11 October 2011

కలికి సిగ్గుల తొలకరివానలు కురిసే...

అన్నమయ్యవారి ప్రతి కీర్తనలోనూ ఒక ఇతివృత్తం(థీం) ఉంటుంది. పదాల ఎన్నికలో ఒక క్రమపద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ కీర్తనలో అమ్మవారి సొబగులను వివిధ రకాల వర్షాలతో పోలుస్తున్నాడు అన్నమ్మయ్య. పదాలలో సరళత్వమూ, వర్ణనలలో ఆశ్చర్యముకలిగించే ఊహలూ ఉన్నాయి.

ఈ కీర్తనకు తాత్పర్యమూ, ముందుమాటా అసలు అక్కర్లేదు. ఎందుకంటే చదవగానే ఇట్టే అర్థమైపోతుంది. కీర్తనలోని భావాము అంతా తన గళమాధుర్యంలో పలికేశారు పద్మశ్రీ బాలసుబ్రమణ్యం గారు. ఈ కీర్తనగురించి పేజీలు పేజీలు రాసినా అర్థంచేసుకోలేని భావాలను ఐదునిముషాల్లో పాడేశారు.

====================================
రాగం : సౌరాష్ట్రం
బాలు గారు అద్భుతంగా ఆలకించిన ఈ కీర్తన 
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================


పల్లవి
పొలతికి నీతోపొందు పోకకు బుట్టెడాయ
యెలమి నీభాగ్య మిక నెంతైనా గద్దయ్యా

చరణం 1
పడతిచెక్కుల వెంట బన్నీటివాన గురిసె
వడి నందె మెఱుగులవాన గురిసె
విడివడి తురుమున విరులవాన గురిసె
చిడుముడి జవ్వనము చిగిరించెనయ్యా

చరణం‌ 2 
మొలకనవ్వులనే ముత్యాలవాన గురిసె
వలపుల బెనుజడివాన గురిసె
కలికిసిగ్గుల దొలుకరివానలు గురిసె
పలుమారు జవ్వనము పదనెక్కీనయ్యా

చరణం‌ 3
సొరిది మోవితేనల సోనలవాన గురిసె
వరుస రతుల దతివాన గురిసె
యిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
పరగిన జవ్వనము పచ్చిదేరెనయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
పొలతి = మగువ, ఇంతి, స్త్రీ
పొందు = జత, తోడు, స్నేహము
పోక = నడక, (పోకకు = జీవయాత్రకు, బ్రతుసాగించేందుకు)
[పోక అంటే వక్క అని మఱో అర్థంకూడా ఉంది]
పుట్టెడు = గంపయంత (కొలమానం)
ఎలమి = సంతోషము, ఆనందము
కద్దయ్యా = కలదయ్యా

పడతి = మగువ, స్త్రీ
చెక్కులు = చెక్కిళ్ళు, బుగ్గలు
పన్నీరు = సుగంధనీరు, గులాబినీరు
విడివడి = వదులుకున్న కురులు
తురుము = కొప్పు
వురులు = పువ్వులు
చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి
జవ్వనము = పడుచునము, యౌవనము

మొలకనవ్వు = లేతనవ్వు, చిరునవ్వు
పెనుజడివాన = భారీవర్షము
పలుమారు = పలుమార్లు
పదనెక్కినయ్యా = కళకళలాడెనయ్యా / వికసించెనయ్య

సొరిది = క్రమలక్షణమైన, శృంగారమైన
మోవి = పెదవులు
వరుసరతి = పద్దతిగల సంగమం
తతివాన = ఋతువనబడేవాన, అదనెఱిగిన వాన
ఇరవై = స్థిరపడి
ఇంతి = స్త్రీ
పరగిన = ప్రసరించిన, పెరిగిన

జవ్వనము = పడుచుతనము, యౌవనము
పచ్చిదేరెనయ్యా = వికసించెనయ్య, కొత్తకళలొచ్చెనయ్యా


తాత్పర్యం :
ఈ శ్రీదేవి ఎంతపుణ్యం చేసుకుందో, నీ పొందుచేరే భాగ్యం లభించింది. జీవితయాత్రలో కలిసి నడిచేందుకు నీవంటి మహానుభావుని తోడు దొరికింది. [ఆమెకూడా ఏం తక్కువకాదు, గనుక పురుషోత్తముడుకూడా అదృష్టవంతుడే అని అమ్మవారి గొప్పలను చరణాలలో చెప్తున్నారు అన్నమయ్య]

ఈమె చెక్కిళ్ళవెంటగారి చెమట పన్నీటివర్షంలా కురుస్తున్నది. ఆ చెమట చినుకులు బుగ్గలను తడిమి నేలజారినందువలనకాబోలు మెఱుగులవర్షంలా ఉంది. బుగ్గలను తాకగానే చెమట బిందువులు మెఱుస్తాయా అని అడుగుతారేమో. అక్కడే ఉంది గుట్టు. ఆము బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి వున్నాయి. ఈ చెమట ఆమె బుగ్గసిగ్గుని కడిగేస్తూ నేల రాలింది. అందుకే ఆ చెమటల పన్నీటి వాన మెఱుస్తున్నది. ఈమె కురులు విరియబోసినట్టుగా(loose hair) అలంకరించుకున్నది. ఆ కురులలోనుండి రాలుతున్న పువ్వులను చూస్తుంటే విరులవర్షంలా ఉంది. విరులవర్షం మధ్య చిగురించే ఆమె అందం ఎలా ఉన్నదంటే, అప్పుడే బాల్య దశనుండి, ఆ బాల్యముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతిలా ఉంది. [చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి]


ఆమె చిరునవ్వు చిందుతుంటే ముత్యాలవర్షం కురిసినట్టుంది. ఆ లేతనవ్వులలో ఆమె మదిలోదాచుకున్న ప్రేమంతా పెనుజడివానలా కురిపించేస్తుంది. ఆ కలికి ఎలా సిగ్గుపడుతుందంటే ఎలా ఉందంటే తొలకరివాన కురిసినట్టుంది. తొలకరివాన కురిస్తే పుడమి తల్లి ఎలాగైతే కొత్త చిగుర్లు తొడుగుతుందో, అలా  సిగ్గుల తొలకరులు కురిపిస్తుంటే ఆ పడతియొక్క పడుచుతనానికి ఇంకా ఇంకా అందం వచ్చేస్తూ ఉంది.


శృంగారమొలికించే ఆమె పెదవులవెంట సన్నటి తేనెవాన కురుస్తుంది. ఆ మగువయొక్క మదిభావము గ్రహించి,  ఆమెను కలిసినవేళ అదునెఱినవర్షం కురిసింది. ఆమె చిత్తములో స్థిరపడి, శ్రీవేంకటేశుడు ఆ మగువను మనువాడి కూడినవేళ ప్రసరించిన ఆమె యౌవనము పచ్చిదేరినది. 


====================================
     rAgaM : sourAshTraM
     pallavi

    polatiki neetOpoMdu pOkaku buTTeDAya
    yelami neebhAgya mika neMtainA gaddayyA

    charaNaM 1

    paDatichekkula veMTa banneeTivAna gurise
    vaDi naMde me~rugulavAna gurise
    viDivaDi turumuna virulavAna gurise
    chiDumuDi javvanamu chigiriMchenayyA

    charaNaM 2

    molakanavvulanE mutyAlavAna gurise
    valapula benujaDivAna gurise
    kalikisiggula dolukarivAnalu gurise
    palumAru javvanamu padanekkeenayyA

    charaNaM 3

    soridi mOvitEnala sOnalavAna gurise
    varusa ratula dativAna gurise
    yiravai SreevEMkaTESa yiMti niTTe kUDitivi
    paragina javvanamu pachchidErenayyA

====================================

2 comments:

  1. మీరు కొంచం సంధులు విడదీస్తే బాగుండేది. ఇది నా సూచన.
    మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు.

    ReplyDelete
  2. అదేమిటో మీ వివరణ అంతా చదివాకా..మాటలు రావు..చిరునవ్వు తప్ప :)
    బాగుంది :)

    ReplyDelete