Showing posts with label శృంగారం - SrungAram. Show all posts
Showing posts with label శృంగారం - SrungAram. Show all posts

27 November 2012

చిలుక పలుకులది ఈ చెలియ...

మనిషి జీవితంలో ఎన్ని రకాల సన్నివేశాలుంటాయో అన్ని సన్నివేశాలనూ కీర్తనల్లో వాడుకున్నాడన్నమయ్య! ఇంట్లో పెళ్ళీడొచ్చిన అబ్బాయుంటే అమ్మాయికోసం వెతుకుతాంకదా? మనకు ఓ సంబంధం అన్నివిధాలా సరిపోతుంది అనిపించగానే అబ్బాయికి చెప్తాము. కొందరబ్బాయిలు మారు మాట్లాడకుండ పెళ్ళి చేసుకుంటారు. కొందరేమో " నాకు పెళ్ళొద్దు, ఇప్పుడు పెళ్ళికేం తొందర? కొన్నేళ్ళ తర్వాత చేసుకుంటాను." అని ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకోడానికి చూస్తారు. 

అలా తప్పించుకునేవారికి ఏం చెప్తాం? "సరే పెళ్ళి చేసుకోవద్దుగానీ, ఓ సారి అమ్మాయి ఫోటో అయినా చూడరా" అనో "ఓ సారి అమ్మాయిని చూసొద్దాము, ఆ తర్వాత నీకు నచ్చలేదంటే వద్దులే!" అనో చెప్తాము. ఎందుకంటే మనవాడు ఆ అమ్మాయి ఫోటో చూసినా, లేకుంటే పెళ్ళిచూపుల్లో అమ్మాయితో ఓ మారు మాట్లాడినా ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటానంటాడని మనం చూసిన సంబంధంమీద మనకున్న నమ్మకం!

పెళ్ళీడొచ్చి పెళ్ళొద్దంటున్న కుర్రాడిగా వెంకన్నని ఊహించి ఆ సన్నివేశానికి అన్నమయ్య కీర్తన రాశాడు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో పెళ్ళిచూపులుండేవి కాదుకదా! (ప్రేమ పెళ్ళిళ్ళు మినహా) అమ్మాయిని మొట్టమొదటగా పెళ్ళిపీటలమీద చూడాల్సిందే! మరి ఆ రోజుల్లో అబ్బాయి పెళ్ళొద్దు అంటే, "అలా కాదబ్బాయ్ మేము చూసొచ్చాం కదా? అమ్మాయి అన్నిరకాలుగానూ నీకు చక్కగా సరిపోతుంది. ఈ సంబంధం వదులుకుంటే ఇలాంటమ్మాయి మళ్ళీ దొరకదు. మా మాటలు వద్దులే; మీ మామ చూశాడు అమ్మాయిని. అమ్మాయి గూర్చి ఆయన ఏంచెప్తాడో ఓ సారి విను పోనీ. విన్న తర్వాత నచ్చలేదని చెప్పులే " అంటారు.
 
మేనల్లుడికి అమ్మాయి గురించి వర్ణించి చెప్పే మేనమామ పాత్ర తీసుకున్నాడు అన్నమయ్య! ఆ మహాకవి మాటల్లో శ్రీదేవి అందచందాలగురించి వింటే వెంకన్న "పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు?" అని అడగడూ?

అన్నమయ్య ఏం చెప్పాడో వినండి. [ఈ కీర్తన కాశీయాత్ర సందర్భానికికూడా సరిపోతుందని గమనించగలరు - కాశీయాత్రప్పుడు అక్కడున్న పెళ్ళిపెద్ద పాడే సన్నివేశానికీ సరిపోతుంది ఈ కీర్తన.]


===================================
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి పాడిన
ఈ కీర్తనని ఇక్కడ వినండి
 AUDIO

===================================
            పల్లవి
            ఎంత భాగ్యవంతుడవో యీకె నీకు దేవులాయ
            వింతలుగా నీకుగానే వెదకి తెచ్చితిని

            చరణం 1
            అలివేణి జవరాలు అన్నిటాను జక్కనిది
            చిలుకపలుకుల దీ చెలియ
            కలిగె నీకు గన్నుల గలికి యీకె యొక్కతె
            అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం  2
            యిందుముఖి కంబుకంఠి యిన్నిటా నందమైనది
            చందనగంది యీ సకియ
            పొందుగా దొరకె నీకు పువ్వుబోణి యొక్కతె
            అంది యీకె నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

            చరణం 3
            జక్కవ చన్నులలేమ చక్కెరబొమ్మ బిత్తరి
            చొక్కపు సింగారాల దీ సుదతి
            దక్కె శ్రీవేంకటేశ యీ తరుణి నీకు నొకతె
            అక్కరతో నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):

యీకె = ఈమె, ఈ అమ్మాయి
దేవులాయ = దేవుడికి స్త్రీ లింగం "దేవుల" (అతను దేవుడుగనుక ఆమె దేవుల)

అలివేణి = తుమ్మెద రెక్కలవంటి కురులు కలది
జవరాలు =  పడుచు, యవ్వనంలో ఉన్న స్త్రీ
అలరి = అవధులు లేని ఆనందంతో

ఇందుముఖి = చంద్రబింబం లాంటి ముఖము గలది ( చంద్రుడి చెల్లెలుకదా మరి)
కంబుకంఠి = శంఖము వంటి తీరైన కంఠము గలది (మేలైన శంఖములో మూడు చారలుంటాయి[lines]. శంఖం మీదున్నట్టు కంఠం మీద మూడు గీతలు ఉండడం అదృష్ట చిహ్నం.)
చందనగంది = చందనపు సువాసన కలిగిన స్త్రీ
పొందుగా =  ప్రాప్తముగా
పువ్వుబోణి = పువ్వు వలె లేత సోయగాలుగల పడతి

జక్కువ = చక్రవాకము (చక్రవాక పక్షులు ఎప్పుడూ జంటగా ఉంటాయి. అందుకే చనుగవకు ఉపమానంగా రాశాడు అన్నమయ్య)
లేమ = లేత వయసులోనున్న అమ్మాయి
చక్కెరబొమ్మ = పంచదార బొమ్మ
బిత్తరి = శృంగార చేష్టలు కలిగిన స్త్రీ
చొక్కపు సింగారాలది = స్వచ్ఛమైన సొగసులు కలది
సుదతి = అందమైన పలువరుస కలది
అక్కర = అపేక్ష , Desire


తాత్పర్యం /  Meaning :
 
ఓ వెంకటేశా, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? గొప్ప సుగుణాలున్న ఈ అమ్మాయిని నీ కోసం అపురూపంగా వెతికి తెచ్చాము.

పొడవైన, ఒత్తయిన కురులున్న ఈ యవ్వనవతి అన్ని రకాలుగాను నీకు చక్కగా సరిపోయే సరిజోడు! ఆమె మాటలెలా ఉంటాయంటావా? అనవసరంగా వాయాడిలా మాట్లాడదు; కుదురుగా, చిలకలాగ ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. "నీకోసమే పుట్టింది ఈ కలికి!" అన్నట్టు ఉంది. ఇంక దేని గురించీ ఆలోచించకు; ఆనందంగా పెళ్ళిచేసుకో.

చల్లని చిరునవ్వులొలికే ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. అంతేనా? ఆమె కంఠం శంఖంలా అందంగా ఉంది. (శంఖం మీదున్నట్టు కంఠంమీద మూడు చారలున్న అమ్మాయిని అదృష్టవంతురాలుగానూ, ఉన్నతమైన సంతానాన్ని కనగలిగినదిగానూ చెప్తారు శాస్త్రజ్ఞులు). చందనపు సువాసనలు వెదజల్లే అందగత్తె! పువ్వులాంటి లేత సోయగాలున్న ఈమె చేయందుకోవడం నీ ప్రాప్తంగా భావించి పెళ్ళిచేసుకో.

చక్రవాక పక్షుల్లాంటి కుచద్వయంతో, చక్కెరబొమ్మలా ఉంది. చక్కనైన పలువరుసతో, పరవశింపజేసే లేత సోయగాలతో నీకు స్వచ్ఛమైన శృంగారమొలికించగలదు! ప్రపంచంలో ఇన్ని యోగ్యమైన లక్షణాలతో మరో అమ్మాయి లేదు. ఈ యవ్వనవతి ఒక్కత్తే నీకు సరైన భాగస్వామి. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండ వచ్చి పెళ్ళిచేసుకోవయ్యా, శ్రీవేంకటేశా!

నా విశ్లేషణ :
అలివేణి, ఇంతి, లేమ, తరుణి, జవరాలు వంటి అన్ని పదాలకూ అర్థాలు ఇంచుమించుగా అమ్మాయి, యువతి అన్నవే. మరెందుకు అన్ని రకాలుగా వాడాడంటే, ప్రతి పదానికీ ఓ విశేషమైన కూడిన అర్థముంది. అలివేణి అంటే "తుమ్మెదవంటి కురులుకల యింతి" కదా. అలివేణి అని చెప్పడంలో భావం ఆ అమ్మాయికి అందమైన జుట్టుంది అని. సుదతి అన్నారంటే, అమ్మాయికి పలువరుస (దంతాలు) చక్కగా ఉందని. పళ్ళు హెచ్చుతక్కువగానో, ముందు వెనకగానో లేదు అని భావం. పువ్వుబోణి - పువ్వులవలే మెత్తటి మేనున్న అమ్మాయని.

తేటైన సింగారాలతో అన్నిటా నీకు ఆనందాన్నిస్తుంది అని చెప్పి అలమేలుమంగతో పెళ్ళికి వేంకటేశ్వరుని ఒప్పించడమే ఈ అద్భుతమైన కీర్తన.


=======================================

                 [ Lyrics in RTS format ]

                pallavi
                eMta bhAgyavaMtuDavO yeeke neeku dEvulAya
                viMtalugA neekugAnE vedaki techchitini

                charaNaM 1
                alivENi javarAlu anniTAnu jakkanidi
                chilukapalukula dee cheliya
                kalige neeku gannula galiki yeeke yokkate
                alari iTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM  2
                yiMdumukhi kaMbukaMThi yinniTA naMdamainadi
                chaMdanagaMdi yee sakiya
                poMdugA dorake neeku puvvubONi yokkate
                aMdi yeeke niTTe peMDli yADuduvu rAvayyA

                charaNaM 3
                jakkava channulalEma chakkerabomma bittari
                chokkapu siMgArAla d
ee sudati
                dakke SreevEMkaTESa yee taruNi neeku nokate
                akkaratO niTTe peMDli yADuduvu rAvayyA
=======================================

26 June 2012

విరహపు మేన మల్లెలు పూచే...

పురుషోత్తముని కలయికకై ఉవ్విళ్ళూరుతోంది పదహారేళ్ళ పడతి శ్రీదేవి. ఆ స్థితిని గమనించిన చెలికత్తెలు ఆమె మదిభావాలను (విరహ వేదనను) పలురకాల పువ్వులతో పోలుస్తున్నారు. కవులు మగువల్ని పువ్వులతోపోల్చడం సహజం;  అన్నమయ్య చూపే వైవిధ్యం ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో చూడండి! మరులుగొన్న శ్రీదేవి మదిలోనూ తనువులోనూ జరిగే మార్పులను అందమైన పువ్వులతో ఉదాహరించారు.

అందం మగువ సహజ లక్షణం. అటువంటిది ఆమె ప్రేమలో పడినప్పుడు ఆ అందం పలురెట్లవుతుంది. గుండెలు నిండిన వలపుతో ప్రియునికై తపించే ఆ పడతి "పూవక పూచిన పూవై" ఎలా వికసించిపోతుందో చెలికత్తెల మాటల్లో వినండి.

======================== 
AUDIO
(నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరకల్పన)
========================

పొలితి జవ్వనమున బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతి చింతాలతలలో సంపెగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోత నడవిజాజులు పూచె
హితవు తెలియ దిక నేమి సేసేదే
తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు పూచె
కొయ్యచూపు గోపముల గుంకుమ పూచె
కయ్యపు వలపుల జీకటిమాకులు పూచె
నియ్యెడ జెలియభావ మేమి సేసేదే
మగువరతులలోన మంకెన పువ్వులు పూచె
మోగి గొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశుపొందుల గప్రము పూచె
ఇగురు బోండ్ల మిక నేమి సేసేదే

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
పొలితి = పడతి, మగువ, ఇంతి
జవ్వనము = పదహారేళ్ళ ప్రాయం
బూవక = పూవక
ఎలమి = వికాసము, సంతోషము

చింతాలతలు = చింత+లతలు = అల్లుకుంటున్న ఆలోచనలు
సంపెగ = సంపంగి పువ్వు
తలపోత = వెన్నాడే తలపు, విచారము

తొయ్యలి = మగువ, పడతి
దొంతితామెర = పలురేకులున్న కలువపూవు
కొయ్యచూపు = ప్రేమలేని చూపు
గోపముల => కోపముల
గుంకుమ => కుంకుమ =  కుంకుమపువ్వు [safron]
కయ్యపు = జగడము, గొడవ
జీకటిమాకులు  => చీకటిమాకులు = కదంబం; అంటే కడిమి చెట్టు (కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది)
ఇయ్యెడ = ఇక్కడ
జెలియ => చెలియ

మగువ = పడతి, ఆడది, స్త్రీ
మంకెన = ఎర్రటి రంగు పువ్వు [Pentapetes phoenicea]
మొగి = వరుస
మొగలి = Pandanus odoratissimus
గప్రము = కర్పూరము
ఇగురు =  చిగురు
బోండ్లము = అమ్మాయిలు 

తాత్పర్యం / Meaning :
మొగ్గదశనుండి పూవుగా ఇప్పుడే వికసించినట్లు బాల్య ప్రాయంనుండి యౌవనంలోకి అడుగిడిన పదహారేళ్ళ ఈ పడతి ఆనందించేందుకు మనము చేయగలిగినదేముందే? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

పురుషోత్తముని సతీమణియైన ఈమె మదిలో ఆయన గూర్చి అల్లుకుపోతున్న ఆలోచనలు (చింతాలతలు కదా!) సంపంగిపువ్వుల్లా పూచాయట. ఇక్కడ సంపంగి పూవులనెందుకు ఉపమానంగా వాడారో గమనించాలి. సంపంగి మొగ్గలు విచ్చుకుని పరిమళాన్ని వెదజల్లేది సాయంత్రం సమయాల్లోనే. నిత్యం అతని తలపుల్లోనే తేలియాడుతూ ఉన్నా మలిసంజవేళే కదా ఉద్రేకమైన వలపు భావనలు కలిగేది? అందుకే సంపంగి పూవుల్లా పూచాయట ఆమె మదిలోని తలపులు. ఇంకాస్త సమయం గడిచింది. ఆమె విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలెందుకంటారా? మల్లెల సువాసన మత్తెక్కిస్తుంది; పడతి విరహస్థితి కూడా అదే కదా? మరింత సమయం గడిచింది. ఆ సరసుడు సరసన లేడు; అతని తలచుకుంటూ ఇంకా రాలేదేమని విచారపడుతూ నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పుల తీవ్రత మామూలు జాజుల్లా కాకుండా అడవిజాజులంత హెచ్చుగా ఉందట. "ఈమెకొచ్చిన ఈ కష్టాలు సుఖాలవ్వడానికి మనమేమి చెయ్యగలమే?" అని చెలికత్తెల భావన.

రెండో ఝామైంది; స్వామి రాలేదు. విరహం ఝాము ఝాముకీ హెచ్చింది. తాపాన మరిగిన ఆమె మేను ముచ్చెమటల ఏరయ్యింది. సొగసులు నీట మెరిసే తామరల్లా పూచాయి. దొంతితామరలట! అప్పుడొచ్చాడా కమలనాథుడు. ఏ తొలిఝామో నాయకుడింటికి వచ్చుంటే పాదప్రక్షాళనకు నీళ్ళిచ్చి, చిరునవ్వుల పూవులు గుప్పించి ఆహ్వానించుండేది. ఇలా రెండోఝాము సమయానికొస్తే ఏం చేస్తుంది నాయిక? అదే.. అదే.. నిప్పులుకక్కేంతలా కోపంగా కోయ్యచూపులు చూసిందట. అప్పుడు ఆమె ముఖమూ, కళ్ళూ కుంకుమపువ్వులు పూచినట్టు ఎరుపెక్కాయట. కోపం ఎదిగితే ఏమవుతుంది? గొడవవుతుంది. సిరి హరితో కయ్యానికి దిగి అలిగింది! ఆమె నవ్వులు లేని ఆ రేయి మరింత నల్లబడిందట. కడిమి పూచినంత మనోహరంగా ఆమె అలకలు పూచాయి. చీకటిమాకులు పూచాయని, ప్రేమ నిండిన అలక కూడా చక్కనిదేనని చెప్తున్నారు. అందగత్తె ఏ కళనున్నా అందమే కదా! "స్వామి ఇంటికొచ్చేంతవరకేమో రాలేదే అని బెంగపెట్టుకుంది వచ్చాకేమో దెబ్బలాడుతుంది. ఈ సత్యభామ ప్రవర్తన మనకర్థం కాదే!" అని నొచ్చుకుంటున్నారు చెలికత్తెలు.

తలపోతా, నిట్టూర్పూ, విరహం, కోపం, కయ్యం, అలక - ఇదీ వరుస.  అలక తరువాత ప్రణయం బహు తీయనిది. చురకలూ చెణుకులతో మొదలై గారాలతో సరాగాలలోకి దారితీస్తుంది. గమ్యం వారి కలయిక - వలపుల శిఖరాలు చేరిన ఆ సొగసరి ఎర్రని కోమలమైన మంకెనలా వికసించింది. రతికేళి వేళ స్వామి మునిగోళ్ళు ఆమె కోమల దేహం పై ఏర్పరచిన జాబిలిబుడుగులు మొగలి రేకుల్లా పరిమళించాయి. శ్రీవేంకటేశుని మనసు దోచిన దొరసానినని గర్వించే ఆ పడతి పొగరంతా పరవశించి పవళించిన ఈ వేళ కర్పూరంలా పూచి గాలిలో కరిగిపోయింది అని చెలికత్తెలు "కన్నెపిల్లలం మనకేం తెలుసే వారి వలపులు!" అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.





=======================================
[ Lyrics in RTS format ]

politi javvanamuna bUvaka pUche
yelami niMduku manamEmi sEsEdE

sati chiMtAlatalalO saMpegapUvulu pUche
mativirahapu mEna mallelu pUche
atanunitalapOta naDavijAjulu pUche
hitavu teliya dika nEmi sEsEdE

toyyalichemaTaneeTa doMtidAmeralu pUche
koyyachUpu gOpamula guMkuma pUche
kayyapu valapula jeekaTimAkulu pUche
niyyeDa jeliyabhAva mEmi sEsEdE

maguvaratulalOna maMkena puvvulu pUche
mOgi gonagOLLanE mogali pUche
pogaru SreevEMkaTESupoMdula gapramu pUche
iguru bOMDla mika nEmi sEsEdE


=======================================

02 May 2012

పేరుగల జవరాలె పెండ్లికూతురు...

మన తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్య దృష్టిలో మానవ జీవితమంతా ఆనందంతోనూ, సౌందర్యంతోనూ నిండిపోయుంది. ఆ ఆనంద సమయాలను, సౌందర్యాలనూ అచ్చ తెలుగు పదాల్లో నింపి వేంకటేశ్వర మకుటంతో కీర్తనలుగా వినిపించాడు. పైకి శ్రీవేంకటేశుని భక్తుడ్లా కనిపించినా అన్నమయ్యకు వాళ్ళింటి చిన్నారి అలమేలుమంగమ్మంటేనే ప్రేమ. రాసిన ముప్పైరెండువేల కీర్తనల్లో మనకు దొరికినవి మాత్రం పదిహేనువేల కీర్తనలే. లభించినవాటిల్లో రెండువేలకు పైచిలుకు కీర్తనలు మాత్రమే ఆధ్యాత్మిక, భక్తి కీర్తనలు. మిగిలినవంతా లౌకిక జీవితంలోని మాధుర్యాన్ని, పరమార్థాన్ని చాటి చెప్పే మధుర కీర్తనలే. 

ఆనందమయం జగత్ అన్న నానుడిని తన నిండు జీవితంలో నిజంగా జీవించినవాడు అన్నమయ్య. అందుకే ఆయనకు చూసిన ప్రతిదాంట్లోనూ అందమూ, ఆనందమే కనిపించాయి. జీవితంలోని ప్రతి ఆనందాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ జీవించాడు. 

మానవ జీవితంలో అతి ముఖ్యమైన వేడుకల్లో ప్రధానమైనవి పుట్టుక, పెండ్లి. బాలకృష్ణ జననం మీద వందలాది కీర్తనలు రాసినట్టే, వెంకన్న-మంగమ్మల పెండ్లిని కూడా వందలాది కీర్తనల్లో గానం చేశాడు అన్నమయ్య. ఆరువందల ఏళ్ళక్రితం తెలుగిళ్ళ పెళ్ళిల్లో ఎలాంటి వైవిద్యభరితమైన వేడుకలు, తంతులు ఉండేవి అని తెలుసుకోవాలంటే ఆయన కీర్తనలు తిరగేస్తే చాలు. 

పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు అన్న ఈ కీర్తనలో పెండ్లికూతురు గురించిన ఒక లైవ్-కామెంట్రీ ఇస్తున్నాడు - వరుడు వెంకన్న, వధువు మంగమ్మ. చుట్టూ జనం. పెండ్లి పీటలమీద ఒద్దికగా సింగారించుకుని కూర్చున్న అందమైన పెండ్లి కూతుర్ని వర్ణిస్తున్నాడు - 

======================
ఈ కీర్తనను ఇక్కడ వినండి
======================


పిడికిటి తలఁబాల పెండ్లికూఁతురు

కొంత పెడమరలి నవ్వీనె పెండ్లికూఁతురు


పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద 

పేరులముత్యాల మెడ  పెండ్లి కూఁతురు 

పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ 

బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూతురు


బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర - 

బిరుదు మగనికంటెఁ బెండ్లికూతురు 

పిరిదూరి నప్పుడె పెండ్లికూఁతురు పతిఁ 

బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు


పెట్టెనె పెద్దతురుము పెండ్లికూఁతురు నేఁడె 

పెట్టెఁడు చీరలుగట్టెఁ బెండ్లికూతురు 

గట్టిగ వేంకటపతికౌఁగిటను వడి - 

వెట్టిన నిధానమైన పెండ్లికూతురు. 


ముఖ్యమైన పదాలకు అర్థాలు: 

తలఁబాలు = తలంబ్రాలు (బ్రాలు - బియ్యము)

పెడమరలు = పక్కకు లేదా వెనక్కి తిరుగు 

పేరు =  కీర్తి, హారము (రెండు  అర్థాలున్నాయి)

పేరంటాండ్లు = శుభకార్యాలు చేసే ముత్తైదువలు 

విభుడు = నాయకుడు 

పేరుకుచ్చు = పేరు చెప్పు 

బిరుదు = కీర్తి, కీర్తి బిల్ల 

పెండెము = అందె 

నెర = మిక్కిలి, అమితమైన 

పిరిదూరు = ‌వెంబడించు, వెనక నడువు, అనుసరించు 

బెరరేఁచు = పెరరేచు, వశపరుచు, ప్రేరేపించు 

తురుము = కొప్పు 

వడివెట్టిన = పెనవేసుకున్న, హత్తుకుపోయిన 

నిధానము = నిధి, నిక్షేపము 

తాత్పర్యం :

పిడికిట్లో తలంబ్రాలు పట్టుకుని ఉంది ఆ పెండ్లి కూతురు - అయ్యవార్లు ఎప్పుడు చెప్తే అప్పుడు కాబోయే భర్త మీద  వెయ్యడానికి. ఎదురుగా ఉంటే కళ్ళారా చూడచ్చు కానీ పక్కన కూర్చో బెట్టారు. చూడాలని ఉబలాటం - ఇందరు చుట్టూ ఉండగా అదే పనిగా తలెత్తి చూస్తే జనం ఏమనుకుంటారు అని బెరుకు. అయినా చూడాలన్న ఆరాటం లోపొల తొలిచేస్తుంది, ఏదైతే అదవుతుందని కొద్గిగా మెడ పక్కకు తిప్పి అరక్షణం ఆయనగారి అందాన్ని చూసి మురిసిపోయి ముసిముసిగా నవ్వేసుకుంటోంది! 

ఇది వినే మనం ఎక్కడ వరుడే అందగాడు, ఆమె అదృష్టవంతురాలు అనేసుకుంటామని వెంటనే ఆమె గురించి అందుకుంటున్నాడు అన్నమయ్య - 

అందచందాల్లో, గుణగణాల్లో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మే అన్నంత పేరుగాంచిన యువతి ఈ పెండ్లికూతురు. మెడనిండా పెద్ద ముత్యాల హారాలు వేసుకుని తలవంచుకుని కూర్చుని ఉంది. మెడలోని ముత్యాల హారాల బరువు మోయలేక  తలవంచుకుంది అనుకుంటారేమో... కాదు, కాదు! ఆమె చుట్టూ చేరిన పేరంటాండ్లు 'ఏమి అదృష్టమే పిల్లా నీది?ఆ  వెంకడికి పెళ్ళాం అయిపోతున్నావు!' అని ఆట పట్టిస్తుంటే, 'వెంకడు' అన్న పేరు వినబడగానే ఆమెను సిగ్గు ముంచెత్తడంవల్ల తలవంచుకుందట. 

కాళ్ళకు మేలైన అందెలు తొడుక్కుని ఉంది - చెప్పాలంటే ఎంతో కీర్తి ఉన్న ఆమె భర్తకంటే కూడా ఈమె గొప్పతనం కొంత పాళ్ళు ఎక్కువే. అందుకని తనే గొప్ప అని ఆమే ఏమీ గర్వపడిపోవడంలేదు - ఇలా పెళ్ళయిందో లేదో అంతలోనే భర్తను అనుసరించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అనుసరించి వెళ్ళినంతమాత్రాన అమాయకురాలేమీ కాదు, అతగాడ్ని వశపరుచుకోగల కళలెరిగిన జాణ ఈ పెళ్ళికూతురు అంటున్నాడు అన్నమయ్య. 

పెద్ద కొప్పు పెట్టుకున్న ఈ పొ‍డవు జుట్టుగల పెళ్ళికూతురు, ఈ పెళ్ళితంతంతా ముగిసేలోపు ఒక్కొక్క తంతుకీ ఒక్కో చీర అంటూ, ఇప్పటిదాకా ఒక పెట్టెడు చీరలు కట్టుకుంది. ఈ ఆనంద సమయంలో మిక్కిలి భావావేశానికి లోనైన ఆమెను ఆ శ్రీవేంకటేశ్వరుడు తన గుండెలకేసి హత్తుకున్నప్పుడు ఆమె భర్త కౌగిట్లో చక్కగా ఒదిగిపోయిన నిక్షేపంలా ఉంది అని ఆనంద భాష్పాలు రాల్చుతున్నాడు అన్నమయ్య. 

Lyrics: 

piDikiTi talaMbaala peMDlikooturu

koMta peDamarali navveene peMDlikooturu


pErukala javaraale peMDlikooturu pedda 

pErulamutyaala meDa  peMDli kooturu 

pEraMTaaMDla naDimi peMDlikooturu vibhu

pEru kuchcha sigguvaDee peMDlikooturu


birudu peMDemu veTTe beMDlikooturu nera - 

birudu maganikaMTe beMDlikooturu 

piridoori nappuDe peMDlikooturu pati

berarEchee nidivO peMDlikooturu


peTTene peddaturumu peMDlikooturu nEDe 

peTTeDu cheeralugaTTe beMDlikooturu 

gaTTiga vEMkaTapatikaugiTanu vaDi - 

veTTina nidhaanamaina peMDlikooturu.