"నీకు దూరమైన వేళ ప్రతిక్షణమూ నిన్ను miss అవుతుంటాను, దేవీ" అని ప్రియుడు ప్రేమకురిపిస్తూ చెప్పే మాటకన్నా ఎక్కువ ఆనందపెట్టే మరొక్క మాట ఉంటుందా వలచినదానికి? ఇరువై ఏళ్ళప్పుడే కాదు అరువై వచ్చినా వలచినవాడి మనసులో అంతే ప్రేమ ఉంటే ఇక ఆ మగువజన్మ ధన్యం! ఇది మానవ స్త్రీలకేకాదు, భూలోకాన్ని పోషించే ఆ జగన్మాతకైనా వర్తిస్తుంది!
శ్రీదేవి అలిగి వెళ్ళిపోయింది! దేవి లేక క్షణమొక యుగమైంది ఆ పురుషోత్తముడికి! "ఏదో ఆవేశంలో అన్నానుగాని, నీ చల్లనిచూపులు సోకలేని దూరంలో నేనుండగలనా? నీ చూపులమేరనే ఉంటూ, నువ్వు విసిరే ఆ ఓరచూపులు లేనిదే నాకు Oxygen అయినా అందుతుందా? నా ఒక్కడికైతే బహుసుందరమైన ఇంత పెద్ద ఇల్లు, అంతమంది పరిజనము, ఇన్ని సిరులు, అతిమెత్తని శేషశయ్య ఎందుకు? ఏ చెట్టుచేమల కిందో, ఓ బండరాతిమీద శయనించేవాణ్ణి! పూటకోచోట భుజించేవాణ్ణి! బికారిలా నేనొక్కణ్ణయితే ఉండగలనుకానీ, నిన్నలా ఉంచగలనా? కన్నీళ్ళూ, కష్టాలూ యెరుగక పెరిగిన సుకుమారివి! నా మీద ఎంత కోపం ఉన్నా ఇక్కడే ఉండి తీర్చుకోవాలిగానీ, ఇలా వదిలెళ్ళిపోతే ఎలా? ఇదేమైన ఇరవైయొకటవ శతాబ్ధమా? Cellphone లో సారి చెప్పి బ్రతిమలాడటానికీ, 'I Really Miss You, Devi!' అని క్షణానికి నాలుగు SMS లు పంపడానికీ?" అని మదనపడుతున్నాడు మాధవుడు.
"నీ వియోగం నాకెంత వేదనను కలుగజేస్తుందో ఎరుగుదువా?" అని దేవిలేని బాధంతా ఓ లేఖలో లిఖితముచేసి దూతికకిచ్చిపంపాడు.
"తల్లీ, నీ పతి జగత్గురువేకావచ్చుకానీ, నువ్వులేకుంటే 'మిస్టర్ అయ్యోపాపం' లా ఉంటాడు! నీ అండనుంటేనేనమ్మా ఆయన అతిలోకసుందరుడు! నువ్వులేక ఆయన బికారిలా గడ్డాలుపెంచుకుని, మాసిన బట్టలతో, కిరీటం ధరించక, చింపిరి జుట్టుతో, చిక్కిపోయున్నాడమ్మా." అంది దూతిక.
"అదిసరేగాని, ఏమన్నారాయన? ఇప్పటికైనా మంచి బుద్ధొచ్చిందటనా మహానుభావుడికి? కొండ దిగుతారా, లేదా?" కోపంగా అడిగింది అలమేలుమంగ.
"ఏమో, ఈ లేఖ మీకిమ్మన్నారు! చదువుకోండి"
"హూం, నేను చదవను. స్వయంగా వచ్చి బ్రతిమాలకుండ, లేఖ పంపుతాడా? ఏంత పొగరు? నువ్వే చదువు!" ఎరుపెక్కిన కళ్ళతో అంది కమలాక్షి.
వినవమ్మా నీ విభుడు వినయముగ పంపిన సందేశం ఇదే.
అంతటి మహాపురుషుడు నిన్ను అభయం అడుగుతున్నాడు.
శ్రీరమణుడు అహాన్ని చంపుకుని రహస్యముగా నీకు రాసిన లేఖ ఏమిటంటే,
నువ్వులేక ఆయన బహువేదనకు లోనౌతున్నాడట! నీ వియోగవేదన మనసుని
కల్లోలపరుస్తుంటే శేషశయ్య తాపాన్ని రేపుతుందట.
ప్రపంచానికే మూలపురుషుడు నీ పాదాలకు సమర్పించే ఈ లేఖ
వట్టి ప్రేమలేఖకాదు వేదాంత రచనలట. (మానవుల సంక్షేమంకోసం దేవుళ్ళచే చేయబడినవే కదా వేదములు?)
నీ దయలేక నిమిషాలు యుగాలులా గడుస్తున్నాయని విలపిస్తున్నాడమ్మ అతను!ఈ లేఖ విన్నాక శ్రీదేవి కళ్ళు కొలనులైపోయుండవూ?
అంతటి మహాపురుషుడిపై నీ కినుకచూపులు చూపిన చాలు,
కింకరునివలే నీకు సేవలు చేస్తూ పడియుంటారట (ఆ శ్రీహరి గతే ఇంతటిదాక వస్తే మామూలు మానవులం మనమెంత?)
ఇప్పుడర్థం అయిందట తనకి, నీ కరుణతోనే జగమంతా సంక్షేమంగా ఉండగలదని.
అందువలన సంకెళ్ళు లేకనే నీచుట్టు తిరుగుతుంటారట.
ఆ వేంకటవిభుడు అలమేలుమంగకు రాసిన లేఖను అన్నమయ్య కీర్తనగా ఎలా పలికించారో వినండి.
================
================
పల్లవి
విభుని వినయములు వినవమ్మా
నిన్ను అభయంబడిగీ నయ్యో తాను
చరణం 1
రహస్యమున శ్రీరమణుడు పంపిన
విహరణలేఖలు వినవమ్మా
అహిపతిశయనంబతి తాపంబై
బహువేదనకగపడెనట తాను
చరణం 2
ఆదిమపతి నీ యడుగుల కెరగిన
వేదాంతరచన వినవమ్మా
నీదయగానక నిమిషామే యుగమై
ఖేదంబున నలగీనట తాను
చరణం 3
కింకరుడట నీ కినుక చూపులకు
వేంకటపతిగతి వినవమ్మ
సంకెలేక నీచనవున జగములు
కొంకకిపుడె చేకొనెనట తాను
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
విభుడు - దేవుడు
అహిపతి - శేషడు; పాము
ఆదిమపతి - మూలపురుషుడు; Supreme personality
ఖేదం - శోకము; Grief
కింకరుడు - సేవకుడు, దాసుడు;
కినుకచూపు - అలుకుతోగూడిన కోపమైన చూపు
కొంకి - hook
==========================================
pallavi
vibhuni vinayamulu vinavammaa
ninnu abhayaMbaDigee nayyO taanu
charaNaM 1
rahasyamuna SreeramaNuDu paMpina
viharaNalEkhalu vinavammaa
ahipatiSayanaMbati taapaMbai
bahuvEdanakagapaDenaTa taanu
charaNaM 2
aadimapati nee yaDugula keragina
vEdaaMtarachana vinavammaa
needayagaanaka nimishaamE yugamai
khEdaMbuna nalageenaTa taanu
charaNaM 3
kiMkaruDaTa nee kinuka choopulaku
vEMkaTapatigati vinavamma
saMkelEka neechanavuna jagamulu
koMkakipuDe chEkonenaTa taanu
==========================================
adbhutam!!!!!!!!!!!!!!!!!!!
ReplyDeleteadbhtam!!!!!!!!!!!!!!!!!!
ReplyDelete:)
ReplyDeleteపాట కన్నా మీ వ్యాఖ్యానం గ్రేట్ అండీ! suuuuuuuuuuuuuuuuper
ReplyDeleteహిహి ..ఈ తరాన్ని...టెక్నాలజీ ని బానే తిట్టేసారు :)
ReplyDeleteNice one as usual! :)
పాట వింటూ, పోస్ట్ చదివాను. చాలా బాగుందండీ. Thank you
ReplyDeleteమంచిమంచి అన్నమయ్యపదాలను అందిస్తున్నారండి!
ReplyDeleteఈ పాటలో నాకు నచ్చిన విశేషం ఏమిటంటే - దూతిక, ఉత్తరాన్ని ఉన్నదున్నట్టు చదవకుండా, తాను చదివి దాన్ని వ్యాఖ్యానిస్తూ అమ్మవారికి చెప్పడం. అయ్యవారి ప్రేమలేఖను అమ్మవారికి చదివి వినిపించాలంటే ఆ దూతికకు అమ్మవారిదగ్గర ఎంత చనవుండాలి! ఆ చనవంతా పాటలో వినిపిస్తుంది. ఆ గొంతులో, అత్యంత ప్రియులైన నెచ్చెలులు చేసే వేళాకోళం కూడా చక్కగా ధ్వనిస్తోంది! ఈ కీర్తనలో అన్నమయ్య, నెచ్చెలి అవతారమెత్తి తన అద్భుత నటనని మాటల ద్వారా మన కళ్ళకు కట్టించాడు.