25 May 2011

నిరతము నీ సిరులు నించేటిచోటు!



నేను ఇదివరకే అన్నట్టు అన్నమయ్య సంకీర్తనాలకు వ్యాఖ్యానం రాయడం అన్నది కత్తిమీద సాములాంటిది. ఈ టపాలో నేను ప్రస్తావించే సంకీర్తనలోని భావం చాలా సున్నితమైనది. కొందఱు మిత్రుల కోరికమేరకు ఈ సంకీర్తనకు వివరణ రాసేందుకు సాహసిస్తున్నాను.

అన్నమయ్య కీర్తనలలో నాయకుడు శ్రీవెంకటేశుడు, నాయిక అలమేలుమంగ. ఈ నాయికుణ్ణి  రేపల్లె బాలుడైన చిలిపి కృష్ణుడని, ఉగ్రరూపుదాల్చిన అహోబల నృసింహుడని, చెన్నకేశవుడని, ఆదిపురుషుడైన మహావిష్ణువని, శ్రీరాముడని, పొట్టి వామనుడని రకరకాల పేర్లతో కొలిచాడు అన్నమయ్య. నాయికను కూడ వేర్వేఱు పేర్లతో వేర్వేఱు రూపాలతో కొలిచాడు. పాలు పెరుగులమ్మే గొల్లెతగా, తాళ్ళపకవారింటి ఆడపడుచుగా, సరసాలాడే గోపికగా, పంతాల సత్యభామగా, చెంచితగా,  జానపద నాయికగా, క్షీరాబ్ధి కన్యగా, గిరిజనస్త్రీగా, లంబాడిమగువగా, భూదేవిగా ఇలా ఒక్కొక్క కీర్తనలో ఒక్కోరూపం ఆమెకి. వేర్వేఱు సందర్భాలలో ఆ మగువ ప్రవర్తనలనూ, ఆమెలో కలిగే భావాలనూ ఎన్నెన్నో కీర్తనలలో అన్నమయ్య అద్భుతంగ పలికాడు; పలికించాడు.

అప్పుడప్పుడు నాయిక, నాయకుణ్ణి నిందిస్తుంది. తనతో ప్రేమగా కాసేపు కబుర్లు చెప్పలేదనో, నగలూ-చీరలూ కొనిపెట్టలేదనో, ఇరుగుపొరుగు వారు మంచి ఇల్లుకట్టుకున్నారనో(నువ్వెందుకు కట్టలేదన్న భావంతో), అలకతీర్చడం చేతకాదనో, ముద్దుచెయ్యలేదనో, షికారుకి తీసుకెళ్ళలేదనో ఇలా ఎవేవో కారణాలకులకు నిందుస్తుంది నాయిక. ఈ కీర్తనలో నాయిక ఎందుకు నిందిస్తుందో చూద్దాం. పని ఒత్తిడిలోపడో, మఱేవో కారణాలవలనో నాయకుడు శృంగార సంయోగాన్ని మఱచిపోయాడు. దేహ వాంచలనూ, ఇష్టాలనూ తీర్చు అని నేరుగ అడగడంలేదు ఈ నాయిక. తనదేహాన్ని ఇల్లుగా వర్ణించి ఆ ఇంటిని మఱచిపోయావు అని వాపోతుంది. ఆమె దేహం అనే ఇల్లు ఆయన కొలువుండేటి చోటట, ఆ చోటు తెలియదా నీకు అన్నట్టుగా ప్రశ్నిస్తుంది నాయిక. “మరుని నగరిదండ మాయిల్లెఱగా” ఈ కీర్తనలో నాయికే స్వయంగా తన అంగాంగవర్ణన చేస్తున్నట్టు రాశారు అన్నమయ్య. ఈ శృంగార సంకీర్తనలో కొన్ని philosophical thoughts కూడా ఉండటం విశేషం.

=================================
రాగం : శ్రీరాగం
(తి.తి.దే తాళ్ళపాక సాహిత్యం - 5వ సంపూటికనుండి)


=================================



పల్లవి
మరుని నగరిదండ మాయిల్లెఱగవా
విరుల తావులు వెల్లవిరిసేటి చోటు

చరణం 1
మఱగు మూక చింతల మాయిల్లెఱగవా
గుఱుతైన బంగారుకొండల సంది
మఱపు దెలివి యిక్క మాయిల్లెఱగావా
వెఱవక మదనుడు వేటాడేచోటు

చరణం 2
మదనుని  వేదసంత మాయిల్లెఱగవా
చెదరియు జెదరని చిమ్మ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెఱగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు

చరణం 3
మరులుమ్మెతల తోట మాయిల్లెఱగవా
తిరువేంకటగిరిదేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెఱగవా
నిరతము నీ సిరులు నించేటిచోటు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
మరుని = మదనుడి
నగరి = భవనము
దండ = సమీపాన, పక్కన (మఱొక్క అర్థములో హారము, పూలమాల)
మాయిల్లెఱగవా = మా యిల్లెక్కడో తెలియదా?
విరుల = పూవుల
తావులు = పరిమళాలు
వెల్లవిరిసేటి = (పరిమళములు) చిమ్మేటి, చల్లేటి

మఱగు = అలవాటుపడు, చాటు  (మఱొక్క అర్థం : అజ్ఞానము, మరిపించే)
మూక = గుంపు, సమూహము (మఱొక్క అర్థం : మందమతిగల )
చింతల = చింతచెట్లు (మఱొక్క అర్థం : కలతల)
గుఱుతు = మేర, చిహ్నము
సంది = వీధి, బీటిక
మఱపు = మఱిపించే
దెలివి = తెలివి
యిక్క = చోటు, స్థానము
వెఱవక = భాయములేకుండ

మదనుని = మన్మథుని
వేదసంత = వేదాధ్యయనమ (మదనుని వేదము అంటే కోరిక, ఆశ, కామము అని అర్థము)
చిమ్మచీకటి = గాఢమైన అంధకారము
కొదలేక = కొదవలేక, కొఱతలేక
కొలువుండేచోటు = నిత్యమువిహరించేచోటు

మరులు = మోహము, కామము
ఉమ్మెతల = ఉమ్మెత్త (ఈ చెట్టులోని కాయలు తింటే పిచ్చెక్కును)
(http://en.wikipedia.org/wiki/Datura)
(http://en.wikipedia.org/wiki/File:Datura_fruit.jpg)
మరుముద్ర = మదనుడి గుఱుతులు
వాకిలి = తలుపు, ద్వారము
నిరతము = మిక్కిలి ఆసక్తితో, ఎనలేని ఆనందముతో
నించేటి = నింపబడే

తాత్పర్యం :
మా యిల్లెక్కడో తెలియదా? మదనుడు దండ వేలాడే ప్రదేశమే! ఆ దండలోని పువ్వులు పరిమళాలు విరజిమ్మే చోటే మా యిల్లు. (నిత్యము గుండెలు చిలుకే మన్మథుడుండే చోటుకు సమీపాన ఉన్న నా మనసు అని మఱో అర్థం!)

కలతలతో కల్లోల పడే నీ మనసుని సుఖాలాతో కట్టిపడేసి, కష్టాలను మఱపించేచోటే మాయిల్లు. అటువంటి మాయింటిని ఎలా గుర్తుపట్టి చేరుకుంటావు? అక్కడ బంగారు కొండలుంటాయ్! ఆ సందే మాయిల్లు. ఆ చోటుకి ఇంకో ప్రత్యేకతకూడా ఉంది, ఎటువంటి మేధావినైనా, తన మేధస్సుని మఱిసిపోజేసే బలముగల స్థలం అది. (What a great Philosophical thought). ఈ ఒక్కచోటే మదనుడు భయంలేకుండా తన విల్లునెక్కుపెట్టి వేటాడుతుండేది. అక్కడె మాయిల్లు.

మన్మథుడి వేదమైన కామాన్ని అధ్యయనం(పఠనం) చేసేది ఇక్కడే. మఱొక్క గుర్తుకూడా ఉంది, అక్కడ చెదిరి చెదరని చిమ్మ చీకటి కమ్ముకుని ఉండ్టుంది. అక్కడే మాయిల్లు. అక్కడే నిన్ను దాచుకున్న నా మనసు ఉండేది.  ఆ మనసులో మమతలకు కొరతలేదు.

మాయిల్లు మోహాల ఉమ్మెత్తతోట. ఉమ్మెత్త కాయతింటే ఎలా పిచ్చెక్కుతుందో అలాగే మాయిల్లు కూడా మోహాలమత్తులో ముంచ్చేస్తుంది. ఓ తిరుమలమలగిరి వెంకటేశుడా గుర్తుంచుకో, మాయింటి వాకిటి ద్వారానికి మన్మథుని చిహ్నాలుంటాయి. మిక్కిలి ఆనందం కలిగించే నీ వలపు సిరులతో నిండియుండేచోటే మాయిల్లు.




============================

rAgaM : SrIrAgaM

pallavi
maruni nagaridaMDa mAyille~ragavA
virula tAvulu vellavirisETi chOTu

charaNaM 1
ma~ragu mUka chiMtala mAyille~ragavA
gu~rutaina baMgArukoMDala saMdi
ma~rapu delivi yikka mAyille~ragAvA
ve~ravaka madanuDu vETADEchOTu

charaNaM 2
madanuni  vEdasaMta mAyille~ragavA
chedariyu jedarani chimma jeekaTi
madilOna neevuMDETi mAyille~ragavA
kodalEka mamatalu koluvuMDEchOTu

charaNaM 3
marulummetala tOTa mAyille~ragavA
tiruvEMkaTagiridEvuDa neevu
marumudrala vAkili mAyille~ragavA
niratamu nee sirulu niMchETichOTu

14 May 2011

చీమ కుట్టెనని చెక్కిట కన్నీరు జార వేమరు వాపోయేవాడు...

చిన్నపిల్లాడు చేసే అల్లర్లు చూసేందుకు ముద్దుగా ఉంటాయ్; శ్రుతిమించిపోనంతవరకు. గోకులంలోని కృష్ణుడు గొల్లభామలతో చేసే అల్లరి అంతా, ఇంతా కాదు. ఉట్లమీదున్న పాలు, పెరుగులను దొంగిలించే కృష్ణుడి మీద కొందరు గొల్లభామలు యశోదతో ఫిర్యాదు చేస్తారు. రోజు రోజుకీ వీడి అల్లరి ఎక్కువైపోతుంది! కృష్ణుడిని ఎలా దండించాలో తెలియక, చెట్టుకు కట్టేసి పనిచేసుకుంటుంది.

మఱికొందరు గొల్లభామలేమో ఆ అల్లర్లను ఆతిథ్యమిచ్చి ఆమోదిస్తున్నారు. రోజు వచ్చి అల్లరిచేసి పాలు, పెరుగు తాగి వెళ్ళే ఆ యశోదా తనయుడు ఇవేళ రాడేంటా అని ఒకరినొకరు విచారించుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పాలకడవనెత్తి వాడు కిందా మీదా కార్చుకుంటూ పాలు తాగే వైనం చూడ ముచ్చటగా ఉంటుంది వారికి. నల్లటి ఒంటి మీద తెల్లటి పాల చారలు! దానికితోడు వాడి నోట్లోనుంచి కారే చొంగ యొక్క జిడ్డు. భలే ముచ్చటగా ఉంటాడు. ఎక్కడున్నా వాణ్ణి పట్టుకురావలని వెతుకుతున్నారు.

వామన రూపంలో ఉన్నా, విశ్వరూపంలో ఉన్నా, బుల్లి కృష్ణుడి రూపంలో ఉన్నా ‘విష్ణు’ బలము తగ్గదుకదా? ఆ కట్లు తెంచుకుని మళ్ళీ తన అల్లరి చిల్లరి పనులు మొదలుపెడతాడు చిన్ని బాలుడు. అక్కడ ఓ గోకుల వనిత నెయ్యి చేసేందుకు వెన్నదీసి పెనంలో పోసింది. వెన్నకనబడగానే ఈ కృష్ణుడి కళ్ళు పెద్దవయ్యాయి; వివేకాన్ని గాలికొదిలేశాడు. వెళ్ళి  చేయిపెట్టేశాడు! వేడికి వేళ్ళు చురుక్కు మన్నాయి. పిల్లవాడు కాస్త దూరంగా వెళ్ళి నిల్చుని ఏడ్వడం మొదలుపెట్టాడు. బుగ్గలమీద కన్నీటి ధారలు. ఏడుపువిని అక్కడికొచ్చిన  గోకులపు నారీజనం విలపించే బాలుడిని సమీపించి “ఏమైంది, కన్నయ్యా?” అంటే; ఏమి ఎఱుగని అమాయకుడిలా, ఒక్క క్షణం ఏడుపాపి “చీమకుట్టింది” అని ఇంకా కాస్త ఎక్కువ శ్రుతిలో విలపించడం మొదలుపెట్టాడు. గోకుల వనితలకు కృష్ణుడి కపటం అర్థం అయిపోయింది. “ఓరి, దొంగ కృష్ణుడా!” అని ఓదార్చడం మొదలుపెట్టారు.
చిన్ని కృష్ణుడి అల్లర్లను గొల్లెతలు ఎలా వివరిస్తున్నారో అన్నమయ్య మాటల్లోనే వినేయండి.
================================
రాగం : దేవగాంధారి
శ్రీమతి చిత్ర గారి గళంలో
('చందమామకథ' సినిమాకోసం డా. రాజ్శేఖర్ శర్మ గారు స్వరపరిచినది)
 
BKP (గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్) గారి గళంలో
================================

పల్లవి

ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు - వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలువోయరే


చరణం 1
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన
చేమపూవుకడియాల చేయిపెట్టి
చీమగుట్టెనని తనచెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయేవాని వెడ్డు వెట్టరే


చరణం 2

ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి
తచ్చెడి పెరుగులోన తగ బెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరునెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే
 

 చరణం 3
ఎప్పుడు వచ్చెనో మాయిల్లుచొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండబట్టి వాని తలకెత్తరే!

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఇట్టి = ఇటువంటి
ముద్దులాడి = యశోద ("మొద్దొచ్చే యశోదమ్మ" అన్న అర్థంలో)
బాలుడేడ = (ఆ యశోద యొక్క) బాలుడెక్కడ
వాని = వాడిని
బట్టి = పట్టి
తెచ్చి = తీసుకొచ్చి
బాలువోయరే = పాలుతాగించండి

గామిడి = కఠినమైన, బలమైన, క్రూరమైన, Cruel

(గామిడై = గొప్పవాడులాగ, పెద్దవాడులాగ)
పారి = బారి = గొలుసు, Chain 
(పారి = పాలకుండ)
కాగెడి వెన్నలలోన = కాగుతున్న వెన్నల్లో
చేమపూవు = చేమంతి పువ్వులాంటి
కడియాలు = Anklet, కడియము
చీమగుట్టెనని = చీమ కుట్టిందని
తనచెక్కిట = తన బుగ్గపీన
గన్నీరు = కన్నీరు
వేమరు = వేమారు = మాటిమాటికి
వాపోవు = విలపించు, ఏడ్చే
వెడ్డు = కపటము, నటన
వెట్టరే = కనుగొనరే

ముచ్చువలే = దొంగలా (దొంగమొఖం)
ముంగమురువుల చేయి = కడియాలు తొడిగిన చేయి (ముంగమురువు = కడియము)
జొల్లుగార = చొంగ కారుతూ
వొచ్చెలి = అయ్యో అని
వాపోవువాని  = ఏడ్చే వాడిని
నూరడించరే = ఓదార్చరే

తాత్పర్యం :
ముద్దొచ్చే ఆ యశోద ఇంటి చిన్నబ్బాయి, బుల్లి క్రిష్ణుడు ఎక్కడున్నాడో వెతకండి. వాడికి పాలు, పెరుగు, వెన్నలంటే మహా ఇష్టం. వాడిని పట్టుకొచ్చి పొట్టనిండా పాలుపొయ్యండి అంటున్నారు గొల్లెతలు.

యశోద కఠినమైన గొలుసుతో సంకెల వేసి చెట్టుకి కట్టేసింది. సంకెల వాడికోలెక్కా? తెంచేశాడు! అల్లర్లపథంలో పడ్డాడు! అక్కడ ఓ వనిత నెయ్యికోసం వెన్నదీసి పెనములోపోసి లోపలికెళ్ళింది ఈ లోపల వెన్నచూసిన కృష్ణుడి మనసాగక కాగుతున్న వెన్నలో బంగారు కడియము తొడిగిన, చేమంతిపూవులాంటి తన చేతిని పెట్టాడు. చురుక్కుమని కాలాయి వేళ్ళు. బాలుడు ఓర్చుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. చుట్టూపక్కనున్న అమ్మలక్కలు వీడిచుట్టు చేరి అడిగితే “చీమకుట్టింది, చీమకుట్టేసింది...” ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. బుగ్గలమీద కన్నీటి చుక్కలు దొర్లుతున్నాయి. చూస్తున్న అమ్మలక్కలు గ్రహించారు వాడి కపటివేషాలను.

మరో సందర్భాన, ఈ చిన్ని కృష్ణుడు ఏమి చేశాడో తెలుసా?

దొంగలా వచ్చి నవరత్నాల కడియాలుతొడిగిన చేతులు తెచ్చి అమ్మేందుకు తీసిపెట్టిన గడ్డపెరుగుకడవలో పెట్టేశాడు. ఏమన్నా అంటే ఎక్కడ నొచ్చుకుంటాడో అని వాని చేయిపట్టుకుని, “వద్దు! నీకు వేరే పెరుగు ఇస్తాను” అన్నా వినడాయె. అలా
చేయిపట్టుకుని ఆపినందుకే కెవ్వుమని నోటిలో చొంగ కార్చుతూ ‘అయ్యో! అమ్మా!” అని వాపోతున్నాడు. అందరూ వచ్చి ఓదార్చండి అంటుంది ఈ భామ.

మరోభామ ఇలా అంటుంది...
తాళంవేసిన ఇంటిలోకి ఎలావచ్చాడో, ఎప్పుడు వచ్చాడో తెలియదుగానీ, మానికాలు, ముత్యాలు మెరిసే ఉంగరాలు తొడిగిన చేతులతో పెట్టెలన్నీ తనిఖీ చేస్తున్నాడు; తినడానికి ఏమున్నాయా అని. ఆకలి మీదున్న ఆ బాలుడెవరోకాదు, తిరుమలనుంచి దిగివచ్చిన ఆ అప్పడు శ్రీవేంకటేశుడే. వదలకుండ పట్టుకోండి, హాయిగా ఆడుకుందాం వాడితో అంటున్నది ఈ భామ.
===============================
rAgaM : dEvagAndhAri
pallavi
iTTi muddulADi bAluDEDa vaaDu - vaani
baTTi tecchi poTTaniMDa baaluvOyarE

charaNaM 1
gaamiDai paariteMchi kaageDi vennelalOna
chEmapUvukaDiyaala chEyipeTTi
cheemaguTTenani tanachekkiTa ganneeru jaara
vEmaru vaapOyEvaani veDDu veTTarE

charaNaM 2
muchchuvalE vachchi tana muMgamuruvula chEyi
tachcheDi perugulOna taga beTTi
nochchenani chEyideesi nOrunella jollugaara
vochcheli vaapOvuvaani nooraDiMcharE
 
charaNaM 3
eppuDu vacchenO maayilluchocchi peTTelOni
chepparaani vuMgaraala chEyipeTTi
appaDaina vEMkaTaadri asavaalakuDu gaana
tappakunDabaTTi vaani talakettarE!
===============================

06 May 2011

అన్నిటా చక్కనిదానవు...

తరతరాలుగా స్త్రీలను గౌరవించిన జాతి మనది. వివేకముగల ప్రతి భర్తా తన భార్య మాటలకు విలువిస్తాడు! అన్నివిషయములోనూ భార్య సలహాలు తీసుకుంటాడు. ఆమె చెప్పినమాటలు వింటాడు. చాలామటుకు, 'విజయము సాధించిన ప్రతి మగవాడి వెనుకా ఒక ఆడది ఉంటుంది ' అంటారు. ఇది మనుషులకే కాదు; దేవుళ్ళకుకూడా వర్తిస్తుంది. చెప్పాలంటే దేవుళ్ళలో ఇలాంటీ ఆనవాయితీ ఉందికాబట్టే మనుషుల్లోకూడా పారంపర్యంగా కొనసాగుతోంది ఆ legacy.
 
ఆడవాళ్ళకు ఉన్నంత సున్నితత్వము మగవారికి ఉండదు. కష్టాలకు ఆడవాళ్ళు కరిగి కన్నీళ్ళు కార్చినట్టు మగవారు కరిగిపోరు.  అది manufacturing defect. అందుకే భిక్షమెత్తేవాడుకూడా "అమ్మా ఆకలీ", "తల్లీ అన్నంపెట్టు" అంటాడు.

అమ్మ Home-Minister! పైకికనబడకపోయినా home minister కి పవరెక్కువ. Home-ministry ఎలా dictate చేస్తే అలా నడవాల్సిందే ప్రభుత్వం బాధ్యత. అమ్మెలా చెప్తే నాన్న అలా చేస్తాడు. అమ్మే రిమోట్ కంట్రోల్!

పిల్లల మనసు అమ్మకు అర్థమైనట్టు నాన్నకి అర్థం కాదు. అలమేలుమంగ అమ్మ, శ్రీవెంకటేశుడు నాన్న, అన్నమయ్య పిల్లవాడు. అందుకే అమ్మతో చెప్పి recommend చెయ్యమంటున్నాడు అన్నమాచార్య.



==========================================

రాగం :  సాళంగనాట
కౌశల్య గారి గళంలో AUDIO ఇక్కడ వినండి
==========================================



            పల్లవి
            ఆతడు నీవాడినట్టె అన్నిపనులును జేసు
            శ్రీ తరుణివి మమ్ము రక్షించవమ్మ


            చరణం 1
            యేలవమ్మ మమ్మును యెక్కితివి పతి వురము
            నీలీల లేమి సేసినా నీకుజెల్లును
            బాలకి వన్నిటా నీవు పనిగొంటి వాతనిని
            కీలు నీచే నున్నది రక్షించవమ్మా

            చరణం  2

            మన్నించవమ్మ మమ్ము మగడు నీచేతివాడు
            సన్నల నీచేతలెల్లా సాగి వచ్చీని
            అన్నిటా జక్కనిదాన వటమీదట దొరవు
            యెన్నిక కెక్కె నీబ్రదు కిక గావవమ్మా

            చరణం  3

            యీడేరించవమ్మ మమ్ము నిట్టె యలమేల్మంగవు
            గూడితి శ్రీ వేంకటేశు గోరినట్టెల్లా
            యీడులేనిదానవు నే మూడిగాలవార మిదె
            వేడుక లెల్లా నీ సొమ్మే వెలయించవమ్మా
 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఆతడు = ఆయన
నీవాడినట్టే = నువ్వు ఎలా అంటే అలా
జేసు = చేసెదడు
శ్రీ తరుణివి = శ్రీయొక్క ఇల్లాలు

ఉరము = రొమ్ముస్థలము
బాలకి = యువతి, బాలిక
 పనిగొంటివి = ఆజ్ఞాపించేంత చనువు పొందావు
కీలు = సూత్రము; ఉపాయము; controlling power

మన్నించు = క్షమించు; కడతేర్చు
సన్నల = సైగలతో; కనుల భాషలతో
జక్కనిదాన = చక్కనిదానివి
వటమీదట = మర్రాకుపైన
దొరవు = రాణివి / (మర్రాకుమీద పవలించిన దొరయొక్క భార్యవు)
ఎన్నికకెక్కె = ప్రార్థన/స్తుతి పాటకెక్కే
గావవమ్మ = ఉత్తేజపరచవమ్మ

యీడేరించవమ్మ = ఈడేర్చవమ్మ
గోరినట్టేల్లా = కోరినట్టెల్లా
ఊడిగాలవారము = సేవలుచేసేవారము,
వెలయించవమ్మా = ప్రకాశించవమ్మా

తాత్పర్యం : 
అమ్మా శ్రీదేవీ, మీవారు జగత్గురువేకావచ్చు. లోకాలనంతా పాలించేవాడైయుండచ్చు. ఆయనను పాలించేది నువ్వే కదా? నువ్వెలా చెప్తే అలా చేస్తాడు శ్రీమన్నారాయణడు. మమ్ములను రక్షించమని చెప్పవమ్మా ఆయనకు.

(ఆయనకే direct గా చెప్పక నీకెందుకు మొరపెట్టుకుంటున్నాము? నువ్వు చెప్తే ఆయన ఎండుకు జవదాటడు? నీ గొప్పతనాలేమిటో తెలుసా? అని అమ్మవారి గొప్పతనమేంటే అమ్మవారికే గుర్తుచేస్తున్నాడు అన్నమయ్య)

ఆయన గుండెలమీదచేరి ఆయన మనసుని పాలించే అంతటి చనవు ఉంది నీకు. ఆ చనువు ఉందికాబట్టి నీదే పైచెయ్యి. ఆయన మానసాన్ని పాలించటమే కాదు, ఒక కంట మా క్షేమాన్ని కూడా చూసుకో. నువ్వేం చేసినా ఆయన  పల్లంత మాటైనా అనడు. చిరునవ్వులు ఒలకబోస్తూ అలా నీకేసి చూస్తూ ఉంటాడు. అన్నీ చెల్లుతాయి నీకు. నువ్వు చూసేందుకు అణ్యము పుణ్యము తెలియని బాలికలా ఉన్నా, ఆయనని ఆడించే ఉపాయము నీదగ్గరే ఉందిగనుక మమ్ములను రక్షించమని ఆయనకు ఆనతిస్తూ ఉండు.

మొగుణ్ణి ఎంతలా నీ చేతి గుప్పెట్లో ఉంచుకున్నావంటే కనుసైగలతోనే అన్నిపనులనూ సాధించుకోగలవు! మమ్ములను మన్నించమని నోరుతెరచి చెప్పనక్కఱ్లేదు. కనుసైగతో చెప్పు అది చాలు మాకు! మా చక్కని తల్లివి చేస్తావు కదూ? మార్రాకుమీద తేలిన ఆ బుజ్జి దొరని గెలిచిన రాణివి గనుకే భక్తులు నిన్నుకూడా స్తుతిస్తారు!

 శ్రీవెంకటేశుని అంతరాత్మనెఱిగి, ఆయన మనసుకనుగుణంగా నడుచుకునే గొప్పతనంగల తల్లీ, మేమందరం నీకు ఊడిగాలు చేసెదము మమ్ములను ఈడేర్చు! నీకెవరూసాటిలేరు; మేము చేసే జాతరలూ, వేడుకలూ నీకొరకే! నీకంటిచూపుకాంతిని మాపై చిందించవమ్మా!




====================================

rAgaM : sALaMganATa

pallavi
AtaDu neevADinaTTe annipanulunu jEsu
Sree taruNivi mammu rakshiMchavamma

charaNaM 1
yElavamma mammunu yekkitivi pati vuramu
neeleela lEmi sEsinA neekujellunu
bAlaki vanniTA neevu panigoMTi vAtanini
keelu neechE nunnadi rakshiMchavammA

charaNaM 2
manniMchavamma mammu magaDu neechEtivADu
sannala neechEtalellA sAgi vaccheeni
anniTA jakkanidAna vaTameedaTa doravu
yennika kekke neebradu kika gAvavammA

charaNaM 3
yeeDEriMchavamma mammu niTTe yalamElmaMgavu
gUDiti Sree vEMkaTESu gOrinaTTellA
yeeDulEnidAnavu nE mUDigAlavAra mide
vEDuka lellA nee sommE velayiMchavammA
===================================

23 April 2011

Arranged Marriage చేసుకున్న అలమేలుమంగ...

శ్రీవెంకటేశుడ్ని Arranged Marriage చేసుకున్న అలమేలుమంగ మదిలోకలిగిన భావాలమీద అన్నమాచార్య రాసిన కీర్తన ఇది. 






అలమేలుమంగను చూడండి, వలపించి పెళ్ళిచేసుకోలేదని ఏమాత్రము నిట్టూర్చడంలేదు! పెద్దలు చూసి చేసిన వివాహమైతేనేం, ప్రేమ వివాహమైతేనేం? వేంకటేశుడితోనేగా జరిగినది నా పెళ్ళి అని మురిసిపోతుంది, ఈ భూలోక శ్రీదేవి. కొన్ని ముచ్చట్లు ప్రేమవివాహములోనే ఉంటాయి, మరికొన్ని పెద్దలు చూసిచేసిన వివాహములోనే ఉంటాయి. వివాహమేదైతేనేం ముచ్చట్లు మురిపించేవైనప్పుడు. ప్రేమవివాహమైతే గంటలుగంటలు తీయని కబుర్లతో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. Arranged Marriageలో తీయని సరసాలూ, చిలిపి పనులూ సాగిస్తూ మనసులు  కలుపుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. రెండిట్లోనూ ఆనందాలకు కొదవేలేదు. ఇక్కడ Arranged Marriage చేసుకున్న మహాలక్ష్మి మనసులోని భావాలు వినండి :-)



============================================

రాగం : పాడి
Alternate Link for the AUDIO

============================================


పల్లవి 
దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి
చరణం 1
వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
చరణం 2 
మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
చరణం 3
పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
దేవుల నేను = అన్నెముపుణ్యములు ఎఱుగని మగువను నేను
వావులు = వావి వరస; వియ్యము వరస
గూడగాను = కలిసాయిగనుక
వడి = వెంటనే
సేస = అక్షితలు; వివాహవేడుకవేళ వధూవరులు ఒకరిమీద ఒకరు చల్లే బియ్యం
వెట్టితి = పెట్టితిని / పోసితిని
వలపులు = ప్రేమలు
నేనెఱగ = నాకు తెలియవు
వాసులెఱగ = సంపదల విలువలు నాకు తెలియవు
కలకల = గలగలమని, గట్టిగా
కరగితిని = కరిగిపోయాను
పలుకులు = మురిపించే తీయని మాటలు,
నేనేర = నాకు తెలియవు
భావించగ = ఎంచుకోవడము, choosing the right qualities
విడెము = తాంబూలము
ప్రియమందితిని = ప్రేమ పొందాను


సాధించ = conquer, సాధించడం, గెలవడం
మర్మములు = నీ వ్యవహారములు
అడుగనోప = అడగను
చెనకి = తాకి(touch)
గోర = తొందరగా
ఊదితే = అదిమితేనే
చేకొంటిని = అంగీకరించితిని, ఆదరించితిని
పెనగ = పెనగులాడడం
బిగియగ = బిగువుచేయగ
కనువిచ్చి = కనులుతెరచి; కను సైగలతో
కానిమ్మంటిని = సరే అని ఒప్పుకున్నాను


పచ్చిచేతలు = మొరటుపనులు; మొరటుసరసాలు; gross things
రచించ = చేస్తుంటే
బలుమారు = పలుమారు; మాటిమాటికి
సిగ్గువడ = సిగ్గుపడుతుంటే
మచ్చిక = మోహముతో
గాగిలించితే = కౌగిలించితే; వాటేసుకుంటే
మరిగితిని = అలవాటుపడితిని
యిచ్చట = ఇక్కడ
యేలుకొంటివి = పరిగ్రహించితివి
ఇటు = ఈ రీతిలో
మెచ్చి = మెచ్చుకొని
మేకొని = అనుకూలించి, సహకరించి
 తాత్పర్యం ::
నువ్వు దేవుడే! అయితే నేను మాత్రం దేవతను కాను; అన్నెముపుణ్యము ఎఱుగని మామూలు మగువను నేను. మా ఇంటి పెద్దవారు "ఆతడు మనకు వరసౌతాడు. నిన్ను అతనికిచ్చి కట్టబెడుతున్నాము"  అని చెప్పారు. నేను సరే అని చెప్పి నీకు తలవంచి తాళికట్టించుకున్నాను.


"నువ్వు గొప్పింటివాడివా, నీకు సిరులున్నాయా?" లాంటివి చూసి calculativeగా మనసుపడి వలపించడం నాకు తెలియదయ్యా. నన్ను చూసి నువ్వు గలగలమని నవ్వావు! ఆ కల్లాకపటంలేని నీ నవ్వుకే పడిపోయా. అందరు అమ్మాయిల్లాగ పెళ్ళికి మునుపే కొన్నాళ్ళు నీతో స్నేహం చేసి,  నీ గురించి పూర్తిగా తెలుసుకొని, నాకు సరిపోతావా లేదా అని విశ్లేషించి, ఆ పైన అందమైన లేఖ ద్వారానో, మఱో మార్గానో I Love You అని propose చేసి, నువ్వు నా ప్రేమని అంగీకరించి, నీతో గంటలు గంటలు తీయ తీయని కబుర్లు చెప్పుకునే వలపులు నాకు తెలియవు. మన పెద్దలు తాంబూలాలు మార్చుకుని మనకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నీ ప్రేమను అందుకున్నాను.


మొగుణ్ణి వశపరుచుకునే ఉపాయాలు తెలియవు. నీ వ్యవహారలన్ని నాకెందుకు పూసగుచ్చినట్టుగా, ఆహ్లాదపరిచే విధంగా చెప్పవు అని నిందించడం నాకు తెలియదు. అలావచ్చి సైగభషతో నాకరము పట్టుకొనగానే నీమనసు గ్రహించుకుంటాను. నాయంతట నేనొచ్చి నిన్ను పెనవేసుకోను; నువ్వు వచ్చినవేళ బిగువు చేయను. కనులతో అలా అడిగితే నీ మనసు గ్రహించి సరే అని ఒప్పుకుంటాను.


వేళగానివేళలో నీ మొరటుసరసాలు ప్రదర్శించినపుడు మాటిమాటికీ సిగ్గుపడ్డాను. మోహముతో నువ్వుకౌగిలించితే ఇబ్బంది పడ్డాను. అందుకని నిన్ను విసుక్కోలేదు; నీ ఈ ప్రవర్తనలకు అలవాటుపడిపోయాను. ఓ శ్రీవెంకటేశా, ఇలాంటి స్వభాముగల నన్ను మెచ్చుకొని ఏలుకున్నావు. నీ కౌగిలి చాలు; నా జన్మ ధన్యము. మెచ్చి కౌగిలించుకున్న నీకు మనస్పూర్తిగా మొక్కుతున్నాను.


================================================
rAgaM : pADi

pallavi
dEvuDavu neevu dEvula nEnu
vAvulu gUDagAnu vaDi sEsa veTTiti

charaNaM 1
valapulu nE ne~raga vAsule~raganu - neevu
kalakala navvitEnE karagitini
palukulu nE nEra bhAvinchaga nE nEra
pilichi viDemicchitE priyamaMditini

charaNaM 2
manasu saadhiMchanOpa marmamu laDuganOpa
chenaki gOra nUditE chEkoMTini
penagajAlanu nEnu bigiyaga jAlanu
kanuvicchi chUchitEnE kAnimmaMTini

charaNaM 3
pacchichEtalu rachiMcha balumAru sigguvaDa
macchika gAgiliMchitE marigitini
yicchaTa SrIveMkaTESa yElukoMTi viTu nannu
mecchi kAgiliMchitEnu mEkoni mokkitini

================================================

21 April 2011

జలధివంటిది సుమీ చంచలపు నా మనసు...

అన్నమయ్య తన జీవితమంతా ఆ వేంకటేశుడిపైన కీర్తనలు రసేందుకే అంకితము చేసుకున్నాడు.  రాసిన 32 వేల కీర్తనలలో మనకు దొరికినవి సుమారు పదిహేనువేలు కీర్తనలే. వాటిలో సుమారు రెండువేలా ఐదువందలు మాత్రమే ఆధ్యాత్మ  సంకీర్తనలే.  ఆ కొన్ని  ఆధ్యాత్మ  కీర్తనల్లో 'నాకుగలపని యిదే నారాయణుడ...' అనే కీర్తన చూద్దాం. అన్నమయ్య తన జీవితకాలమంతా ఒక్క వెంకటేశుడిమీదే కీర్తనలు రాశాడంటే ఆ భక్తి, అంకితభావాలెంత గొప్పవో! దేవుడిమీద భక్తిలేకున్నా సరే సాహిత్య, సంగీతాలను ఆస్వాదించేవారికి అన్నమయ్య మీద భక్తి  కలగకమానదు. ఆ మహాకవిని అంతగా ఆకట్టుకున్న అంశం ఆ కొండలోనే దాగుండాలి! ఏంటది? ఎక్కడుందది? అదే భక్తా?  ఏమో...  ప్రతి అన్నమయ్య కీర్తనలోనూ దాగుండకపోదు ఆ రహస్యం!  "ఎంతమాత్రమున ఎవ్వరు చదివిన అంతమాత్రమే అన్నమయ్య!"


========================================
రాగం :: ధన్నాసి
AUDIO :: అనురాధ శ్రీరాం గళములో
Alternate Link for the same AUDIO
========================================
 
పల్లవి
నాకుగలపని యిదే నారాయణుడ నీవు
శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు

చరణం 1
జలధివంటిదిసుమీ చంచలపు నామనసు
కల వింద్రియముల నేటిజలచరములు
వొలసి భక్తనెడి వోడ యెక్కితి నేనే
జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు

చరణం 2
కొండవంటిదిసుమీ కొనకెక్కు నామనసు
వుండు గామాదులను వురుమృగములు
వుండి నీశరణమనువూత గొని యెక్కితిని
కొండలప్ప నీవనేటి కొనఫలము కొరకు

చరణం 3
ఠీవులను ధరణివంటిదిసుమీ నామనసు
నీవె శ్రీవేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి
భువిభుడ నీవనేటి పురుషార్థము

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
నాకుగల = నాకున్న
పనియిదే = పని ఇది ఒకటే
సిద్ధించుకొరకు = దొరికేకొరకు, ఈడేఱేకొరకు

జలధి = కడలి, సముద్రము, కొలను
చంచలపు = చంచలమైన, నిలకడలేని
కలవింద్రియములు =  కలవు యింద్రియములు
ఇంద్రియములు = organs of the body
వొలసి = చేరుకొని
భక్తనెడి = భక్తి అనబడే
వోడ = నావ, boat
జలశాయి = పాలకడలిలో పవలించియున్నవాడు
నీవ నేటి = నీవు అనబడే
సరకు = వస్తువు
దెచ్చుటకు = తెచ్చుకొనుటకు

కొండ = forest
కొన = Tip, peak
గామాదులను = కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సరాలనబడేవి
వురుమృగములు = భయంకరమైన జంతువులు, పెద్ద పెద్ద జంతువులు
వుండి = ఉండి, బహుకాలము వేచి ఉండి
నీశరణమనువూత గొని = నీ శరణము అనే ఊత పట్టుకొని
కొనఫలము = పుణ్యాత్ములకు లభించే కైవల్య పదవి

ఠీవులను = డంభములు, జంభములు,  టెక్కులు show-off, style, royal
ధరణి = భూమి, ప్రపంచము
నిక్షేపము = దాచుకొన్న నిధి
వావాత = నోటిచాతుర్యముతో / ఆలపించడముతో / ???
వసిదవ్వి = వసముచేసి / dig with crow bar
కైకొంటి = పొందాను, అందుకున్నాను
భువిభుడ = భువినేలేవాడా
పురుషార్థము = మోక్షము, పరమపదము, కైవల్యము

తాత్పర్యం :
నాపుట్టుకకు అర్థం నీ పరమార్థము పొందడమే. అందువలన ఆ ధ్యేయంవైపు నడవడము తప్ప నాకింకో పనిలేదు ఈ భువిపైన. ఓ నారాయణా, శ్రీకాంతుడా నువ్వు నాకు దొరికేవరకు  నా పయణము చాలించను!

నీరెప్పుడైనా నిలకడగా ఉంటుందా? నీరు సాగరములో ఉన్నా, చెరువులో ఉన్నా చిన్న గాలి తన తనువుమీద అలా వీస్తే చాలు  అలలురేపుకుంటూ ఉంటుంది.  ఆ నీటివలే నా మనసుకుకూడా నిలకడెఱుగదు. చంచలమైనది. ఆ నీటిలో ఎలాగైతే జలచరములున్నాయో నాలోకూడా యింద్రియములనేటి జలచరాలున్నాయి. నిత్యము అవి నా మదిని చంచలపెడుతున్నాయి.  ఈ యింద్రియాలను అదుపులో పెట్టగలిగే మందు/వస్తువు నీవద్ద మాత్రమే ఉన్నది. నువ్వేమో మీ ఆత్తగారింటిలో, అంటే పాలకడలిమీద పవలించున్నావు. అక్కడికి ఈదుకుంటూ వచ్చే ధైర్యమూ, శక్తిసామర్థ్యాలూ నాకు లేదయ్యా. అందుకే భక్తి అనే ఓడనెక్కి వస్తున్నాను. నాకా ఔషదము ఇస్తావుకదూ?

కొండెలాగైతే నేనెవరికీ తలవంచను అన్నట్టు గర్వంగా నిలబడి ఉంటుందో అలా పైకెక్కి నేనే గొప్పవాడిని అంటుంది ప్రభూ నా మనసు!  కొండలో ఎలాగైతే పెద్దపెద్ద క్రూరమృగాలున్నాయో అలానే నాలో కూడా కామ క్రోధాలనే కొన్ని క్రూరమైన మృగాలున్నాయి. ఓ జగన్నాటక సూత్రథారి, నువ్వేపక్షాన ఉంటే ఆ పక్షం జయం సాధిస్తుంది. అది తెలిసేకదా అర్జునుడు నిన్ను సారధ్యము వహించమన్నాడు? నేనిప్పుడు ఈ క్రూరమృగాలవంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద,  మాత్సరాలను జయించి పరమార్థం అనే కొనఫలము దక్కించుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాపక్షానచేరి  నాకు సారథ్యము చేసిపెట్టమని అడగాలనుకుంటున్నాను. ఓ కొండలప్పా, నువ్వేమో అదివో ఆ కొండైపన నిలుచున్నావు. నేనెలా చేరాలి అక్కడికి? ఇదిగో దొరికిందిలే నాకు నీ శరణ్యం అనే ఊతకఱ్ఱ. అదిపట్టుకుని వచ్చేస్తున్నా,  అంతవరకు ఎక్కడికీ వెళ్ళిపోకు!

ఓ వేంకటేశా, ఈ భువిపైనున్న ఇతరజనులవలే నా మనసుకూడా డంభాలకు, జంభాలకు బానిసై టెక్కులు చూపుతూ ఉంది. దాన్ని లొంగదీసుకునే బాధ్యత నీదని నీకర్పించాను! భువినేలేవాడా, ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా చివర్లో కావలసినదేంటి? నీ పాదశరణ్యము చేరుకునే పరమార్థమే! అది నేనెలా పొందితిననో ఎఱుగుదువుగదా? నిత్యం నీ నామమే ఆలపించుతు,  నా గానామృతపు మత్తులోకితోసి నిన్ను వసపరచుకొని  నీయండనుండే మోక్షమును పొందితినిరా అంటున్నాడు అన్నమాచర్యులవారు .
చివరి చరణానికి మరొక అర్థముకూడా ఉన్నది ::
మట్టిలో ఎలా నిధు
లు పూడ్వబడి ఉన్నాయో అలా నీలో పురుషార్థాలు నిక్షేపైమై ఉన్నాయి.   వాటిని  నీ శరణమనే గునపముతో త్రవ్వి పొందాను నీవనేటి పురుషార్థము!

 ==================================================
 rAgaM :: dhannAsi

pallavi
nAkugalapani yidE nArAyaNuDa neevu
SreekAMtuDavu nAku siddhiMchukoraku

charaNaM 1
jaladhivaMTidisumee chanchalapu nAmanasu
kala viMdriyamula nETijalacharamulu
volasi bhaktaneDi vODa yekkiti nEnE
jalaSAyi neeva nETisaraku decchuTaku

charaNaM 2
konDavaMTidisumee konakekku nAmanasu
vunDu gAmAdulanu vurumRgamulu
vunDi neeSaraNamanuvUta goni yekkitini
konDalappa neevanETi konaphalamu koraku

charaNaM 3
Theevulanu dharaNivaMTidisumee nAmanasu
neeve SreevEMkaTESa nikshEpamu
vAvAta neevanETi vasidavvi kaikonTi
bhuvibhuDa neevanETi purushArdhamu
 ==================================================

01 April 2011

పసిడిబోలినది చేపట్టెను నీ కరము...

 దేవతలూ, దానవులూ పాలకడలిని చిలికితే హాలాహలము, ఉచ్చైశ్శ్రవము, ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము, చమంతకమణి, అప్సరసలు, చందమామా ప్రభవించారు. ఆపైన అందానికీ, ఐశ్వర్యానికీ నెలవైన లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె అందాలని ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు అన్నమయ్య.




అన్నమయ్య చమత్కారం చూడండి!  కీర్తన మొదలుపెట్టినదేమో అయ్యగారిని స్తుతిస్తూ, అయితే పల్లవిలో మొదటి లైను మాత్రమే అయ్యగారి స్తుతి. రెండో లైనుకే అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టేశారు. ఇక చరణాలకొచ్చేసరికి అమ్మవారిని పొగుడుతూ రాసేశారు పాటంతా...


ఓ మాధవా, నువ్వు కేవలం పసుపు రంగు బట్టలుకట్టుకుంటావని మాత్రమే బంగారుబొమ్మలాంటి ఆ మగువ, అఖిలలోక మోహనాంగి  శ్రీమహాలక్ష్మి నీ చేయిపట్టుకుంది. (ఏదో పాపం పోనీలే అని కణికరించి నిను పెళ్ళి చేసుకుంది, లేకుంటే నీకెక్కడిదిలే అంత భాగ్యం అన్నట్టే ఉంది!)
ఓ విష్ణుమూర్తీ, ఆమే ఎవరో, ఆమె గొప్పతనమేంటో ఎఱుగుదువా? చండ్రుడికి స్వయానా చెల్లెలు! కనబడట్లేదటయ్యా ముఖాన అన్నా-చెల్లెల్ల పోలికలు? ఒక చంద్రుడికే కాదు అప్సరసలకు, శమంతకమణికీకూడా చెల్లి ఈమె. చూడు మరి ఈమె మేని తళుకులు మానికాలవలే, దంతాలవలే ఎలా మెరుస్తుందో! ఆమె నడక ఎంత వయ్యారంగా ఉందో గమనించావా? కరిగమనం అని కవులు కొనియాడతారే అలాలేదటయ్యా ఈమె నడుస్తుంటే? ప్రత్యేకించి నేర్చుకోలేదు అలా నడవటానికి. ఐరావతంకి ముద్దల చెల్లెలుకదా? ఈమె రక్తంలోనే ఉంది ఆ వయ్యారమైన నడక!  ఓ పురుషోత్తమా, ఆమెకు నీ మీద కోపం వచ్చి అలిగిపోతుందికదా, అప్పుడు ఆమె అలకతీర్చేందుకి కాళ్ళుపట్టుకుంటావే అప్పుడు ఆ పాదాలను పరీక్షించావా? ఎలా ఉన్నాయి ఆ పాదాలు?  పారిజాతపువ్వులోని రేకుళ్ళా లేవూ? చిగురులాంటి పాదాలుగల ఈ మగువ పారిజాత పుష్పానికి చెల్లి!
ఈమె జనించినపుడు ప్రజాపతి కానుకగా పద్మం ఇచ్చాడు. ఆ పద్మాన్ని ఆసనంగా చేసుకుందిగనుకే ఈమె కన్నులు తామెరల్లా ఉన్నాయి. ఇన్ని నాణ్యమైన అంసాలతో పుట్టిన ఈమె నిన్ను వరించిందంటే నిజంగా నీ అదృష్టమేరా, వేంకటేశా! ఇంతటి గొప్ప ఇంతి నీమేనంటి ఉంటానంటుంది! ఇంతకన్నా నీకు కావలసినది ఏముంది?
==========================
రాగం :: బౌళి
జానకి గారి గళంలో
Alternate Link
===========================
పల్లవి
పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన
పసిడిబోలినది చేపట్టెను నీకరము

చరణం 1
తొలుతనే చందురుని తోడబుట్టుగనక
పొలుపు చందురు మోముపోలికైనది
కళల చింతామణి కందువ చెల్లెలుగాన
తళుకు మానికపు దంతముల బోలినది

చరణం 2
మంచి యైరావతముతుతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనము బోలినది
పంచల బారిజాతపు భావపు సోదరిగాన
యెంచగ చిగురుబోలె నీకెపాదములు

చరణం 3
తామెర తోట్టెలలోన తగిలి తానుండుగాన
తామెరకన్నులబోలి తనరినది
యీమేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది
 
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :
పసిడి = బంగారు
కరము = చేయి
పొలుపు = అందమైన, సొంపైన
చింతామణి =
శమంతకమణి
కందువ = జాడలున్న
కరి = ఏనుగు
పంచల = పంచలక్షణములుగల(పంచలక్షణములు -సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము)

================================================

rAgaM : bouLi

pallavi
pasiDicheeravADavu pAludacchitivigAna
pasiDibOlinadi chEpaTTenu neekaramu

charaNaM 1
tolutanE chanduruni tODabuTTuganaka
polupu chaMduru mOmupOlikainadi
kaLala chintaamaNi kaMduva chellelugAna
taLuku mAnikapu daMtamula bOlinadi


charaNaM 2
maMchi yairAvatamututO maguva saidODugAna
muMchina karigamanamu bOlinadi
paMchala bArijAtapu bhAvapu sOdarigAna
yeMchaga chigurubOle neekepAdamulu

charaNaM 3
tAmera tOTTelalOna tagili tAnunDugAna
tAmerakannulabOli tanarinadi
yeemEra ninniTA bOli inni lakshaNamulatO
neemEna SreevEMkaTESa nelavai nilchinadi

================================================