10 April 2012

కల్లయేదో నిజమేదో కాన నేను...

 నిన్నగూర్చి విలపించకుండా, రేపటిగూర్చి చింతించకుండా వర్తమానంలో జీవించే జీవనవిధానం మంచిదే. అయితే వర్తమానంలో ఇష్టమొచ్చినరీతిలో గుడ్డిగా బ్రతకడం సరైన పద్ధతి కాదు. నిన్నటి తప్పులలో నేర్చుకున్న పాఠాలను అన్వయిస్తూ, నేటీకర్మలు రేపటిజీవితాన్ని పాడుచేయని రీతిగా సద్వివేకంతో వర్తమానంలో జీవించడమే పరమార్థం. ఆ జీవిత పరమార్థాన్ని చెప్పే మరో అన్నమాచార్య కీర్తన ఇది. (నాకు బాగా నచ్చిన ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఇదీ ఒకటి).
===================================
రాగం : ముఖారి
నేదునూరి కృష్ణమూర్తి గారి గళంలో
ఇక్కడ వినండి 
====================================

పల్లవి
వెనకేదో ముందరేదో వెఱ్ఱి నేను నా -
మనసు మరులు దేర మందేదొకో

చరణం 1
చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
యేరూపై పుట్టుదునో యెఱుగ నేను
కోరి నిద్రించ బరచుకొన నుద్యోగింతు గాని
సారె లేతునో లేవనో జాడ దెలియ నేను

చరణం 2
తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేగాని
కల్లయేదో నిజమేదో కాన నేను
వల్ల చూచి కామినుల వలపించేగాని
మెల్లమై నా మేను ముదిసిన దెఱగ

చరణం 3
పాపాలు చేసి మఱచి బ్రదుకుచున్నాడగాని
వైపుగ జిత్రగుప్తుడు వ్రాయు టెఱగ
యేపున శ్రీవేంకటేశు నెక్కడో వెతకేగాని
నాపాలి దైవమని నన్ను గాచు టెఱగ

తాత్పర్యం / Meaning :
నిన్నటి తప్పులే ఈరోజు పరిస్థితులకి కారణమని తెలియక, రేపేమవుతానోనన్న ఆలోచనలులేక ఇష్టమొచ్చినరీతిగా వర్తమానంలో జీవిస్తున్న వెఱ్ఱివాడిని నేను. మంచీ చెడూ ఆలోచించకుండ ఎలాపడితే అలా సాగేపోయే జబ్బంటుకున్న ఈ మనసుని నయంచేసే మందేమున్నదో తెలుకోవడంలేదు!

రాబోయే జన్మలలో ధనవంతుడిగా పుట్టాలని నోమునోచే నేను తరువాయి జన్మలలో మనిషిగానే పుడతానా లేక జంతురూపం ధరిస్తానా అన్నది ఆలోచించలేకపోతున్నాను! నిద్రించేముందు రేపటి పనులగురించి ఆలోచిస్తున్నానుగానీ మూసిన కన్నులు తెరచి రేపటి పొద్దుని చూస్తానో లేక నిరంతరంగా కన్నులు మూస్తానో అన్నదానిగురించిన ఆలోచనైనాలేదు; ఎంతటి అజ్ఞానమో నాది!

మెలకువొచ్చాక తెలుసుకుంటున్నాను ఇది కల అన్న విషయం; కలగంటున్నంతసేపు ఇది కలా నిజమా అన్న తేడా తెలుసుకునే జ్ఞానంలేదు. పసితనపు కోరికలూ, ఒంటిలో బలమూ ఉన్నన్ని రోజులు కామినులపొందుగోరి వలపించుతూ ఉన్నానుగానీ, నాకూ వార్ధక్యము వస్తుంది, తనువు సడలిపోతుందన్న వాస్తవాన్ని ఎరుగలేనివాణ్ణి.

లేక్కలేని పాపాలుచేస్తూ సౌకర్యముగా బ్రతుకుతున్నానుగానీ, చిత్రగుప్తుడు పైనుండి శుభ్రంగా నా పాపాలపద్దు రాస్తున్నాడన్న వాస్తవాన్ని గుర్తించలేకున్నాను! దివ్యక్షేత్రాలు తిరిగి ఆడంబరంగా ఖర్చులుపెట్టి పూజలు చేయిస్తూ శ్రీవేంకటేశుడి సేవచేస్తున్నానని గర్వపడుతున్న నా అజ్ఞానాన్ని ఏమనాలి? మంచి పనులు చేస్తూ, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే ఆ దేవుడే ననుచేరి నాలోనే కొలువుండి నన్నుకాచుకుంటాడన్న గొప్ప సత్యం తెలుసుకోలేకున్నాను.



=======================================
[ Lyrics in RTS format ]

rAgaM : mukhAri
pallavi
venakEdO muMdarEdO verri nEnu nA -
manasu marulu dEra maMdEdokO

charaNaM 1
chEri meedaTi janmamu sirulaku nOmEgAni
yErUpai puTTudunO yeruga nEnu
kOri nidriMcha barachukona nudyOgiMtu gAni
sAre lEtunO lEvanO jADa deliya nEnu

charaNaM 2
tellavArinappuDellA telisitinanEgAni
kallayEdO nijamEdO kAna nEnu
valla chUchi kAminula valapiMchEgAni
mellamai nA mEnu mudisina deraga

charaNaM 3
pApAlu chEsi marachi bradukuchunnADagAni
vaipuga jitraguptuDu vrAyu Teraga
yEpuna SreevEMkaTESu nekkaDO vetakEgAni
nApAli daivamani nannu gAchu Teraga

=======================================