అన్నమయ్యవారి ప్రతి కీర్తనలోనూ ఒక ఇతివృత్తం(థీం) ఉంటుంది. పదాల ఎన్నికలో ఒక క్రమపద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ కీర్తనలో అమ్మవారి సొబగులను వివిధ రకాల వర్షాలతో పోలుస్తున్నాడు అన్నమ్మయ్య. పదాలలో సరళత్వమూ, వర్ణనలలో ఆశ్చర్యముకలిగించే ఊహలూ ఉన్నాయి.
ఈ కీర్తనకు తాత్పర్యమూ, ముందుమాటా అసలు అక్కర్లేదు. ఎందుకంటే చదవగానే ఇట్టే అర్థమైపోతుంది. కీర్తనలోని భావాము అంతా తన గళమాధుర్యంలో పలికేశారు పద్మశ్రీ బాలసుబ్రమణ్యం గారు. ఈ కీర్తనగురించి పేజీలు పేజీలు రాసినా అర్థంచేసుకోలేని భావాలను ఐదునిముషాల్లో పాడేశారు.
====================================
రాగం : సౌరాష్ట్రం
బాలు గారు అద్భుతంగా ఆలకించిన ఈ కీర్తన
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================
పల్లవిపొలతికి నీతోపొందు పోకకు బుట్టెడాయయెలమి నీభాగ్య మిక నెంతైనా గద్దయ్యాచరణం 1
పడతిచెక్కుల వెంట బన్నీటివాన గురిసెవడి నందె మెఱుగులవాన గురిసెవిడివడి తురుమున విరులవాన గురిసెచిడుముడి జవ్వనము చిగిరించెనయ్యా
చరణం 2మొలకనవ్వులనే ముత్యాలవాన గురిసెవలపుల బెనుజడివాన గురిసెకలికిసిగ్గుల దొలుకరివానలు గురిసెపలుమారు జవ్వనము పదనెక్కీనయ్యా
చరణం 3సొరిది మోవితేనల సోనలవాన గురిసెవరుస రతుల దతివాన గురిసెయిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివిపరగిన జవ్వనము పచ్చిదేరెనయ్యా
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):
పొలతి = మగువ, ఇంతి, స్త్రీ
పొందు = జత, తోడు, స్నేహము
పోక = నడక, (పోకకు = జీవయాత్రకు, బ్రతుసాగించేందుకు)
[పోక అంటే వక్క అని మఱో అర్థంకూడా ఉంది]
పుట్టెడు = గంపయంత (కొలమానం)
ఎలమి = సంతోషము, ఆనందము
కద్దయ్యా = కలదయ్యా
పడతి = మగువ, స్త్రీ
చెక్కులు = చెక్కిళ్ళు, బుగ్గలు
పన్నీరు = సుగంధనీరు, గులాబినీరు
విడివడి = వదులుకున్న కురులు
తురుము = కొప్పు
వురులు = పువ్వులు
చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి
చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి
జవ్వనము = పడుచుతనము, యౌవనము
మొలకనవ్వు = లేతనవ్వు, చిరునవ్వు
పెనుజడివాన = భారీవర్షము
పలుమారు = పలుమార్లు
పదనెక్కినయ్యా = కళకళలాడెనయ్యా / వికసించెనయ్య
సొరిది = క్రమలక్షణమైన, శృంగారమైన
మోవి = పెదవులు
వరుసరతి = పద్దతిగల సంగమం
తతివాన = ఋతువనబడేవాన, అదనెఱిగిన వాన
ఇరవై = స్థిరపడి
ఇంతి = స్త్రీ
పరగిన = ప్రసరించిన, పెరిగిన
జవ్వనము = పడుచుతనము, యౌవనము
పచ్చిదేరెనయ్యా = వికసించెనయ్య, కొత్తకళలొచ్చెనయ్యా
తాత్పర్యం :
ఈ శ్రీదేవి ఎంతపుణ్యం చేసుకుందో, నీ పొందుచేరే భాగ్యం లభించింది. జీవితయాత్రలో కలిసి నడిచేందుకు నీవంటి మహానుభావుని తోడు దొరికింది. [ఆమెకూడా ఏం తక్కువకాదు, గనుక పురుషోత్తముడుకూడా అదృష్టవంతుడే అని అమ్మవారి గొప్పలను చరణాలలో చెప్తున్నారు అన్నమయ్య]
ఈమె చెక్కిళ్ళవెంటగారి చెమట పన్నీటివర్షంలా కురుస్తున్నది. ఆ చెమట చినుకులు బుగ్గలను తడిమి నేలజారినందువలనకాబోలు మెఱుగులవర్షంలా ఉంది. బుగ్గలను తాకగానే చెమట బిందువులు మెఱుస్తాయా అని అడుగుతారేమో. అక్కడే ఉంది గుట్టు. ఆము బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి వున్నాయి. ఈ చెమట ఆమె బుగ్గసిగ్గుని కడిగేస్తూ నేల రాలింది. అందుకే ఆ చెమటల పన్నీటి వాన మెఱుస్తున్నది. ఈమె కురులు విరియబోసినట్టుగా(loose hair) అలంకరించుకున్నది. ఆ కురులలోనుండి రాలుతున్న పువ్వులను చూస్తుంటే విరులవర్షంలా ఉంది. విరులవర్షం మధ్య చిగురించే ఆమె అందం ఎలా ఉన్నదంటే, అప్పుడే బాల్య దశనుండి, ఆ బాల్యముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతిలా ఉంది. [చిడుముడి = బాల్య దశనుండి, ఆ ముడి వీడి యౌవనంలోకి ప్రవేశించిన పడతి]
ఆమె చిరునవ్వు చిందుతుంటే ముత్యాలవర్షం కురిసినట్టుంది. ఆ లేతనవ్వులలో ఆమె మదిలోదాచుకున్న ప్రేమంతా పెనుజడివానలా కురిపించేస్తుంది. ఆ కలికి ఎలా సిగ్గుపడుతుందంటే ఎలా ఉందంటే తొలకరివాన కురిసినట్టుంది. తొలకరివాన కురిస్తే పుడమి తల్లి ఎలాగైతే కొత్త చిగుర్లు తొడుగుతుందో, అలా సిగ్గుల తొలకరులు కురిపిస్తుంటే ఆ పడతియొక్క పడుచుతనానికి ఇంకా ఇంకా అందం వచ్చేస్తూ ఉంది.
శృంగారమొలికించే ఆమె పెదవులవెంట సన్నటి తేనెవాన కురుస్తుంది. ఆ మగువయొక్క మదిభావము గ్రహించి, ఆమెను కలిసినవేళ అదునెఱినవర్షం కురిసింది. ఆమె చిత్తములో స్థిరపడి, శ్రీవేంకటేశుడు ఆ మగువను మనువాడి కూడినవేళ ప్రసరించిన ఆమె యౌవనము పచ్చిదేరినది.
====================================
rAgaM : sourAshTraM
pallavi
polatiki neetOpoMdu pOkaku buTTeDAya
yelami neebhAgya mika neMtainA gaddayyA
charaNaM 1
paDatichekkula veMTa banneeTivAna gurise
vaDi naMde me~rugulavAna gurise
viDivaDi turumuna virulavAna gurise
chiDumuDi javvanamu chigiriMchenayyA
charaNaM 2
molakanavvulanE mutyAlavAna gurise
valapula benujaDivAna gurise
kalikisiggula dolukarivAnalu gurise
palumAru javvanamu padanekkeenayyA
charaNaM 3
soridi mOvitEnala sOnalavAna gurise
varusa ratula dativAna gurise
yiravai SreevEMkaTESa yiMti niTTe kUDitivi
paragina javvanamu pachchidErenayyA
polatiki neetOpoMdu pOkaku buTTeDAya
yelami neebhAgya mika neMtainA gaddayyA
charaNaM 1
paDatichekkula veMTa banneeTivAna gurise
vaDi naMde me~rugulavAna gurise
viDivaDi turumuna virulavAna gurise
chiDumuDi javvanamu chigiriMchenayyA
charaNaM 2
molakanavvulanE mutyAlavAna gurise
valapula benujaDivAna gurise
kalikisiggula dolukarivAnalu gurise
palumAru javvanamu padanekkeenayyA
charaNaM 3
soridi mOvitEnala sOnalavAna gurise
varusa ratula dativAna gurise
yiravai SreevEMkaTESa yiMti niTTe kUDitivi
paragina javvanamu pachchidErenayyA
====================================
మీరు కొంచం సంధులు విడదీస్తే బాగుండేది. ఇది నా సూచన.
ReplyDeleteమీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు.
అదేమిటో మీ వివరణ అంతా చదివాకా..మాటలు రావు..చిరునవ్వు తప్ప :)
ReplyDeleteబాగుంది :)