27 November 2012

చిలుక పలుకులది ఈ చెలియ...

మనిషి జీవితంలో ఎన్ని రకాల సన్నివేశాలుంటాయో అన్ని సన్నివేశాలనూ కీర్తనల్లో వాడుకున్నాడన్నమయ్య! ఇంట్లో పెళ్ళీడొచ్చిన అబ్బాయుంటే అమ్మాయికోసం వెతుకుతాంకదా? మనకు ఓ సంబంధం అన్నివిధాలా సరిపోతుంది అనిపించగానే అబ్బాయికి చెప్తాము. కొందరబ్బాయిలు మారు మాట్లాడకుండ పెళ్ళి చేసుకుంటారు. కొందరేమో " నాకు పెళ్ళొద్దు, ఇప్పుడు పెళ్ళికేం తొందర? కొన్నేళ్ళ తర్వాత చేసుకుంటాను." అని ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకోడానికి చూస్తారు. 

అలా తప్పించుకునేవారికి ఏం చెప్తాం? "సరే పెళ్ళి చేసుకోవద్దుగానీ, ఓ సారి అమ్మాయి ఫోటో అయినా చూడరా" అనో "ఓ సారి అమ్మాయిని చూసొద్దాము, ఆ తర్వాత నీకు నచ్చలేదంటే వద్దులే!" అనో చెప్తాము. ఎందుకంటే మనవాడు ఆ అమ్మాయి ఫోటో చూసినా, లేకుంటే పెళ్ళిచూపుల్లో అమ్మాయితో ఓ మారు మాట్లాడినా ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటానంటాడని మనం చూసిన సంబంధంమీద మనకున్న నమ్మకం!

పెళ్ళీడొచ్చి పెళ్ళొద్దంటున్న కుర్రాడిగా వెంకన్నని ఊహించి ఆ సన్నివేశానికి అన్నమయ్య కీర్తన రాశాడు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో పెళ్ళిచూపులుండేవి కాదుకదా! (ప్రేమ పెళ్ళిళ్ళు మినహా) అమ్మాయిని మొట్టమొదటగా పెళ్ళిపీటలమీద చూడాల్సిందే! మరి ఆ రోజుల్లో అబ్బాయి పెళ్ళొద్దు అంటే, "అలా కాదబ్బాయ్ మేము చూసొచ్చాం కదా? అమ్మాయి అన్నిరకాలుగానూ నీకు చక్కగా సరిపోతుంది. ఈ సంబంధం వదులుకుంటే ఇలాంటమ్మాయి మళ్ళీ దొరకదు. మా మాటలు వద్దులే; మీ మామ చూశాడు అమ్మాయిని. అమ్మాయి గూర్చి ఆయన ఏంచెప్తాడో ఓ సారి విను పోనీ. విన్న తర్వాత నచ్చలేదని చెప్పులే " అంటారు.
 
మేనల్లుడికి అమ్మాయి గురించి వర్ణించి చెప్పే మేనమామ పాత్ర తీసుకున్నాడు అన్నమయ్య! ఆ మహాకవి మాటల్లో శ్రీదేవి అందచందాలగురించి వింటే వెంకన్న "పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు?" అని అడగడూ?

అన్నమయ్య ఏం చెప్పాడో వినండి. [ఈ కీర్తన కాశీయాత్ర సందర్భానికికూడా సరిపోతుందని గమనించగలరు - కాశీయాత్రప్పుడు అక్కడున్న పెళ్ళిపెద్ద పాడే సన్నివేశానికీ సరిపోతుంది ఈ కీర్తన.]


===================================
గరిమెళ్ళ బాకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి పాడిన
ఈ కీర్తనని ఇక్కడ వినండి
 AUDIO

===================================
            పల్లవి
            ఎంత భాగ్యవంతుడవో యీకె నీకు దేవులాయ
            వింతలుగా నీకుగానే వెదకి తెచ్చితిని

            చరణం 1
            అలివేణి జవరాలు అన్నిటాను జక్కనిది
            చిలుకపలుకుల దీ చెలియ
            కలిగె నీకు గన్నుల గలికి యీకె యొక్కతె
            అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం  2
            యిందుముఖి కంబుకంఠి యిన్నిటా నందమైనది
            చందనగంది యీ సకియ
            పొందుగా దొరకె నీకు పువ్వుబోణి యొక్కతె
            అంది యీకె నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం 3
            జక్కవ చన్నులలేమ చక్కెరబొమ్మ బిత్తరి
            చొక్కపు సింగారాల దీ సుదతి
            దక్కె శ్రీవేంకటేశ యీ తరుణి నీకు నొకతె
            అక్కరతో నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

యీకె = ఈమె, ఈ అమ్మాయి
దేవులాయ = దేవుడికి స్త్రీ లింగం "దేవుల" (అతను దేవుడుగనుక ఆమె దేవుల)

అలివేణి = తుమ్మెద రెక్కలవంటి కురులు కలది
జవరాలు =  పడుచు, యవ్వనంలో ఉన్న స్త్రీ
అలరి = అవధులు లేని ఆనందంతో

ఇందుముఖి = చంద్రబింబం లాంటి ముఖము గలది ( చంద్రుడి చెల్లెలుకదా మరి)
కంబుకంఠి = శంఖము వంటి తీరైన కంఠము గలది (మేలైన శంఖములో మూడు చారలుంటాయి[lines]. శంఖం మీదున్నట్టు కంఠం మీద మూడు గీతలు ఉండడం అదృష్ట చిహ్నం.)
చందనగంది = చందనపు సువాసన కలిగిన స్త్రీ
పొందుగా =  ప్రాప్తముగా
పువ్వుబోణి = పువ్వు వలె లేత సోయగాలుగల పడతి

జక్కువ = చక్రవాకము (చక్రవాక పక్షులు ఎప్పుడూ జంటగా ఉంటాయి. అందుకే చనుగవకు ఉపమానంగా రాశాడు అన్నమయ్య)
లేమ = లేత వయసులోనున్న అమ్మాయి
చక్కెరబొమ్మ = పంచదార బొమ్మ
బిత్తరి = శృంగార చేష్టలు కలిగిన స్త్రీ
చొక్కపు సింగారాలది = స్వచ్ఛమైన సొగసులు కలది
సుదతి = అందమైన పలువరుస కలది
అక్కర = అపేక్ష , Desire


తాత్పర్యం /  Meaning :
 
ఓ వెంకటేశా, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? గొప్ప సుగుణాలున్న ఈ అమ్మాయిని నీ కోసం అపురూపంగా వెతికి తెచ్చాము.

పొడవైన, ఒత్తయిన కురులున్న ఈ యవ్వనవతి అన్ని రకాలుగాను నీకు చక్కగా సరిపోయే సరిజోడు! ఆమె మాటలెలా ఉంటాయంటావా? అనవసరంగా వాయాడిలా మాట్లాడదు; కుదురుగా, చిలకలాగ ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. "నీకోసమే పుట్టింది ఈ కలికి!" అన్నట్టు ఉంది. ఇంక దేని గురించీ ఆలోచించకు; ఆనందంగా పెళ్ళిచేసుకో.

చల్లని చిరునవ్వులొలికే ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. అంతేనా? ఆమె కంఠం శంఖంలా అందంగా ఉంది. (శంఖం మీదున్నట్టు కంఠంమీద మూడు చారలున్న అమ్మాయిని అదృష్టవంతురాలుగానూ, ఉన్నతమైన సంతానాన్ని కనగలిగినదిగానూ చెప్తారు శాస్త్రజ్ఞులు). చందనపు సువాసనలు వెదజల్లే అందగత్తె! పువ్వులాంటి లేత సోయగాలున్న ఈమె చేయందుకోవడం నీ ప్రాప్తంగా భావించి పెళ్ళిచేసుకో.

చక్రవాక పక్షుల్లాంటి కుచద్వయంతో, చక్కెరబొమ్మలా ఉంది. చక్కనైన పలువరుసతో, పరవశింపజేసే లేత సోయగాలతో నీకు స్వచ్ఛమైన శృంగారమొలికించగలదు! ప్రపంచంలో ఇన్ని యోగ్యమైన లక్షణాలతో మరో అమ్మాయి లేదు. ఈ యవ్వనవతి ఒక్కత్తే నీకు సరైన భాగస్వామి. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండ వచ్చి పెళ్ళిచేసుకోవయ్యా, శ్రీవేంకటేశా!

నా విశ్లేషణ :
అలివేణి, ఇంతి, లేమ, తరుణి, జవరాలు వంటి అన్ని పదాలకూ అర్థాలు ఇంచుమించుగా అమ్మాయి, యువతి అన్నవే. మరెందుకు అన్ని రకాలుగా వాడాడంటే, ప్రతి పదానికీ ఓ విశేషమైన కూడిన అర్థముంది. అలివేణి అంటే "తుమ్మెదవంటి కురులుకల యింతి" కదా. అలివేణి అని చెప్పడంలో భావం ఆ అమ్మాయికి అందమైన జుట్టుంది అని. సుదతి అన్నారంటే, అమ్మాయికి పలువరుస (దంతాలు) చక్కగా ఉందని. పళ్ళు హెచ్చుతక్కువగానో, ముందు వెనకగానో లేదు అని భావం. పువ్వుబోణి - పువ్వులవలే మెత్తటి మేనున్న అమ్మాయని.

తేటైన సింగారాలతో అన్నిటా నీకు ఆనందాన్నిస్తుంది అని చెప్పి అలమేలుమంగతో పెళ్ళికి వేంకటేశ్వరుని ఒప్పించడమే ఈ అద్భుతమైన కీర్తన.


=======================================

                 [ Lyrics in RTS format ]

                pallavi
                eMta bhAgyavaMtuDavO yeeke neeku dEvulAya
                viMtalugA neekugAnE vedaki techchitini

                charaNaM 1
                alivENi javarAlu anniTAnu jakkanidi
                chilukapalukula dee cheliya
                kalige neeku gannula galiki yeeke yokkate
                alari iTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM  2
                yiMdumukhi kaMbukaMThi yinniTA naMdamainadi
                chaMdanagaMdi yee sakiya
                poMdugA dorake neeku puvvubONi yokkate
                aMdi yeeke niTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM 3
                jakkava channulalEma chakkerabomma bittari
                chokkapu siMgArAla d
ee sudati
                dakke SreevEMkaTESa yee taruNi neeku nokate
                akkaratO niTTe peMDli yADuduvu rAvayyA
=======================================

14 comments:

  1. చాలా బావుంది. చక్కగా చెప్పారు ఇప్పుడు మా ఇంట్లో వినిపించాల్సిన అవసరం ఉంది)

    ReplyDelete
  2. మంచి పని చేస్తున్నారు. సరళంగా ఉన్నా ఎంతోమందికి అర్థం చేసుకోలేరు.
    మీరు బాగా వ్రాస్తున్నారు. పదాల పరిచయం బాగా చేస్తున్నారు. మీకు అభినందనలు.

    బాలకృష్ణ ప్రసాద్
    సఖియ
    చందనగంధి
    ఈ పదాలనిట్ల సవరించగలరా? ఇట్ల చెప్పినందుకు తప్పుగా అనుకోరు గదా!

    ReplyDelete
  3. @వనజవనమాలి :
    అక్కా, థ్యాంక్స్! నన్ను నిఖిల్ కి పాడి వినిపించమనరు కదా? :-)))

    @లక్ష్మీదేవి గారు :
    మీరు మెచ్చుకున్నందుకు ధన్యుణ్ణండీ!
    బాలకృష్ణ ప్రసాద్ - టైపో సవరించానండీ.
    సకియ & చందనగంది - ఇవి సరైనపదాలేనండీ. అన్నమయ్య అలానే రాశారు.

    ReplyDelete
    Replies
    1. సకి, సకియ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
      [from Skt. సఖి.] n.

      1. A female friend or companion. చెలికత్తె.
      2. A woman, ఆడుది.

      చందనగంది : గందం/గందము సరైన పదమే కదండీ.

      Delete
  4. చాలా బాగుందండి.
    నాకు అలా నచ్చజెప్పే మామ లేడు

    ReplyDelete
    Replies
    1. అలా నచ్చజెప్పే మామలేరు కాబట్టి పెళ్ళి మాటెత్తగానే మారు మాట్లాడకుండ పెళ్ళి చేసుకోండి ;-)

      Delete
  5. పాట పరిచయం, వివరణ, విశ్లేషణ అన్నీ చాలా బాగున్నాయండీ!
    శంఖం మీదున్నట్టు కంఠం మీద మూడు గీతలు ఉండడం అదృష్ట చిహ్నం ఇది ఇప్పుడే వినటం!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ,
      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండి.
      శంఖం మీదలా కంఠం మీద మూడు చారలుండటం అదృష్టం అని చెప్తారండీ!
      [రెఫరెన్స్ కోసం వెతుకుతున్నాను; పట్టుకోగానే చెప్తానండీ.]

      Delete
    2. శంఖం మీదున్నట్టు కంఠం మీద మూడు గీతలు ఉండడం అదృష్ట చిహ్నం
      ఆ గీతలను నగలుగా ఎంచుతారట. శాశ్వతంగా సౌభాగ్యం, ఐశ్వర్యం కలిగి ఉంటాయని దానికి వివరణ.(నగలు ఆజన్మాతం ఉండాలంటే సౌభాగ్యం, ఐశ్వర్యం ఉండాలి కదండీ). ఇవన్నీ నేను విన్న అమ్మలక్కల కబుర్లలోవి.

      Delete
  6. చిలుకపలుకుల దీ చెలియ &
    చొక్కపు సింగారాల దీ సుదతి -- ee rendu sambodhanalu , ammavari chelikattelaki swami variki cheptunnattuga undi.

    Annamayya , chelikattela tho swami vari gurinchi ammavariki , ammavari gurinchi swami variki goppaga cheppinche kirtanalu inka unnai. mi tatparyam bagundi.

    ReplyDelete
  7. చాలా బాగుంది. మీకు అభినందనలు.
    ఈ బ్లాగును నాకు పరిచయం చేసిన చావా కిరణ్ గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  8. Good replies in return of this query with genuine arguments and explaining the whole
    thing concerning that.

    ReplyDelete