12 January 2012

ఏటి బిడ్డ కంటివమ్మ యెశోదమ్మా?

రేపల్లెలోని గొల్లభామలు యశోదమ్మ వాకిట చేరి, "ఎలా కన్నావు, యశాదా? ఇంతగొప్పబాలుని? అల్లరి కిట్టయ్యని? అల్లరిబాలుడని వదిలేద్దామన్నా లేదాయే! అల్లరిపనులతోబాటే గొప్పగొప్ప పనులుకూడా చేస్తుంటాడు. ఇటువంటి బిడ్డని కనేందుకు నువ్వెంత పుణ్యము చేశావో? నీ అదృష్టం ఎంతటిదో? మాకెవ్వరికీ అర్థంకాడమ్మా! నువ్వే చెప్పాలి వీడేంటోనని" అని ప్రశ్నిస్తున్నారు. వీరి ఆశ్చర్యాన్నీ, యశోదమ్మ మాటలనూ ఈ కీర్తనలో పూరించారు అన్నమయ్య. 

========================================
రాగం : శంకరాభరణం
( N.C.శ్రీదేవి గారి గళంలో - గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు స్వరపరిచిన కీర్తన)
ఇక్కడ వినండి
=========================================
పల్లవి
ఏటి బిడ్డ గంటివమ్మ యెశోదమ్మ
గాటపుదేవతలెల్ల గాచుకున్నా రితని

చరణాలు :
గొల్లెతలు :
చెక్కుమీటి పాలువోయ చేరి నోరు దేరచితే
పక్కునను బొడచూపె బ్రహ్మాండాలు
అక్కున నలముకొంటే నంగజతాపము మోచె
మక్కువకు వెరతుము  మాయపు బాలునికి

యశోదమ్మ :
పొత్తులలో నుండగానె భుజాలు నాలుగుదోచే
యిత్తల బాలునికేవి యిటువంటివి
యెత్తుకొన్నా వేకమై యెవ్వరికి వసగాడు
హత్తిచూడ వెరతు మీ యారడిబాలునికి

గొల్లెతలు :
తేఱి వీనితోడిముద్దు దేవలోకము పనులు
మీఱి యేవి చూచినాను మితిలేనివి
ఆఱడిగొల్లెతలము అట్టె కూడి యాడితిమి
వేఱు సేయ వెరతుము శ్రీవేంకటాద్రిబాలుని

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
ఏటి = ఎటువంటి
గంటివమ్మ = కన్నావమ్మ
గాటపుదేవతలెల్ల = గొప్పగొప్ప దేవతలందరు
గాచుకున్నారు= ఇతనికై వేచియున్నారు

చెక్కుమీటి = చెక్కిళ్ళు నిమిరి/పట్టుకుని
పాలువోయ = పాలుపోసేందుకు/పాలుతాగించేందుకు
పక్కున = తటాలున
బొడచూపె = ప్రత్యక్షింపజేశాడు, చూపాడు
అక్కున = రొమ్ములకు
అలముకొంటే = హత్తుకుంటే, కౌగిలించుకుంటే
అంగజతాపము = పుత్రవాత్సల్యము
మోచె = కలిగినది, వచ్చినది
మక్కువకు = కూరిమికి, వాత్సల్యానికి
వెరతుము = ఆశ్చర్యపోయెదము, భయపడెదము

పొత్తులలో నుండగానె = గర్భములో/కడుపులో ఉండగానే
భుజాలు = భుజములు, చేతులు
నాలుగుదోచే = నాలుగున్నట్టు అనిపించినవి
ఇత్తల బాలునకేమి = అలాంటి బాలునికి ఏమి
యెత్తుకొన్నా వేకమై = ఎత్తుకున్నాము అందరం
యెవ్వరికి వసగాడు = ఎవరికీ శాంతించడు/సాధ్యపడడు
హత్తిచూడ = హత్తుకుని చూస్తే

తేఱి = తేటపడు 
వీనితోడి =వీని
మీఱి  = అతిశయించి, దాటి, కాదని
మితిలేనివి = హద్దూ అదుపులు లేనివి
ఆఱడిగొల్లెతలము = దుష్టగొల్లెతలము 
వేఱుసేయ = వేఱువేఱు అనుకోడానికి
వెరతుము = భయపడెదము

తాత్పర్యం : 
గొల్లెతలు :
ఎలాంటి బిడ్డను కన్నావమ్మ యశోద? దేవలోకంలోని గొప్పదేవతలందరు ఈ చిన్నపిల్లవాడి ఆనతికోసం చూస్తున్నారు. (దేవలోకపు దేవతలందరు ఈ పిల్లవాణ్ణి సదా రక్షించుతున్నారన్న అర్థంకూడా వస్తుంది).

గొల్లెతలు :
మేము పాలుకాచుతుంటే, చల్లచిలుకుతుంటే అక్కడికొచ్చి నిలుచుని చూస్తుంటాడు. అరే చిన్నపిల్లవాడు కదా అని చెక్కిలి పట్టి కాస్త పాలు తాగించుదామనో, వెన్న తినిపించుదామనో "ఎక్కడ, ఆ అని నోరు తెరువు" అంటే, "నువ్వేంటి నాకు వెన్న తినిపించేది? పాలు త్రాగించ్చేది? ఈ అండ చరాచరములన్నియూ నాలో నిక్షిప్తమయున్నాయి" అనే రీతిలో తననోటిలో ప్రత్యక్షింపజేసి చూపుతాడు. దైవ అంశంతో పుట్టినవాడులే అనుకుని హత్తుకుంటే కొడుకుని ఎత్తుకున్నప్పుడు కలిగే పుత్రవాత్సల్యము కలుగుతుంది. వీడు బాలుడా, దేవుడా అని ఆశ్చర్యం కలుగుతుంటుంది మాకు.
వారి మాటలువిన్న యశోద మాతృహృదయం పొంగిపోయి ఇలా అంటుంది...

యశోద :
"మీకిప్పుడే తెలిసింది వాడు అందర్లాంటి బిడ్డకాదని! నాకు వాడు కడుపులో(గర్భంలో) ఉండగానే అర్థమయింది. ఎలా అంటారా? నెలలునిండుతున్నకొద్ది కడుపులో కదిలేబిడ్డ చేయెది, కాలెదని తెలుస్తుంది కదా? వీడు కడుపులో ఉన్నప్పుడు నాలుగుచేతులు కదులుతున్నట్టు అనిపించేది నాకు. అప్పుడే అనుకున్నాను పొత్తిళ్ళలో ఉన్న శిశువు మామూలు శిశువుకాదు దైవాంశముపొందిన బిడ్డ అని. పుట్టాకకూడా అందరు పిల్లల్లా లేదు నా కన్నయ్య. ఎవరయినా ఎత్తుకుని ఊరడించినా ఊరుకోడు. నేనెత్తుకుంటే మాత్రమే గమ్మున ఉండేవాడు. ఇలా ఎన్నెన్నో రకాలుగా నాకు అర్థమయింది నా బిడ్డమామూలు బాలుడు కాదని" అంది హృదయము పొంగిన యశోద.  [పాపం యశోద! కృష్ణుని మీద ఎనలేని వాత్సల్యముతో అతిశయోక్తిగా(exaggeration చేసి) చెప్పేస్తుంది! నిజానికి కృష్ణుణ్ణి మోసి కన్నది తానుకాదన్న నిజం తెలియదు కాదా?]
విన్న గొల్లెతలు ఇలా అంటున్నారు,

గొల్లెతలు :
"అందంగా అల్లరిచేస్తూ ముద్దొచ్చే పసిపిల్లవాడిలానూ ఉంటాడు, పెద్దపనుల్లోనూ జోక్యం చేసుకుని పరిష్కారాలందిస్తుంటాడు.  అల్లరి చేస్తున్నప్పుడు భరించలేక ఈ బాలుణ్ణి "దుష్టుడని" తిడుతుంటాము. మరోసారి వీడు వయసుకుమీరిన మంచిపనులు చేస్తున్నప్పుడేమో "అయ్యో ఇలాంటి బిడ్డనా తిట్టాము" అని నొచ్చుకుంటాము. ఇదంతా చూస్తుంటే ఆ శ్రీవేంకటాద్రి మీద కొలువున్న వెంకటాద్రీశుడే నీ కడుపున బాలుడై పుట్టాడు అనిపిస్తుంది" అని ఆశ్చర్యపోతున్నారు గొల్లెతలు.



=======================================
[ Lyrics in RTS format ]

rAgaM : SankarAbharaNaM
pallavi
ETi biDDa gaMTivamma yeSOdamma
gATapudEvatalella gAchukunnA ritani

charaNAlu :

golletalu :
chekkumeeTi pAluvOya chEri nOru dErachitE
pakkunanu boDachUpe brahmAMDAlu
akkuna nalamukoMTE naMgajatApamu mOche
makkuvaku veratumu  mAyapu bAluniki

yaSOdamma :
pottulalO nuMDagAne bhujAlu nAlugudOchE
yittala bAlunikEvi yiTuvaMTivi
yettukonnA vEkamai yevvariki vasagADu
hattichUDa veratu mee yAraDibAluniki

golletalu :
tEri veenitODimuddu dEvalOkamu panulu
meeri yEvi chUchinAnu mitilEnivi
AraDigolletalamu aTTe kUDi yADitimi
vEru sEya veratumu SreevEMkaTAdribAluni 
=====================================

4 comments:

  1. యెంత బాగా వ్రాశారు.అసలు మీకు ఇంతకు ముందు
    తెలుగు రాదంటె నమ్మబుద్ది కాదు

    ReplyDelete
  2. రాజ్ కుమార్ :-)

    గిరీష్ గారూ, ధన్యవాదములండి.

    శశి కళ గారు,
    నమ్మండి. అంతా అన్నమయ్య కృపేనండి.

    ReplyDelete