముగల నిన్ను నేను ఏమని నుతించలనో? నా ప్రియాతి ప్రియమైన శ్రీవెంకటేశా, ప్రపంచంలోని అన్ని క్రియలూ నివల జరుగునవే! 

=================
pallavi
puTTinamodalu nEnu puNyamEmi gAnanaiti
yeTTu gAchEvayya nannu yiMdirAnAthA


charaNaM 1
kAminula jUchi chUchi kannula goMtapApamu
vEmaru niMdalu vini veenula goMtapApamu
nAmuvAra gallalADi nAlika goMtapApamu
gOmuna pApamu mEna guppalAya nivigO

charaNaM  2

kAnichOTlaku nEgi kAgiLLa goMtapApamu
sEva dAnAlaMdukoni chAtula goMtapApamu
mAnanikOpamE peMchi mati goMtapApamu
pUni pApamulE nAlO bOgulAya nivigO

charaNaM 3
chAsinaTTi vADagAna cheppa neeku jOTulEdu
dAsuDa nEnaiti gona dayatalachitivayya
yeesaravulella jUchi yEmani nutiMtu ninnu 

Asala SreevEMkaTESa AyabOya banulu
=================================

26 June 2012

విరహపు మేన మల్లెలు పూచే...

పురుషోత్తముని కలయికకై ఉవ్విళ్ళూరుతోంది పదహారేళ్ళ పడతి శ్రీదేవి. ఆ స్థితిని గమనించిన చెలికత్తెలు ఆమె మదిభావాలను (విరహ వేదనను) పలురకాల పువ్వులతో పోలుస్తున్నారు. కవులు మగువల్ని పువ్వులతోపోల్చడం సహజం;  అన్నమయ్య చూపే వైవిధ్యం ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో చూడండి! మరులుగొన్న శ్రీదేవి మదిలోనూ తనువులోనూ జరిగే మార్పులను అందమైన పువ్వులతో ఉదాహరించారు.

అందం మగువ సహజ లక్షణం. అటువంటిది ఆమె ప్రేమలో పడినప్పుడు ఆ అందం పలురెట్లవుతుంది. గుండెలు నిండిన వలపుతో ప్రియునికై తపించే ఆ పడతి "పూవక పూచిన పూవై" ఎలా వికసించిపోతుందో చెలికత్తెల మాటల్లో వినండి.

======================== 
AUDIO
(నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరకల్పన)
========================

పొలితి జవ్వనమున బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతి చింతాలతలలో సంపెగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోత నడవిజాజులు పూచె
హితవు తెలియ దిక నేమి సేసేదే
తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు పూచె
కొయ్యచూపు గోపముల గుంకుమ పూచె
కయ్యపు వలపుల జీకటిమాకులు పూచె
నియ్యెడ జెలియభావ మేమి సేసేదే
మగువరతులలోన మంకెన పువ్వులు పూచె
మోగి గొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశుపొందుల గప్రము పూచె
ఇగురు బోండ్ల మిక నేమి సేసేదే

ప్రతిపదార్థం : (సందర్భోచితమైన అర్థాలు)
పొలితి = పడతి, మగువ, ఇంతి
జవ్వనము = పదహారేళ్ళ ప్రాయం
బూవక = పూవక
ఎలమి = వికాసము, సంతోషము

చింతాలతలు = చింత+లతలు = అల్లుకుంటున్న ఆలోచనలు
సంపెగ = సంపంగి పువ్వు
తలపోత = వెన్నాడే తలపు, విచారము

తొయ్యలి = మగువ, పడతి
దొంతితామెర = పలురేకులున్న కలువపూవు
కొయ్యచూపు = ప్రేమలేని చూపు
గోపముల => కోపముల
గుంకుమ => కుంకుమ =  కుంకుమపువ్వు [safron]
కయ్యపు = జగడము, గొడవ
జీకటిమాకులు  => చీకటిమాకులు = కదంబం; అంటే కడిమి చెట్టు (కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది)
ఇయ్యెడ = ఇక్కడ
జెలియ => చెలియ

మగువ = పడతి, ఆడది, స్త్రీ
మంకెన = ఎర్రటి రంగు పువ్వు [Pentapetes phoenicea]
మొగి = వరుస
మొగలి = Pandanus odoratissimus
గప్రము = కర్పూరము
ఇగురు =  చిగురు
బోండ్లము = అమ్మాయిలు 

తాత్పర్యం / Meaning :
మొగ్గదశనుండి పూవుగా ఇప్పుడే వికసించినట్లు బాల్య ప్రాయంనుండి యౌవనంలోకి అడుగిడిన పదహారేళ్ళ ఈ పడతి ఆనందించేందుకు మనము చేయగలిగినదేముందే? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

పురుషోత్తముని సతీమణియైన ఈమె మదిలో ఆయన గూర్చి అల్లుకుపోతున్న ఆలోచనలు (చింతాలతలు కదా!) సంపంగిపువ్వుల్లా పూచాయట. ఇక్కడ సంపంగి పూవులనెందుకు ఉపమానంగా వాడారో గమనించాలి. సంపంగి మొగ్గలు విచ్చుకుని పరిమళాన్ని వెదజల్లేది సాయంత్రం సమయాల్లోనే. నిత్యం అతని తలపుల్లోనే తేలియాడుతూ ఉన్నా మలిసంజవేళే కదా ఉద్రేకమైన వలపు భావనలు కలిగేది? అందుకే సంపంగి పూవుల్లా పూచాయట ఆమె మదిలోని తలపులు. ఇంకాస్త సమయం గడిచింది. ఆమె విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలెందుకంటారా? మల్లెల సువాసన మత్తెక్కిస్తుంది; పడతి విరహస్థితి కూడా అదే కదా? మరింత సమయం గడిచింది. ఆ సరసుడు సరసన లేడు; అతని తలచుకుంటూ ఇంకా రాలేదేమని విచారపడుతూ నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పుల తీవ్రత మామూలు జాజుల్లా కాకుండా అడవిజాజులంత హెచ్చుగా ఉందట. "ఈమెకొచ్చిన ఈ కష్టాలు సుఖాలవ్వడానికి మనమేమి చెయ్యగలమే?" అని చెలికత్తెల భావన.

రెండో ఝామైంది; స్వామి రాలేదు. విరహం ఝాము ఝాముకీ హెచ్చింది. తాపాన మరిగిన ఆమె మేను ముచ్చెమటల ఏరయ్యింది. సొగసులు నీట మెరిసే తామరల్లా పూచాయి. దొంతితామరలట! అప్పుడొచ్చాడా కమలనాథుడు. ఏ తొలిఝామో నాయకుడింటికి వచ్చుంటే పాదప్రక్షాళనకు నీళ్ళిచ్చి, చిరునవ్వుల పూవులు గుప్పించి ఆహ్వానించుండేది. ఇలా రెండోఝాము సమయానికొస్తే ఏం చేస్తుంది నాయిక? అదే.. అదే.. నిప్పులుకక్కేంతలా కోపంగా కోయ్యచూపులు చూసిందట. అప్పుడు ఆమె ముఖమూ, కళ్ళూ కుంకుమపువ్వులు పూచినట్టు ఎరుపెక్కాయట. కోపం ఎదిగితే ఏమవుతుంది? గొడవవుతుంది. సిరి హరితో కయ్యానికి దిగి అలిగింది! ఆమె నవ్వులు లేని ఆ రేయి మరింత నల్లబడిందట. కడిమి పూచినంత మనోహరంగా ఆమె అలకలు పూచాయి. చీకటిమాకులు పూచాయని, ప్రేమ నిండిన అలక కూడా చక్కనిదేనని చెప్తున్నారు. అందగత్తె ఏ కళనున్నా అందమే కదా! "స్వామి ఇంటికొచ్చేంతవరకేమో రాలేదే అని బెంగపెట్టుకుంది వచ్చాకేమో దెబ్బలాడుతుంది. ఈ సత్యభామ ప్రవర్తన మనకర్థం కాదే!" అని నొచ్చుకుంటున్నారు చెలికత్తెలు.

తలపోతా, నిట్టూర్పూ, విరహం, కోపం, కయ్యం, అలక - ఇదీ వరుస.  అలక తరువాత ప్రణయం బహు తీయనిది. చురకలూ చెణుకులతో మొదలై గారాలతో సరాగాలలోకి దారితీస్తుంది. గమ్యం వారి కలయిక - వలపుల శిఖరాలు చేరిన ఆ సొగసరి ఎర్రని కోమలమైన మంకెనలా వికసించింది. రతికేళి వేళ స్వామి మునిగోళ్ళు ఆమె కోమల దేహం పై ఏర్పరచిన జాబిలిబుడుగులు మొగలి రేకుల్లా పరిమళించాయి. శ్రీవేంకటేశుని మనసు దోచిన దొరసానినని గర్వించే ఆ పడతి పొగరంతా పరవశించి పవళించిన ఈ వేళ కర్పూరంలా పూచి గాలిలో కరిగిపోయింది అని చెలికత్తెలు "కన్నెపిల్లలం మనకేం తెలుసే వారి వలపులు!" అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

=======================================
[ Lyrics in RTS format ]

politi javvanamuna bUvaka pUche
yelami niMduku manamEmi sEsEdE

sati chiMtAlatalalO saMpegapUvulu pUche
mativirahapu mEna mallelu pUche
atanunitalapOta naDavijAjulu pUche
hitavu teliya dika nEmi sEsEdE

toyyalichemaTaneeTa doMtidAmeralu pUche
koyyachUpu gOpamula guMkuma pUche
kayyapu valapula jeekaTimAkulu pUche
niyyeDa jeliyabhAva mEmi sEsEdE

maguvaratulalOna maMkena puvvulu pUche
mOgi gonagOLLanE mogali pUche
pogaru SreevEMkaTESupoMdula gapramu pUche
iguru bOMDla mika nEmi sEsEdE


=======================================

24 May 2012

నిక్కి నిక్కి చూసేరదే నెరితెర తియ్యరో...

పెళ్ళి - ఈ పదం వినగానే వయసుతో నిమిత్తంలేకుండా అందరి మనసుల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. పెళ్ళయినవారు తమ పెళ్ళివేడుకలను గుర్తుచేసుకుని చిరునవ్వు చిందుతారు. వయసులో ఉన్నవారు తమకు జరగబోయే పెళ్ళిగూర్చిన ఊహా లోకంలో విహరిస్తారు. చిన్న పిల్లలేమో కొత్తబట్టలూ, బంధుజనాల కలయికలూ, ఆటలూ, పాటలూ వీటిని తలచుకుని సంబరపడతారు. పెళ్ళిలో అందరికన్నా ఎక్కువ ఆనందించేది వధూవరులే! మరి వాళ్ళే కదా ఆ వేడుకకి ప్రధాన ఆకర్షణ (center of attraction).

ప్రతి పెళ్ళిలోనూ "పెళ్ళి పెద్ద"గా ఒకాయన వ్యవహరిస్తుంటాడు. ఎవరెవరు ఏ పనులు చెయ్యాలనీ, ఎప్పుడు, ఎలా చెయ్యాలనీ అప్పటికప్పుడు ఆజ్ఞాపిస్తుంటాడు. ఇప్పుడు మనం వీక్షించబోయే పెళ్ళిలో వధూవరులు  శ్రీదేవీ-పురుషోత్తములు; పెళ్ళి పెద్ద మన అన్నమయ్య. ఆయన పెళ్ళి పెద్దగా వ్యవహరించే ఆ కల్యాణాన్ని తిలకించి పులకిద్దామా?

పెళ్ళి జరుగుతోంది; చుట్టూ జనం. అమ్మాయినీ, అబ్బాయినీ పీటల మీద ఎదురెదురుగా కూర్చోబెట్టారు. మధ్యలో ఏమో తెరకట్టేశారు. వధూవరులకేమో ఒకరినొకరు చూడాలన్న ఉత్సుకత(curiosity)! నెమ్మదిగా మంత్రాలు  చదివే ముసలిపంతులవారికి తెలియదుకదా వీళ్ళ కుతూహలం(excitement). ఎంతసేపు చదువుతూనే ఉన్నారు... వీరి ఉబలాటం క్షణక్షణం పెరిగిపోతూ ఉంది... చుట్టూ జనం ఉన్నారనైనా ఆలోచించకుండ, ఆ వధూవరులు మధ్యనున్న తెరపైకి నిక్కి నిక్కి చూస్తున్నారు. ఆ పెళ్ళిలో చోటుచేసుకునే ఇలాంటి ఆహ్లాదకరమైన దృశ్యాలను అన్నమయ్య ఎంత గొప్పగా పదాలలో చిత్రీకరించారో పాటవిని మిరే తెలుసుకోండి.

===============================
గుంటి నాగేశ్వరనాయుడు గారు స్వరకల్పనలో 
వాణీజయరామ్ గారి గళంలో ఈ కీర్తన వినండి

===============================

        పల్లవి
        అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును
        కదిసివున్నారు తమకమున బెండ్లికిని

        చరణం 1
        బాసికములు గట్టరో పైపై దంపతులకు
        శేసపాలందియ్యరో చేతులకును
        సూసకాల పేరంటాండ్లు సోబానంబాడరో
        మోసపోక యిట్టే ముహూర్తమడుగరో

        చరణం  2
        గక్కునను మంగళాష్టకములు చదువరో
        తక్కక జేగట వేసి తప్పకుండాను
        నిక్కినిక్కి చూచేరదే నెరి దెర దియ్యరో
        వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో

        చరణం 3
        కంకణదారములను కట్టరో యిద్దరికి
        సుంకుల బెండ్లిపీట గూచుండబెట్టరో
        లంకె శ్రీవేంకటేశు నలమేల్‌ మంగని దీవించి
        అంకెల బానుపుమీద నమరించరో

    ప్రతిపదార్థం : (సందర్భోచితమైన అర్థాలు)
    కదిసివున్నారు = ఒక్కటవ్వడానికి వేచియున్నారు
    తమకమున = తమకంతో, ఆతురతతో, తొందరపడుతూ
    బెండ్లికిని = పెళ్ళికై

    బాసికము = పెండ్లియందు వధూవరుల నొసట కట్టెడు మౌక్తికహారము
    శేసపాలు = పెళ్ళిలో వధువరులు ఒకరిపై ఒకరు పోసే పువ్వులు, బియ్యము; తలంబ్రాలు
    సూసకాల = చెప్పీ చెప్పనట్టుగా, చాటుమాటుగా
    సోబాన = పెళ్ళిపాట

    గక్కున = తోందరగా; త్వరితముగా; వేగముగా
    తక్కక = అవశ్యముగా
    జేగట = గాజులు; మురుగు
    నిక్కినిక్కి = (తెరపైకి) తలయెత్తి
    ఒనరగ = లక్షణంగా

    సుంకుల = అందముగా అలంకరించబడిన
    లంకె = ఒకటయ్యాడు
    అంకె = పరుపు
    బానుపుమీద = పానుపుమీద; మంచంమీద
    నమరించరో = కూర్చోబెట్టండి
తాత్పర్యం / Meaning :
అదిగో చూడండి, వధూవరులుగా అలంకరించబడిన శ్రీవేంకటేశుడూ, అలమేలుమంగా ఎంత ఆసక్తితో కాచుకునున్నారో పెళ్ళికొరకు!  

కాబోయే ఆ దంపతులకు త్వరగా బాసికాలు కట్టి తలంబ్రాలు చేతికందివ్వండి. ఎవరక్కడ? పేరంటాండ్లా? మీరు పాటలందుకుంటేకదా పెళ్ళి హడావిడి మొదలయ్యేది! పాటలు పాడుతూ, ఆటపట్టిస్తూ అమ్మాయికి అన్ని అలంకారాలూ చెయ్యండి. ఏంటి అమ్మాయి ముఖంలో సిగ్గుమొగ్గలు కనబడవేం? వదలకండి; ఏకాంతంలో శ్రీపతిని కలుసుకోబోయే ఆ శుభగడియ ఎప్పుడో అడగండి; అప్పుడు ఎన్ని సిగ్గులొలకబోస్తుందో చూద్దురుగానీ. 

తొందరగా మంగళాష్టకములు చదివి వధువు చేత గౌరీ వ్రతం చేయించండి. వ్రతం పూర్తవగానే పూజచేయించిన మురుగుని(గాజులు) చేతికి తొడగి తీసుకురండి. పురోహితుల వారూ, మంత్రాలవీ నెమ్మదిగా చదివితే ఎలాగూ? చూడాండి, ఒకరినొకరు చూసుకోవాలని ఉబాలటపడి నిక్కి నిక్కి చూస్తూ నెరితెరని కిందకి లాగేస్తున్నారు. ఇక చాలు ఆ నెరితెర తొలగించండమ్మా! జీలకర్రబెల్లం, మాంగల్యధారణం పూర్తయ్యాయి; ఇక నెమ్మదిగా కొంగుముళ్ళు వేయండి.

ఇద్దరి చేతులకూ కంకణదారాలు కట్టించి, పెండ్లి పీటమీద పక్కపక్కన కూర్చోబెట్టండి. అలమేలుమంగ చేయందుకున్నానన్న విజయగర్వంతో శ్రీవేంకటేశుడు లోలోపల ఎంతలా ఆనందిస్తున్నాడో వికసిస్తున్న ఆ ముఖంలో కనబడట్లేదండీ? చూడ చూడ తనివి తీరని ఈ జంటని అందరూ దీవించండి. దీవెనలవి అయిపోయాయి; ఇక ఇద్దర్నీ తీసుకెళ్ళి అలంకరించబడిన ఆ పానుపుమీద కూర్చోబెట్టిరండి.=======================================
[ Lyrics in RTS format ]
                pallavi
                ade SreevEMkaTapati alamElu maMgayunu
                kadisivunnaaru tamakamuna beMDlikini

                charaNaM 1
                bAsikamulu gaTTarO paipai daMpatulaku
                SEsapAlaMdiyyarO chEtulakunu
                sUsakAla pEraMTAMDlu sObAna pADarO
                mOsapOka yiTTE muhUrtamaDugarO

                charaNaM  2
                gakkunanu maMgaLAshTakamulu chaduvarO
                takkaka jEgaTa vEsi tappakuMDAnu
                nikkinikki chUchEradE neritera tiyyarO
                vokkaTairi koMgumuLLu vonaraga vEyarO

                charaNaM 3
                kaMkaNadAramulanu kaTTarO yiddariki
                suMkula peMDlipeeTa gUchuMDabeTTarO
                laMke SreevEMkaTESu nalamEl maMgani deeviMchi
                aMkela bAnupumeeda namariMcharO 
=======================================

10 April 2012

కల్లయేదో నిజమేదో కాన నేను...

 నిన్నగూర్చి విలపించకుండా, రేపటిగూర్చి చింతించకుండా వర్తమానంలో జీవించే జీవనవిధానం మంచిదే. అయితే వర్తమానంలో ఇష్టమొచ్చినరీతిలో గుడ్డిగా బ్రతకడం సరైన పద్ధతి కాదు. నిన్నటి తప్పులలో నేర్చుకున్న పాఠాలను అన్వయిస్తూ, నేటీకర్మలు రేపటిజీవితాన్ని పాడుచేయని రీతిగా సద్వివేకంతో వర్తమానంలో జీవించడమే పరమార్థం. ఆ జీవిత పరమార్థాన్ని చెప్పే మరో అన్నమాచార్య కీర్తన ఇది. (నాకు బాగా నచ్చిన ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఇదీ ఒకటి).
===================================
రాగం : ముఖారి
నేదునూరి కృష్ణమూర్తి గారి గళంలో
ఇక్కడ వినండి 
====================================

పల్లవి
వెనకేదో ముందరేదో వెఱ్ఱి నేను నా -
మనసు మరులు దేర మందేదొకో

చరణం 1
చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
యేరూపై పుట్టుదునో యెఱుగ నేను
కోరి నిద్రించ బరచుకొన నుద్యోగింతు గాని
సారె లేతునో లేవనో జాడ దెలియ నేను

చరణం 2
తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేగాని
కల్లయేదో నిజమేదో కాన నేను
వల్ల చూచి కామినుల వలపించేగాని
మెల్లమై నా మేను ముదిసిన దెఱగ

చరణం 3
పాపాలు చేసి మఱచి బ్రదుకుచున్నాడగాని
వైపుగ జిత్రగుప్తుడు వ్రాయు టెఱగ
యేపున శ్రీవేంకటేశు నెక్కడో వెతకేగాని
నాపాలి దైవమని నన్ను గాచు టెఱగ

తాత్పర్యం / Meaning :
నిన్నటి తప్పులే ఈరోజు పరిస్థితులకి కారణమని తెలియక, రేపేమవుతానోనన్న ఆలోచనలులేక ఇష్టమొచ్చినరీతిగా వర్తమానంలో జీవిస్తున్న వెఱ్ఱివాడిని నేను. మంచీ చెడూ ఆలోచించకుండ ఎలాపడితే అలా సాగేపోయే జబ్బంటుకున్న ఈ మనసుని నయంచేసే మందేమున్నదో తెలుకోవడంలేదు!

రాబోయే జన్మలలో ధనవంతుడిగా పుట్టాలని నోమునోచే నేను తరువాయి జన్మలలో మనిషిగానే పుడతానా లేక జంతురూపం ధరిస్తానా అన్నది ఆలోచించలేకపోతున్నాను! నిద్రించేముందు రేపటి పనులగురించి ఆలోచిస్తున్నానుగానీ మూసిన కన్నులు తెరచి రేపటి పొద్దుని చూస్తానో లేక నిరంతరంగా కన్నులు మూస్తానో అన్నదానిగురించిన ఆలోచనైనాలేదు; ఎంతటి అజ్ఞానమో నాది!

మెలకువొచ్చాక తెలుసుకుంటున్నాను ఇది కల అన్న విషయం; కలగంటున్నంతసేపు ఇది కలా నిజమా అన్న తేడా తెలుసుకునే జ్ఞానంలేదు. పసితనపు కోరికలూ, ఒంటిలో బలమూ ఉన్నన్ని రోజులు కామినులపొందుగోరి వలపించుతూ ఉన్నానుగానీ, నాకూ వార్ధక్యము వస్తుంది, తనువు సడలిపోతుందన్న వాస్తవాన్ని ఎరుగలేనివాణ్ణి.

లేక్కలేని పాపాలుచేస్తూ సౌకర్యముగా బ్రతుకుతున్నానుగానీ, చిత్రగుప్తుడు పైనుండి శుభ్రంగా నా పాపాలపద్దు రాస్తున్నాడన్న వాస్తవాన్ని గుర్తించలేకున్నాను! దివ్యక్షేత్రాలు తిరిగి ఆడంబరంగా ఖర్చులుపెట్టి పూజలు చేయిస్తూ శ్రీవేంకటేశుడి సేవచేస్తున్నానని గర్వపడుతున్న నా అజ్ఞానాన్ని ఏమనాలి? మంచి పనులు చేస్తూ, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే ఆ దేవుడే ననుచేరి నాలోనే కొలువుండి నన్నుకాచుకుంటాడన్న గొప్ప సత్యం తెలుసుకోలేకున్నాను.=======================================
[ Lyrics in RTS format ]

rAgaM : mukhAri
pallavi
venakEdO muMdarEdO verri nEnu nA -
manasu marulu dEra maMdEdokO

charaNaM 1
chEri meedaTi janmamu sirulaku nOmEgAni
yErUpai puTTudunO yeruga nEnu
kOri nidriMcha barachukona nudyOgiMtu gAni
sAre lEtunO lEvanO jADa deliya nEnu

charaNaM 2
tellavArinappuDellA telisitinanEgAni
kallayEdO nijamEdO kAna nEnu
valla chUchi kAminula valapiMchEgAni
mellamai nA mEnu mudisina deraga

charaNaM 3
pApAlu chEsi marachi bradukuchunnADagAni
vaipuga jitraguptuDu vrAyu Teraga
yEpuna SreevEMkaTESu nekkaDO vetakEgAni
nApAli daivamani nannu gAchu Teraga

=======================================

12 January 2012

ఏటి బిడ్డ కంటివమ్మ యెశోదమ్మా?

రేపల్లెలోని గొల్లభామలు యశోదమ్మ వాకిట చేరి, "ఎలా కన్నావు, యశాదా? ఇంతగొప్పబాలుని? అల్లరి కిట్టయ్యని? అల్లరిబాలుడని వదిలేద్దామన్నా లేదాయే! అల్లరిపనులతోబాటే గొప్పగొప్ప పనులుకూడా చేస్తుంటాడు. ఇటువంటి బిడ్డని కనేందుకు నువ్వెంత పుణ్యము చేశావో? నీ అదృష్టం ఎంతటిదో? మాకెవ్వరికీ అర్థంకాడమ్మా! నువ్వే చెప్పాలి వీడేంటోనని" అని ప్రశ్నిస్తున్నారు. వీరి ఆశ్చర్యాన్నీ, యశోదమ్మ మాటలనూ ఈ కీర్తనలో పూరించారు అన్నమయ్య. 

========================================
రాగం : శంకరాభరణం
( N.C.శ్రీదేవి గారి గళంలో - గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరిచిన కీర్తన)
ఇక్కడ వినండి
=========================================
పల్లవి
ఏటి బిడ్డ గంటివమ్మ యెశోదమ్మ
గాటపుదేవతలెల్ల గాచుకున్నా రితని

చరణాలు :
గొల్లెతలు :
చెక్కుమీటి పాలువోయ చేరి నోరు దేరచితే
పక్కునను బొడచూపె బ్రహ్మాండాలు
అక్కున నలముకొంటే నంగజతాపము మోచె
మక్కువకు వెరతుము  మాయపు బాలునికి

యశోదమ్మ :
పొత్తులలో నుండగానె భుజాలు నాలుగుదోచే
యిత్తల బాలునికేవి యిటువంటివి
యెత్తుకొన్నా వేకమై యెవ్వరికి వసగాడు
హత్తిచూడ వెరతు మీ యారడిబాలునికి

గొల్లెతలు :
తేఱి వీనితోడిముద్దు దేవలోకము పనులు
మీఱి యేవి చూచినాను మితిలేనివి
ఆఱడిగొల్లెతలము అట్టె కూడి యాడితిమి
వేఱు సేయ వెరతుము శ్రీవేంకటాద్రిబాలుని

ప్రతిపదార్థం /  Meaning : (సందర్భోచితమైన అర్థాలు)
ఏటి = ఎటువంటి
గంటివమ్మ = కన్నావమ్మ
గాటపుదేవతలెల్ల = గొప్పగొప్ప దేవతలందరు
గాచుకున్నారు= ఇతనికై వేచియున్నారు

చెక్కుమీటి = చెక్కిళ్ళు నిమిరి/పట్టుకుని
పాలువోయ = పాలుపోసేందుకు/పాలుతాగించేందుకు
పక్కున = తటాలున
బొడచూపె = ప్రత్యక్షింపజేశాడు, చూపాడు
అక్కున = రొమ్ములకు
అలముకొంటే = హత్తుకుంటే, కౌగిలించుకుంటే
అంగజతాపము = పుత్రవాత్సల్యము
మోచె = కలిగినది, వచ్చినది
మక్కువకు = కూరిమికి, వాత్సల్యానికి
వెరతుము = ఆశ్చర్యపోయెదము, భయపడెదము

పొత్తులలో నుండగానె = గర్భములో/కడుపులో ఉండగానే
భుజాలు = భుజములు, చేతులు
నాలుగుదోచే = నాలుగున్నట్టు అనిపించినవి
ఇత్తల బాలునకేమి = అలాంటి బాలునికి ఏమి
యెత్తుకొన్నా వేకమై = ఎత్తుకున్నాము అందరం
యెవ్వరికి వసగాడు = ఎవరికీ శాంతించడు/సాధ్యపడడు
హత్తిచూడ = హత్తుకుని చూస్తే

తేఱి = తేటపడు 
వీనితోడి =వీని
మీఱి  = అతిశయించి, దాటి, కాదని
మితిలేనివి = హద్దూ అదుపులు లేనివి
ఆఱడిగొల్లెతలము = దుష్టగొల్లెతలము 
వేఱుసేయ = వేఱువేఱు అనుకోడానికి
వెరతుము = భయపడెదము

తాత్పర్యం : 
గొల్లెతలు :
ఎలాంటి బిడ్డను కన్నావమ్మ యశోద? దేవలోకంలోని గొప్పదేవతలందరు ఈ చిన్నపిల్లవాడి ఆనతికోసం చూస్తున్నారు. (దేవలోకపు దేవతలందరు ఈ పిల్లవాణ్ణి సదా రక్షించుతున్నారన్న అర్థంకూడా వస్తుంది).

గొల్లెతలు :
మేము పాలుకాచుతుంటే, చల్లచిలుకుతుంటే అక్కడికొచ్చి నిలుచుని చూస్తుంటాడు. అరే చిన్నపిల్లవాడు కదా అని చెక్కిలి పట్టి కాస్త పాలు తాగించుదామనో, వెన్న తినిపించుదామనో "ఎక్కడ, ఆ అని నోరు తెరువు" అంటే, "నువ్వేంటి నాకు వెన్న తినిపించేది? పాలు త్రాగించ్చేది? ఈ అండ చరాచరములన్నియూ నాలో నిక్షిప్తమయున్నాయి" అనే రీతిలో తననోటిలో ప్రత్యక్షింపజేసి చూపుతాడు. దైవ అంశంతో పుట్టినవాడులే అనుకుని హత్తుకుంటే కొడుకుని ఎత్తుకున్నప్పుడు కలిగే పుత్రవాత్సల్యము కలుగుతుంది. వీడు బాలుడా, దేవుడా అని ఆశ్చర్యం కలుగుతుంటుంది మాకు.
వారి మాటలువిన్న యశోద మాతృహృదయం పొంగిపోయి ఇలా అంటుంది...

యశోద :
"మీకిప్పుడే తెలిసింది వాడు అందర్లాంటి బిడ్డకాదని! నాకు వాడు కడుపులో(గర్భంలో) ఉండగానే అర్థమయింది. ఎలా అంటారా? నెలలునిండుతున్నకొద్ది కడుపులో కదిలేబిడ్డ చేయెది, కాలెదని తెలుస్తుంది కదా? వీడు కడుపులో ఉన్నప్పుడు నాలుగుచేతులు కదులుతున్నట్టు అనిపించేది నాకు. అప్పుడే అనుకున్నాను పొత్తిళ్ళలో ఉన్న శిశువు మామూలు శిశువుకాదు దైవాంశముపొందిన బిడ్డ అని. పుట్టాకకూడా అందరు పిల్లల్లా లేదు నా కన్నయ్య. ఎవరయినా ఎత్తుకుని ఊరడించినా ఊరుకోడు. నేనెత్తుకుంటే మాత్రమే గమ్మున ఉండేవాడు. ఇలా ఎన్నెన్నో రకాలుగా నాకు అర్థమయింది నా బిడ్డమామూలు బాలుడు కాదని" అంది హృదయము పొంగిన యశోద.  [పాపం యశోద! కృష్ణుని మీద ఎనలేని వాత్సల్యముతో అతిశయోక్తిగా(exaggeration చేసి) చెప్పేస్తుంది! నిజానికి కృష్ణుణ్ణి మోసి కన్నది తానుకాదన్న నిజం తెలియదు కాదా?]
విన్న గొల్లెతలు ఇలా అంటున్నారు,

గొల్లెతలు :
"అందంగా అల్లరిచేస్తూ ముద్దొచ్చే పసిపిల్లవాడిలానూ ఉంటాడు, పెద్దపనుల్లోనూ జోక్యం చేసుకుని పరిష్కారాలందిస్తుంటాడు.  అల్లరి చేస్తున్నప్పుడు భరించలేక ఈ బాలుణ్ణి "దుష్టుడని" తిడుతుంటాము. మరోసారి వీడు వయసుకుమీరిన మంచిపనులు చేస్తున్నప్పుడేమో "అయ్యో ఇలాంటి బిడ్డనా తిట్టాము" అని నొచ్చుకుంటాము. ఇదంతా చూస్తుంటే ఆ శ్రీవేంకటాద్రి మీద కొలువున్న వెంకటాద్రీశుడే నీ కడుపున బాలుడై పుట్టాడు అనిపిస్తుంది" అని ఆశ్చర్యపోతున్నారు గొల్లెతలు.=======================================
[ Lyrics in RTS format ]

rAgaM : SankarAbharaNaM
pallavi
ETi biDDa gaMTivamma yeSOdamma
gATapudEvatalella gAchukunnA ritani

charaNAlu :

golletalu :
chekkumeeTi pAluvOya chEri nOru dErachitE
pakkunanu boDachUpe brahmAMDAlu
akkuna nalamukoMTE naMgajatApamu mOche
makkuvaku veratumu  mAyapu bAluniki

yaSOdamma :
pottulalO nuMDagAne bhujAlu nAlugudOchE
yittala bAlunikEvi yiTuvaMTivi
yettukonnA vEkamai yevvariki vasagADu
hattichUDa veratu mee yAraDibAluniki

golletalu :
tEri veenitODimuddu dEvalOkamu panulu
meeri yEvi chUchinAnu mitilEnivi
AraDigolletalamu aTTe kUDi yADitimi
vEru sEya veratumu SreevEMkaTAdribAluni 
=====================================

27 December 2011

ఇట్టె సంసారికి ఏదియూ లేదాయే...

అజ్ఞానం కారణంగా ఈ జనులు సంసారాన్ని భారమనుకుంటున్నారు. జన్మించిన ప్రతి మానవుడూ, ఆడైనా, మగైనా సంసారసాగరమీదక తప్పదు! విశ్రాంతిలేకుండ ఈ భవసాగరమీదుతుంటే అలసిపోవడమే తప్ప సుఖములేదు. భక్తి అనేటి జ్ఞానంతో శ్రీవేంకటేశుడనే గట్టెక్కి సేదతీర్చుకుంటూ, ఆ విశ్రాంతిని ఆస్వాదించుకుని మరలా ఈదినట్టయితే అలసటతెలియదు, జీవితంమీద విసుగుండదు. ఈ గొప్ప తత్వాన్నిఅన్నమయ్య అందరికీ అర్థమయ్యేలా ఎంత సులువైన ఉదాహరణలతో చెప్తున్నారో వినండి...


===================
రాగం : ఆహిరి
ఇక్కడ వినండి
===================

పల్లవి
ఇట్టె సంసారికేదియు లేదాయ
తట్టువడుటేకాని దరిచేరలేదు

చరణం 1
ములిగి భారమోపు మోచేటివాడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలగని భారమెందును దించలేదు

చరణం 2
తడవి వేపచేదు త్రావెడివాడు
ఎడయెడ దిను దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడు జేదెకాని యెక్కడ దీపులేదు

చరణం 3
దొరకొని హేయమే తోడేటివాడు
పరిఠవించును మేన బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుగలేడు

ప్రతిపదార్థం /  Meaning : (సందర్భోచితమైన అర్థాలు)
ఇట్టె = అలా త్వరగా, క్షణాలలో
సాంసారికేదియు = సంసారికి + ఏదియు
తట్టువడు = బాధపడు, కష్టములు అనుభవించు
దరిచేరలేదు = గట్టుచేరడమన్నది లేదు, ముగింపులేదు

ములిగి  = కూర్చబడిన (packed)
భారపుమోపు = బరువైన మోపు 
(మోపు అనగా, ఉదాహరణకు గడ్డిని ఉంటగా తాడువేసికట్టితే దాన్ని "గడ్డిమోపు" అంటాము)
మోచేటివాడు = తలమీద మోచుకెళ్ళేవాడు
నాడాడను = ఆడ ఆడ = అక్కడక్కడ
అలరు = రోదించే, ఏడ్చే (ఈ అర్థం సరికాదని ఎందరు పండితులు నన్ను తంతారో - అయినా ఇది సరైన అర్థమే)
తొలగని = విడిపోని, తప్పుకోని

తడవి = కష్టపడి
వేపచేదు = చేదైన పదార్థము/ఔషధము, వేపనూన
త్రావెడివాడు = తాగేవాడు
(ఆ రోజుల్లో కొన్ని జబ్బులకు ఔషధముగా వేపనూనె తాగేవారు)
ఎడయెడ = మధ్యమధ్యలో
దిను = తిను
దీపేమైనను = తీపివస్తువేదైనా
అడరు = కష్టపడే
కడు = అత్యధికమైన
జేదేకాని = చేదేకానీ
దీపులేదు = తీపులేదు 
దొరకొని = (మార్గాంతములేక) సిద్ధపడి
హేయము = మలినము, మురికి
తోడేటివాడు = శుద్ధిచేసేవాడు, శుభ్రపరిచేవాడు
పరిఠవించును = ధరించును, చల్లుకొనును
మేన = శరీరము
బరిమళము = పరిమళము = సుగంధద్రవ్యము
అరిది = ధుర్లభమైన
ఇరవు = స్థిరమైన
నెఱుగలేడు = తెలుసుకోలేడు


తాత్పర్యం : [ పైన ఆడియో విన్నవారికి తాత్పర్యం అవసరం ఉండదు :-) ]
వేంకటవిభుని తెలుసుకోలేని అజ్ఞాని సంసారసాగరంలో పలు కష్టాలుపడుతూ భవసాగరమీదటమే తప్ప గట్టెక్కే మార్గమేలేదు.

అడవిలోనుండి కట్టెలమోపు మోసుకొచ్చేవాడు అలసినప్పుడల్లా అక్కడక్కడా ఆ మోపుని కిందదించిపెట్టి కాసేపు సేదతీర్చుకుంటాడు. అయితే అజ్ఞానియైన సంసారికి అటువంటి ఉపాయాలు తెలియవు. అందుకే మోస్తున్న సంసార భారాన్ని తొలగని భారమనుకుంటూ నిష్ఠూరపడుతుంటాడు.

జబ్బుతోనున్నవాడు చేదైన మందుని తాగేప్పుడు మందులోని చేదు తెలియకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కొంచం తేనో, పంచదారో, లేక మరో తీపి పదార్థమో తింటాడు. వేంకటేశ మంత్రమన్న తీపిని తెలుసుకోలేని సంసారి తన జీవితాన ఉన్న చేదుని తాగుతూ ఇబ్బందులు పడుతుంటాడు; అతనికి చేదే తప్ప తీపియుండదు.

మురికికాలువలు శుభ్రపరిచేవాడు తన పని అయిపోగానే శుభ్రంగా స్నానంచేసి నానా విధములైన సుగంధద్రవ్యాలను తనమేనిపై చల్లుకుంటాడు. దుర్వాసనకు దూరమయ్యేందుకు పరిమళద్రవ్యాలు మార్గాలు. అలాగే సంసారంలో పడి నానాకష్టాలు పడుతున్న సంసారికి విముక్తి కలగాలంటే శ్రీవేంకటేశుని తెలుసుకోవడమే స్థిరమైన మార్గము.

================================
[ Lyrics in RTS format ]

rAgaM :  Ahiri

pallavi
iTTe saMsArikEdiyu lEdAya
taTTuvaDuTEkAni darichEralEdu

charaNaM 1
muligi bhAramOpu mOchETivADu
alasi diMchukonu nADADanu
alaru saMsAriki nadiyu lEdAya
tolagani bhArameMdunu diMchalEdu

charaNaM 2
taDavi vEpachEdu trAveDivADu
eDayeDa dinu deepEmainanu
aDaru saMsAriki nadiyu lEdAya
kaDu jEdekAni yekkaDa deepulEdu

charaNaM 3
dorakoni hEyamE tODETivADu
pariThaviMchunu mEna barimaLamu
aridi saMsAriki nadiyu lEdAya
iravu vEMkaTapati ne~rugalEDu
================================
-  annamayya / annamAchArya
================================