21 August 2011

నన్నిటు చూడగ నవ్వితివి...

ఏ బంధంలోనైనా పంతాలూ, సాధింపులూ సహజం. అభిమానం, ప్రేమ ఉన్నచోటేగా కోపాలూ, తాపాలూ ఉంటాయ్? ప్రేమించేవారి మీదేగా కోపంచూపగలం? ఊరికే దారినపొయ్యేవాణ్ణి పిలిచి "ఒరేయ్ బడుద్ధాయ్, నీ మీద నాకు కోపమొచ్చింది! నీతో మాట్లాడను" అన్నామనుకోండి, మనల్ని ఎగా దిగా చూసి "అలాగే నాయనా, నువ్వు నాతో మాట్లాడకపోవడమే మంచిది. అది నా పూర్వజన్మ సుకృతం" అంటాడు.

ఆలు-మగలు బంధంలో ఎంతకెంత ప్రేముంటుందో అంతకంత పంతాలుంటాయ్. వీరి ఈగోల(ego) గోలలో కొన్నిసార్లు న్యాయం ఉండచ్చు, కొన్ని సార్లు అసలు లేకపోవచ్చు. ఇక్కడ అమ్మవారికీ-అయ్యవారికీ ఇదే ప్రాబ్లం.

చోటు : తిరుమల
సమయం : సుమంగళి స్త్రీ నుదుటి తిలకంలా తూర్పుకొండలపైన భానుడు మెఱస్తున్నాడు

చిరునవ్వుతోకాకుండ, ఎందుకో ఈ రోజు చిరాకుతో మొదలైంది, అమ్మవారికి! ఎవరిమీద చూపగలదు చిరాకునీ, కోపాన్నీ? ఉన్నది ఆయనేగా? ఆమె చిరాగ్గా ఉందని తెలియక మామూలుగా "నాస్తా తయారైందా? ఇంద్రలోకంలో జరిగే దేవతల సమావేశానికి వెళ్ళాలి. సమయమైంది" అన్నారు అయ్యవారు. ఆనకట్టేసిపెట్టిన అమ్మవారి కోపానికి ఈ ప్రశ్న గండి వేసింది. అమ్మవారు అక్షింతలు చల్లడం మొదలుపెట్టారు. 'ఓకరు కోపంగా ఉన్నప్పుడు మఱొకరు మౌనంగా ఉండాలి' అన్న వారి ఒడంబడిక ఆ కోపక్షణాలలో గుర్తు రాలేదు. ఏ కారణం లేకుండ నా మీద అరవడమేంటి యని అయ్యవారు కోపపడ్డారు. అల్పాహారము తినకుండా వెళ్ళిపోయారు. ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదన్న మఱో ఒడంబడికనూ మరిచాడని ఇంకా కోపమొచ్చింది అమ్మవారికి.

"మీరలిగెళ్ళిపోతే నాకు ముద్ద దిగదనుకున్నారేమో" అని కంచం ముందర పెట్టుకున్నారు. ఆయనమీద కోపంలో తిందాం అనుకున్నారుగానీ నిజానికి ఆయన తినకుండా వెళ్ళిపోయారన్న బాధ ఆమెను తిననివ్వలేదు. కాసేపటికి, తానెందుకు అలా ప్రవర్తించిందో అని నొచ్చుకుని పశ్చాత్తాపపడ్డారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు తనదే తప్పంతా అని ఒప్పుకుని ఆయన చేత క్షమాపణ చెప్పించుకుందామని నిర్ణయించుకున్నారు. [పెళ్ళికాని వారంతా, ఇదెక్కటి విడ్డూరం అనుకుంటారేమో - పెళ్ళైతే తెలుసుతుంది! ఇద్దఱిలో తప్పెవరు చేసినా క్షమాపణ మాత్రం మొగుడే చెప్పాలి. అదే ఇక్కడ (అ)ధర్మం!]

ఇంద్రలోకం చేరుకున్న అయ్యవారి మనసంతా కలతలమేఘాలు ఆక్రమించుకున్నాయ్. సమావేశంలో ముఖ్య అతిథి ఈయనే. మనసొకచోట, మనిషొకచోట అనే రీతిలో సమావేశంలో పాల్గొన్నారు. భోజనవిరామం. పరవమశివుడు, "బావా, నాతోబాటు ఇంటికి రావచ్చుగా?" అంటే. భవుడు పిలిచి వెళ్ళకుంటే బాగుండదేమోనని ఆయనతోబాటు మాట్లాడుతూ నడిచారు. ఉదయం ఇంట్లో జరిగినదంతా మనసులో మెదిలింది. ఇప్పుడేం చేస్తుంటుందో అని ఊహించుకున్నారు. తను ఆహారమేమీ తినలేదుకాబట్టి తన ఇల్లాలుకూడా ఏమి తినదు అనుకున్నారు. అయినా ఇప్పటికిప్పుడు వెళ్ళి తిరిగిరావడం సాధ్యమా? అని ఆలోచిస్తుండగానే కైలాసము చేరుకున్నారు ఇద్దఱూ.


పార్వతిదేవికి ఆనందమేసింది అన్నగారి రాక. శివుడు 'నేనెంత మంచి పని చేశానో చూడు' అనే రీతిలో కోంచం గర్వంగా ఫీల్ అయ్యాడు. కుశలప్రశ్నలు అడిగింది, పార్వతి. కాసేపటికి, భోజనం వడ్డిస్తాననగా


"నాకొద్దమ్మా, మీ వారికి వడ్డించు. ఇవాళ మీ వదినేదో నోమునోచుకుంటుంది! అందుకని రోజంతా ఉపవాసముంటుంది. తను ఉపవాసమున్న రోజుల్లో నేనూ ఉపవాసముంటాను. ఏమనుకోవద్దు. ఇంతదూరమొచ్చాను, ఒక్కసారి నిన్ను చూసివెళ్దామని ఇటువచ్చాను. మఱోరోజు ఇద్దఱం కలిసి వస్తాం భోజనానికి" అని అబద్ధమాడారు.


టక్కున పార్వతి శివునివంక చూసింది, ఈ సంభాషణ వింటున్నాడో లేదో అని. నిజానికి శివుడు వీరి సంభాషణను పూర్తిగా వినలేదు. పార్వతి చూపుల్లో ఏదో ఒక ఆజ్ఞ ఉందని మాత్రం గ్రహించాడు.  ఎందుకైనా మంచిదిలే అని 'నువ్వేమంటే అదే' అనే భావంతో తలూపాడు.


"ఎప్పుడో ఒక్కసారి ఇటు దయచేస్తావు. అలా వచ్చినప్పుడే ఉపవాసం పెట్టుకోవాలా" అని నొచ్చుకుంది, పార్వతి. శివుడి భోజనం పూర్తయ్యాక మళ్ళి ఇంద్రలోకం చేరుకున్నారు.

ఇంక ఇక్కడ, తిరుమలగిరిపైన అమ్మవారేమో మధ్యాహ్నం వస్తాడు అయ్యవార అని వేచిచూస్తున్నారు.  మధ్యాహ్నంకూడా దాటిపోయింది. ఆయనేమోరాలేదు. రాకపోయినా గరుత్మంతుడిచేత వర్తమానమైనా పంపించలేదు రావడంలేదని. మఱింత బాధేసింది అమ్మవారికి. ఇక ఆయనొచ్చేది సాయంకాలమే అని అర్థమైంది. రాత్రి భోజనం తయారుచేసి ఆయనకోసం గుమ్మంపట్టుకు నిల్చున్నారు.


ఆహారంలేక అలసివచ్చిన అయ్యవారికి, నీరుకారే కళ్ళతో గుమ్మంపట్టుకుని నిలుచున్న ఆమెను చూడగానే బాధేసింది! ఆయ్యవారు పలకరించారు. అమ్మవారు విసురుగా "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నారు. 'అన్నెంపున్నెం ఎఱుగని నన్ను తిట్టావు? అయినా నేనే దిగివచ్చి పలకరించాను. నువ్వు బెట్టుచేస్తావా' అని ఆయనా, 'మధ్యాహ్నం రావడంలేదన్న ముక్క గరుత్మంతుడితోనైనా వర్తమానం పంపుండచ్చుగా?' అని ఆమే, కొపాన్ని అలానే కొనసాగించారు. మౌనంగా ఆహారం ఆరగించారు.

ఆలుమగలు మధ్య ఎటువంటి గొడవైనా సరే రాత్రి నిద్రపోయేసమయానికి ఎవరో ఒకరు తగ్గి సంధి చేసుకుని సమాధానమైపోవాలి. ఒకేపానుపుపైన వైరముతో ఉన్న ఇద్దఱిని  నిద్రదేవి ఎలా అక్కునచేర్చుకోగలదు? 

అమ్మవారే దిగొచ్చారు. ఆయన దగ్గరకెళ్ళి,
"ఉదయం అలా మీమీద అలా విరుచుకుపడ్డాను; తప్పెల్లా నాదే! అయితే మీరేం చేశారు? 'ఒకరు కోపపడినప్పుడు మఱొకఱు శాంతంగా ఉండాలి' మీరు మన ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దానికి దీనికి సరిపోయింది. అదేకాదు, 'ఎంత కోపమున్నా ఆహారం మీద చూపకూడదు' మీరు ఈ ఒప్పందాన్నికూడా అతిక్రమించారు. నా ఒక్క తప్పుకి, మీరు చేసిన రెండు తప్పులు చెల్లుబడి అయిపోయింది. రండి, కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం" అని శ్రీరాగం లో ఆలకిస్తున్నారు అమ్మవారు. అంత తీయగా బ్రతిమాలుతుంటే అయ్యగారు కరిగిపోరాయేంటి? 

(కీర్తన/తాత్పర్యం చదివాక 'అమ్మవారేంటీ, పతిని ఏకవచనంలో సంబోధిస్తున్నారు? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధము కదా?' అని అడుగుతారేమో. నిజానికి పతిని మీరు, గారు, ఆయన అని సంబోధించడం మనం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చుకున్న మిథ్య ఏమో అని నా ఉద్దేశము. మన ప్రాచీన సాహిత్యాలు తిరగేస్తే, పతిని ఏకవచనంలో సంబోధించేటట్టు సూచించే ఘట్టాలు కోకొల్లలు. అలా సంబోధించడంలో అనంతమైన వాత్సల్యభావామే ఉంటుందికానీ, అవమానమేమీ కాదని గుర్తించాలి.)

===============================================
రాగం : శ్రీరాగం
కౌశల్య గారి గళంలో గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరచిన
 AUDIO
 (సాహిత్యంలోని కొన్ని పదాలను Tune కొసం మార్చిపాడారని గమనించగలరు)
===============================================

పల్లవి 
పంతము చెల్లెను బదగదరా
యింతలోన దప్పు లెంచక పదరా
 
చరణం 1
రాని కోపమున రవ్వ సేసితి నింతే
పానుపుమీదికి బదగదరా
సోనలచెమటల సొలసితి నింతే 
తేనెమోవి దప్పి దేర్చె బదరా
 
చరణం 2
అనుమానానీకు నలిగితి నింతే 
పని గల దిక నటు పదగదరా
నను నిటు చూడగ నవ్వితి నింతే
తనిపే నీమతి తావుకు పదరా
చరణం 3
పాసిన కాకల బలికితి నింతే
బాసలు నమ్మితి బదగదరా
ఆసల శ్రీవేంకటాధిప కూడితి
వేసారపురతి వెనకకు బద

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

పంతము = పౌరుషము
చెల్లెను = తీరిపోయింది, సరిపోయింది
పదగదరా = వెళ్దాంరారా
తప్పులెంచకు = తప్పుపట్టకు

రాని కోపమున =  పైపైకి నటిస్తున్న కోపంతో
రవ్వ సేసితి నింతే = రట్టడి చేశాను అంతే
పానుపుమీదకి = మంచంమీదకి
పదగదరా = వెళ్దాం రారా
సోనలచెమటల = చెమటలవర్షంతో
సొలసితి నింతే = నీరసపడిపోయాను
తేనెమోవి = తేనెలూరే పెదవుల
దప్పి దేర్చు పదరా = దప్పికి తీర్చుకుందాం పదరా

అనుమానానీకు = నువ్వు కోపంగా వెళ్ళాక  ఎక్కడెలా ఉన్నావో అని ఆలోచిస్తూ
నిలిగితి నింతే = నలిగిపోయాను
పని గల దిజ నటు = నీతో పనుంది
పదగదరా = వెళ్దాం రారా
నను నిటు చూడగ = నువ్వు ఇందాక ఓరకంటితో చూసినప్పుడు
నవ్వితి నింతే = (నువ్వు రాజీపడిపోదామని) నవ్వాను
తనిపె నీమతి = నీమనసులోని కోపంచాల్లారింది
తావుకు పదరా = చోటికి(మంచం దగ్గరకి) పదరా

పాసిన కాకల = పాతబడిపోయిన కోపముతో(కోపం తగ్గిపోయిందట)
పలికితి నింతే = మాట్లాడాను అంతే
బాసలు నమ్మితి = నువ్వు ఏం చెప్తే అవే నిజమని నమ్మేశాను
పదగదరా = వెళ్దాం రారా
ఆస =  ప్రేమ
వేంకటాధిప = వెంకటాద్రిని ఏలేటీ అధిపతి
కూడితి = కూడాను
వేసారపు = విసుక్కోకుండ
రతి వెనుకకు = రతి వెనుకగు = సంగమానికి జతకాడిగా
బదరా = పదరా = వెళ్దాంరారా

తాత్పర్యం :
నేను పట్టిన పంతానికి, నువ్వు పట్టిన పంతాలు చెల్లుబాటైపోయింది. ఇంక తప్పులెంచకుండ రాజీపడిపోదాం రా, స్వామీ.


ఉదయం అదేదో చిరకుతో ఉన్నాను, ఆ కోపం అప్పుడే కాసేపటికి మాయమైపోయింది. నేనే అనవస్రంగా రట్టడి చేశాను, తప్పునాదే! ఈరోజంతా నిన్ను ఇబ్బందిపెట్టాను. ఇప్పుడు అవన్ని మరిచిపోయి కబుర్లుచెప్పుకుంటూ పడుకుందాం పద. ఉదయంనుండి నీగురించే ఆలోచిస్తున్నాను. మనసంతా అలజళ్ళై, ఒళ్ళంతా చెమటలుపట్టేశాయి. నీరసపడిపోయున్నాను. గుక్కెడు మంచినీరైనా తాగలేదు. గొంతెండిపోయింది. నీ పరిస్థితికూడా అదే అని నాకు తెలుసు. తేనెలూరే పెదవులతో దాహాలు తీర్చుకుందాం పద.


నువ్వుతినకుండా కోపగించుకుని వెళ్ళిపోయావు. ఎక్కడికెళ్ళావో, ఎలా ఉన్నావో, ఎప్పుడొస్తావో అని ఆరాటంలో నలిగిపోతున్నాను. నా ఐదునిముషాల కోపానికి రోజంతా వేదనపడమని వదిలెళ్ళిపోతావా? పానుపుమీదకి రా నీపని చెప్తాను. ఇందాక భోజనంచేస్తుండగా ఓరకంట ఓ క్షణం అలా నావైపు చూశావు, రాజీపడిపోదామని వెంటనే నేను స్నేహంగా నవ్వాను. నువ్వూ నవ్వుతావని చూశాను. దొంగ నువ్వు! బిగువుగా చూపావు. నీమనసు అప్పుడే కరిగిపోయిందని నాకు తెలుసులే పద.


నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకసలు కోపమేలేదు. నువ్వురాగానే వాటేసుకుని అలానే ఎంతకాలమైనా ఉండిపోవాలనే అనుకున్నా. అయినా నా పౌరుషం అడ్డుపడింది. అందుకే కోపం నటిస్తూ "నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు" అన్నాను. అదంతా ఉత్తుత్తికోపమే. నాగురించి నీకు తెలుసుకదా? నేనన్నానే అనుకో నీకెక్కడి పోయిందోయ్? నువ్వు చెప్పే తీయతీయని కబుర్లను వింటూ కరిగిపోయేదాన్ని కదా? నా ఆశలకు మూలపురుషుడైన శ్రేవేంకటపతీ, విసుక్కున్నది చాలు! రతికి జతపడుదాం రాయిక.




================================================================

rAgaM : Sree rAgaM

pallavi

paMtamu chellenu badagadarA
yiMtalOna dappu leMchaka padarA

charaNaM 1
rAni kOpamuna ravva sEsiti niMtE
pAnupumeediki badagadarA
sOnalachemaTala solasiti niMtE
tEnemOvi dappi dErche badarA

charaNaM 2
anumAnAneeku naligiti niMtE
pani gala dika naTu padagadarA
nanu niTu chUDaga navviti niMtE
tanipE neemati tAvuku padarA

charaNaM 3
pAsina kAkala balikiti niMtE
bAsalu nammiti badagadarA
Asala SreevEMkaTAdhipa kUDiti
vEsArapurati venakaku badarA

=============================================================

9 comments:

  1. చాలా అద్భుతంగా రాసారు భాస్కర్ గారూ.కొన్ని అచ్చుతప్పులున్నాయి సరిచెయ్యండి.

    క్షమాపన...క్షమాపణ
    సామావేశంలో..సమావేశంలో
    మనసొక్కచోట,మనిషొక్కచోట..మనసొకచోట,మనిషొకచోట
    ఇద్దఱూ,మఱోరోజు...ఇద్దరూ,మరో రోజు.(ఎక్కువగా "ఱు" వాడుతున్నారు "రు" వాడాలినచోట్ల)
    సంభషణ...సంభాషణ
    గరుక్మంతుడిచేత...గరిత్మంతుడిచేత
    'అణ్యంపుణ్యం...అన్నెం పున్నెం

    ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే నాకు తెలుగు డ్రాఫ్ట్ పంపుతూ ఉండండి,నేను సరిచేసి పంపుతూ ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే(ఇది కూడా ఒక సేవే అనుకుంటా)

    ReplyDelete
  2. అన్నయ్యా సూపర్ పోస్ట్. వర్ణన ఎంత అందంగా ఉందో.

    ReplyDelete
  3. భాస్కర్ గారు.. ఎంత అందంగా..సహజంగా వర్ణించారు. మనసెరిగిన ఆలుమగల మధ్య అలుకలు,కోపతాపాలు,పట్టింపులు అన్ని..క్షణాలలో..మటుమాయం. చాలా బాగా చెప్పారు.అభినందనలు.
    ఎవరైనా ఆలుమగల మధ్య కోల్డ్ వార్ మొదలవగానే..ఈ పోస్ట్ చూపుతాను.

    ReplyDelete
  4. This is very well written post. Possibly the best Annamayya post I read on your blog till date.

    BTW, indra sabhaki SivuDuu, vishNuvuu veLLaDam EmiTi? neneppuDuu vinalEdu. only devatalu kadaa velledi?

    ReplyDelete
  5. నీ ప్రశంసా వ్యాఖ్య నా బ్లాగుకందడం అదౄష్టం! ధన్యవాదములు, ఫణింద్రా.

    కీర్తనకు ముందు రాసిన ఉపోద్ఘాతమంతా నా కల్పన. కల్పనెందుకు రాశావు అనడిగితే, చదివే పాఠకులు కీర్తనలోని భావాన్ని బాగా అర్థం చేసుకోడానికి నేను శ్రుష్టించిన ఓ చిన్ని సరదా కథ. చాలా వరకు అన్నమయ్య కీర్తనల్లోని భావాలు మానవ జీవితానికి అత్యవసరమైన పాఠాలు. ఆ పాఠాన్ని విపులీకరించి చెప్పడానికి నేను చేసిన ప్రయత్నమే ఆ కథ - విష్ణు మూర్తీ, శివుడూ ఇంద్రసభకు వెళ్ళినట్టు ఎక్కడా చెప్పబడలేదు పురాణాల్లో. ఇలా రాయడం సరికాదనిపించినచో తెలియజేయ మనవి.

    -Bhaskar

    ReplyDelete
  6. Avineni Bhaskar garu ... your blog is nice, your effort to bring Annamayya kirtna's meanings and essence to general language is appriciated. Only request is please don't over emphasis on expressions which are not in the original, that makes some of the readers feel carried away from the original meaning ! However, I like your effrots ! Please Keep posting.

    ReplyDelete
  7. mocharla gaaru, thank you for your valuable feedback. will definitely keep this for upcoming posts.

    thank you again.

    ReplyDelete