21 December 2010

పలువేడుకలతోనె పాయకుండరమ్మా

అలగడం భార్యలకు ముద్దు. అలుక తీర్చడం భర్తల వంతు.

అలకతీర్చేందుకు తనవల్ల అయినన్ని ప్రయత్నాలు చేసినా, భార్య అలుక మానలేదంటే ఆ రోజంతా వృథాయే. మనసంతా కలతల మేఘాలు తుంపర్లు చల్లుతుంటాయ్. దేని మీదా మనసు నిలువదు, ఏకాగ్రత కుదరదు. ఇద్దరూ వారి ఉద్యోగాలు సక్రమంగా చేసుకోలేరు. చిరాగ్గా, కోపంగా రోజేం బాగుంటుంది! కోపాలూ, అలుకలూ మాని మనసులు మళ్ళీ కలిసేవరకు ఇదే పరిస్థితి.

మామూలు మానవ పురుషుణ్ణి వరించిన వనిత అలగడంలో న్యాయం ఉంది. ఈ మానవ పురుషుడు ఆ అలుక తీర్చలేకపోవడంలోనూ ఓ అర్థం ఉంది. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ మాధవుణ్ణి చేపట్టిన శ్రీమహాలక్ష్మి అలగడం ఏంటీ?

మానవ ఆలు-మగల అలుకలవల్లా, గొడవలవల్లా పెద్ద నష్టం ఉండదేమో! ఆ జగన్మాత అలిగిందని ఆ లోకరక్షకుడు తనపనులు మానుకుంటే ప్రపంచం ఏం కావాలి? అని భయపడుతున్నాడు అన్నమయ్య. అందుకే శ్రీహరిని వరించిన తన చెల్లెలు అలమేలుమంగకు ఇలా హితవులు చెప్తున్నాడు అన్న(మ)య్య. "నీ పతిమీద చీటికి మాటికి అలుగకు తల్లీ, అతనూ నీయంత గొప్పవాడే! నీ పతిని ఎడబాయకు. అదే నీకూ, మాకూ, ప్రపంచానికీ శ్రేయస్కరం!"

"ఆయనేంటి అంత గొప్ప? హితవెల్లా నాకే చెప్తారేం? అతగాడికి చెప్పొచ్చుగా? నేనేం తక్కువ? నేనే ఎందుకు సర్దుకుపోవాలి? నాకు ఆయన ఎంత అవసరమో, ఆయనకూ నేను అంతే అవసరం! చెప్పండి ఆ మహాశయుడికి!" అంటుంది అలమేలుమంగ.

అందుకు అన్నమ్మయ్య "నీ గొప్పతనము మెచ్చి, నీ మేలిమి గుణములు నచ్చి, నీ సౌందర్యానికి పులకించి, నీ ప్రేమకోసం తపించి, నీ జతలో గడిపే జీవితంకోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మరిచావటమ్మా? ఆయన చేసిన తపములన్నీ నీకోసం కాదా? నిను చేరుకోవాలని ఎన్ని అవతారలెత్తాడో మరిచితివా? విను తల్లీ, నీ గొప్ప తనము నీది; ఆయన గొప్ప తనం ఆయనది! ఇద్దరి గొప్పతనాలూ సమానమే. నువ్వు తనకన్నా ఓ మెట్టు పైనుంటే చూసి ఆనందించాలని ఉంది. అదెలా వస్తుందో తెలుసా? సర్దుకుపోవాడానికి ఎవరైతే ఓ మెట్టు దిగుతారో వారి ఖాతాలో 'గొప్పతనం' మరో వంతు పెరుగుతుంది. కనుక గొప్పతనంలో నీదే పైచెయ్యి అవుతుంది! అతగారికి హితవెందుకు చెప్పం తెలుసా? అతని పెంపకం మీద మాకు అవగాహన లేదు. అతని గతం మేమెరిగినది తక్కువ. అయితే నీ గతము మేమెరుగుదుము. మా పెంపకం మీద మాకున్న విశ్వాసం ఎట్టిదంటే 'ఎటువంటి పరిస్థితులొచ్చినా దాన్ని మనోధైర్యంతో నువ్వు ఎదురుకోగలవన్న రీతిలోనేగా పెంచాం! అంతే కాదు, తల్లి-తండ్రి గొడవలుపడి ఎడముఖం-పెడముఖంగా ఉంటే పిల్లెలా బాగుంటారూ? ఈ ప్రపంచానికి తల్లి నీవు, తండ్రి అతడు! లోకకళ్యాణం మీ అన్యోన్యం!" అని అంటున్నాడు అన్నమయ్య.

ఈ కీర్తనలో విష్ణుమూర్తి ఎత్తిన పది అవతారలనూ ఎంత చక్కగా ప్రస్తావించాడో చూడండి అన్నమయ్య.


===================================================
రాగం : సారంగనాట

AUDIO కోసం

===================================================

పల్లవి
అలుగకువమ్మ నీవాతనితో ఎన్నడును
పలువేడుకలతోనె పాయకుండరమ్మా

చరణం 1
జలధి తపముసేసె, సాధించె పాతాళము
నెలత నీ రమణుడు నీకుగానె
ఇలవెల్లా హారించె నెనసె కొండగుహల
ఎలమి ఇన్నిటాను నీకితవుగానె

చరణం 2
బాలబొమ్మచారై ఉండె, పగలెల్లా సాధించె
నీలీలలు తలచి నీకుగానె
తాలిమి వ్రతము పట్టి ధర్మముతో గూడుండె
పాలించి నీవుచెప్పిన పనికిగానె

చరణం 3
ఎగ్గు సిగ్గు చూడడాయె ఎక్కెనుశిలాతలము
నిగ్గులనన్నిటా మించె నీకుగానె
అగ్గలపు శ్రీవెంగటాద్రీశుడై నిలిచె
వొగ్గి నిన్ను ఉరాన మోచి ఉండుటకుగానె


కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :
ఎన్నడును = ఎప్పటికీ
పలు = ఎన్నెన్నో, అనేకమైన
వేడుక = సంబరం, వినోదం
పాయక/బాయక = విడిపోకుండ

జలధి = సముద్రము
తపము =  తపస్సు
నెలత = వనిత, మగువ
నీకుగానె = నీకోసమేగదా
ఇలవెల్లా = భూలోకమంతా
హారించే = దాచేసే
నెనసె = ??
ఎలమి = సంతోషము, విలాసము
నీకు ఇతవుగానే = నీకు నచ్చినట్టు, ఇష్టమైనట్టు

బాల బొమ్మచారి = వామనుడు
పగలెల్లా = విరోధములు అన్నిటిని
తాలిమి = ఓర్పుతో
వ్రతము = యాగము
పాలించి = రక్షించెను

ఎగ్గు = అవమానము
సిగ్గు = బిడియము
శిలాతలము = చల్లని కొండ
నిగ్గు = నెగ్గు, గెలువు
అగ్గల = అగ్గలముగా, మొండితనంగా
వొగ్గి = పూనుకొని
ఉరానా = గుండెలపై


తాత్పర్యం :
ఆ కొండలరాయుడిని ఎన్నడూ ఎడబాయక పక్కనే ఉండి నిత్యకళ్యాణములు, పచ్చతోరణములతో వేడుకలు జరుపుకోవమ్మ, అలమేలూమంగా! అలుక శ్రుతి మించినా, కోపాలు మితిమించినా వేడుకలు కాస్త వేదనలవుతాయి.


క్షీరసాగరమథనవేళ వాసుకి పట్టునుండి జారిపోతున్న మందరగిరికింద ఊతగా నిలిచేందుకు తాబేలుగా మారలేదూ? వీపున మందరగిరి కవ్వంలా తిరుగుతు ఉంటే కాస్తయినా చలించకుండ నీటిలో కఠోర తపస్సుచేసేవాడిలా నిలిచి కష్టాలు పడినదెవరికోసమూ?(కూర్మావతారము). వేదములను సోమకాసురుడు నీటిలోపల దాచినపుడు మత్స్య అవతారమెత్తి కడలినీదినది నీకేగా? (వేదాములలో సారమే మహాలక్ష్మి). వరహావతారుడై భువిని కాపాడి ఉదయగిరి గుహలో కొలువైనదెవరికో? ఇన్ని వేదనలు కష్టాలు పడినది నీ ఎదలో చోటుకోసమేగా?

పొట్టివాడై అవతరించి మూడడుగులతో ముల్లోకాలను సంపాదించినది నీకోసమేగా?(వామనావతారము) జమదాగ్నికి రేణుకాదేవికి బ్రాహమణక్షత్రియుడై పుట్టి తనపరాక్రమాలతో పగవారిని హతమార్చలేదా? ఈ రెండు అవతారాలలోను నిన్ను తలచుకుంటూనే బ్రహ్మచర్యం చేపట్టలేదా? త్రేతా యుగములో రాక్షశులను తొలగించి ధర్మమార్గాన లోకాన్ని పరిపాలించాడు. నీ వియోగాన ఏకపత్ని వ్రతుడై నీ కనకప్రతిమతో అశ్వమేధయాగాలు చేయలేదా? అన్నీ నీకోసమే!

ఎగ్గు సిగ్గులని పక్కనబెట్టి ఎందరితో తిరిగినా, రాధకోసం శిలాతలమెక్కినా, తులాభారంలో నీ తులసిదళమేగా నెగ్గినది? అది ధ్వాపర యుగం కథ. ఇప్పుడు ఈ కలియుగాన తిరుమలగిరిమీదా నీకోసం శ్రీవేంకటేశుడై పట్టుదలతో, మొండిగా ఒంటరివాడై నిలుచున్నది ఎందుకో తెలుసా? నారసిమ్హ అవతారాన గుండెలపై నిన్ను మోచినట్లు ఇప్పుడూ నిన్ను తన గుండెలమీద నిలుపుకోవాలని వేచున్నాడు ఆ తిరుమలగిరిపై.

===================================================

rAgaM : sAraMganATa

===================================================

pallavi
alugakuvamma niivaatanitO ennaDunu
paluvEDukalatOne paayakunDarammaa

charaNaM 1
jaladhi tapamusEse, saadhimche paataaLamu
nelata nee ramaNuDu neekugaane
ilavellaa haarinche nenase koMDaguhala
elami inniTaanu neekitavugaane

charaNaM 2
baalabommachaarai unDe, pagalellaa saadhinche
neeleelalu talachi neekugaane
taalimi vratamu paTTi dharmamutO gUDuMDe
paalinchi neevucheppina panikigaane

charaNaM 3
eggu siggu chUDaDaaye ekkenuSilaatalamu
niggulananniTaa minche neekugaane
aggalapu SreeveMgaTaadreeSuDai niliche
voggi ninnu uraana mOchi unDuTakugaane
===================================================

1 comment:

  1. ఎగ్గు సిగ్గు చూడడాయె - krishnavataramu
    ఎక్కెనుశిలాతలము - bauddhavataramu , ee avataram lo muni avatarametti , tripurasurudi(?) bharayalanu mohimpajestadu ., silatalamu ante rocky surface , ante munulu ralla pai kuchuni tapassu chestarani nenu ardam cheskunnanu.

    ReplyDelete