27 December 2011

ఇట్టె సంసారికి ఏదియూ లేదాయే...

అజ్ఞానం కారణంగా ఈ జనులు సంసారాన్ని భారమనుకుంటున్నారు. జన్మించిన ప్రతి మానవుడూ, ఆడైనా, మగైనా సంసారసాగరమీదక తప్పదు! విశ్రాంతిలేకుండ ఈ భవసాగరమీదుతుంటే అలసిపోవడమే తప్ప సుఖములేదు. భక్తి అనేటి జ్ఞానంతో శ్రీవేంకటేశుడనే గట్టెక్కి సేదతీర్చుకుంటూ, ఆ విశ్రాంతిని ఆస్వాదించుకుని మరలా ఈదినట్టయితే అలసటతెలియదు, జీవితంమీద విసుగుండదు. ఈ గొప్ప తత్వాన్నిఅన్నమయ్య అందరికీ అర్థమయ్యేలా ఎంత సులువైన ఉదాహరణలతో చెప్తున్నారో వినండి...


===================
రాగం : ఆహిరి
ఇక్కడ వినండి
===================

పల్లవి
ఇట్టె సంసారికేదియు లేదాయ
తట్టువడుటేకాని దరిచేరలేదు

చరణం 1
ములిగి భారమోపు మోచేటివాడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలగని భారమెందును దించలేదు

చరణం 2
తడవి వేపచేదు త్రావెడివాడు
ఎడయెడ దిను దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడు జేదెకాని యెక్కడ దీపులేదు

చరణం 3
దొరకొని హేయమే తోడేటివాడు
పరిఠవించును మేన బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుగలేడు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఇట్టె = అలా త్వరగా, క్షణాలలో
సాంసారికేదియు = సంసారికి + ఏదియు
తట్టువడు = బాధపడు, కష్టములు అనుభవించు
దరిచేరలేదు = గట్టుచేరడమన్నది లేదు, ముగింపులేదు

ములిగి  = కూర్చబడిన (packed)
భారపుమోపు = బరువైన మోపు 
(మోపు అనగా, ఉదాహరణకు గడ్డిని ఉంటగా తాడువేసికట్టితే దాన్ని "గడ్డిమోపు" అంటాము)
మోచేటివాడు = తలమీద మోచుకెళ్ళేవాడు
నాడాడను = ఆడ ఆడ = అక్కడక్కడ
అలరు = రోదించే, ఏడ్చే (ఈ అర్థం సరికాదని ఎందరు పండితులు నన్ను తంతారో - అయినా ఇది సరైన అర్థమే)
తొలగని = విడిపోని, తప్పుకోని

తడవి = కష్టపడి
వేపచేదు = చేదైన పదార్థము/ఔషధము, వేపనూన
త్రావెడివాడు = తాగేవాడు
(ఆ రోజుల్లో కొన్ని జబ్బులకు ఔషధముగా వేపనూనె తాగేవారు)
ఎడయెడ = మధ్యమధ్యలో
దిను = తిను
దీపేమైనను = తీపివస్తువేదైనా
అడరు = కష్టపడే
కడు = అత్యధికమైన
జేదేకాని = చేదేకానీ
దీపులేదు = తీపులేదు 
దొరకొని = (మార్గాంతములేక) సిద్ధపడి
హేయము = మలినము, మురికి
తోడేటివాడు = శుద్ధిచేసేవాడు, శుభ్రపరిచేవాడు
పరిఠవించును = ధరించును, చల్లుకొనును
మేన = శరీరము
బరిమళము = పరిమళము = సుగంధద్రవ్యము
అరిది = ధుర్లభమైన
ఇరవు = స్థిరమైన
నెఱుగలేడు = తెలుసుకోలేడు


తాత్పర్యం : [ పైన ఆడియో విన్నవారికి తాత్పర్యం అవసరం ఉండదు :-) ]
వేంకటవిభుని తెలుసుకోలేని అజ్ఞాని సంసారసాగరంలో పలు కష్టాలుపడుతూ భవసాగరమీదటమే తప్ప గట్టెక్కే మార్గమేలేదు.

అడవిలోనుండి కట్టెలమోపు మోసుకొచ్చేవాడు అలసినప్పుడల్లా అక్కడక్కడా ఆ మోపుని కిందదించిపెట్టి కాసేపు సేదతీర్చుకుంటాడు. అయితే అజ్ఞానియైన సంసారికి అటువంటి ఉపాయాలు తెలియవు. అందుకే మోస్తున్న సంసార భారాన్ని తొలగని భారమనుకుంటూ నిష్ఠూరపడుతుంటాడు.

జబ్బుతోనున్నవాడు చేదైన మందుని తాగేప్పుడు మందులోని చేదు తెలియకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కొంచం తేనో, పంచదారో, లేక మరో తీపి పదార్థమో తింటాడు. వేంకటేశ మంత్రమన్న తీపిని తెలుసుకోలేని సంసారి తన జీవితాన ఉన్న చేదుని తాగుతూ ఇబ్బందులు పడుతుంటాడు; అతనికి చేదే తప్ప తీపియుండదు.

మురికికాలువలు శుభ్రపరిచేవాడు తన పని అయిపోగానే శుభ్రంగా స్నానంచేసి నానా విధములైన సుగంధద్రవ్యాలను తనమేనిపై చల్లుకుంటాడు. దుర్వాసనకు దూరమయ్యేందుకు పరిమళద్రవ్యాలు మార్గాలు. అలాగే సంసారంలో పడి నానాకష్టాలు పడుతున్న సంసారికి విముక్తి కలగాలంటే శ్రీవేంకటేశుని తెలుసుకోవడమే స్థిరమైన మార్గము.

================================
[ Lyrics in RTS format ]

rAgaM :  Ahiri

pallavi
iTTe saMsArikEdiyu lEdAya
taTTuvaDuTEkAni darichEralEdu

charaNaM 1
muligi bhAramOpu mOchETivADu
alasi diMchukonu nADADanu
alaru saMsAriki nadiyu lEdAya
tolagani bhArameMdunu diMchalEdu

charaNaM 2
taDavi vEpachEdu trAveDivADu
eDayeDa dinu deepEmainanu
aDaru saMsAriki nadiyu lEdAya
kaDu jEdekAni yekkaDa deepulEdu

charaNaM 3
dorakoni hEyamE tODETivADu
pariThaviMchunu mEna barimaLamu
aridi saMsAriki nadiyu lEdAya
iravu vEMkaTapati ne~rugalEDu
================================
-  annamayya / annamAchArya
================================

7 comments:

  1. పాటగా చదివినప్పుడు తెలియని భావం...మీ వివరణలో తెలిసింది. భావం రమణీయంగా ఉంది. అయితే వేపచేదు తాగేవాడు అన్న మాటకి వేపచేదు అంటే వేపనూనె అనే అర్థం రావవసిన పనేముంది. వేప అంత చేదు అని అర్థం చాలుగా. నూనె అన్న మాట రాదేమో.
    అలరు అంటే ఇక్కడ రోదించే అనే అర్థం కూడా నా ఉద్దేశంలో పొసగదు. మనకు అలరులు కురియగ అనే పాటలో పూలు కురియగ అనే అర్థం చెప్తున్నారుగా కొందరు. అలరు అంటే ప్రకాశించు అని కదా ఓ అర్థం.
    అది అలా ఉంటే, అలరారు వంటి పదాలలో ఉన్న అలరు పదం చూస్తే ఆ విధంగా ఉన్న అనే అర్థం వస్తుందేమో. ఏ నిఘంటువులోనూ మీరు చెప్పిన అర్థం కనిపించలేదు సుమా. అది ఒకసారి చూడండి.
    తర్వాత అరిది పదం. అరిది పదం...దీనికి దుర్లభమైన అని కాక ఆశ్చర్యంగా, అబ్బురంగా అన్న బ్రౌణ్య నిఘంటువు అర్థం తీసుకోవచ్చేమో. కాలువలు కడిగేవాడే అలా చేస్తాడు కదా..ఈ సంసారికి అలాంటి ఆలోచన రాకపోవడం అబ్బురమే అనే ఉద్దేశం ఉందేమో అనే భావంతో అన్నారేమో అన్నమయ్య.
    గొప్ప భావం. మంచి పాట. వివరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. సుధ గారూ,
    నా వివరణని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు :-)

    మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానములు.

    వేపచేదు అంటే వేపనూనె అనే అర్థం రావవసిన పనేముంది. వేప అంత చేదు అని అర్థం చాలుగా.
    వేపచేదు అంటే వేపనూనె అని రాయడంలో కొంత తప్పు జరిగిందండి. నేను చెప్పదలచుకున్న నేపద్యం ఏమిటంటే, పూర్వకాలంలో తీరని దగ్గు, రొంపవంటి జబ్బులకు గ్రామవైద్యులు వేపనూనెని ఔషధముగా తాగించేవారు. వేపనూనె త్రాగించినవెంటనే అఱచేతిలో తేనెపోసి నాకించేవారు వేపనూనెయొక్క చేదుని మరిపించేందుకు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని వివరణ, ప్రతిపదార్థమూ రాయడంవలన ఆ పొరబాటు జరిగింది. మీరు కామెంట్ రాశాక ప్రతిపదార్థము సవరించాను.

    ఈ కీర్తనలో సంసారికి ఒక్కో చరణంలో ఒక్కో విశేషణము(adjective) వాడారు అన్నమయ్య. ప్రతి విశేషణము(adjective) ఇక్కడ నెగటివ్ సెన్సె‌లో వాడారన్నది నా భావన. "అలరు" సంసారి, "అడరు" సంసారి, "అరిది" సంసారి.

    అలరు అన్నపదానికి మీరన్నట్టుగా "పువ్వు", "వికసించు" అనే అర్థాలే ఉన్నాయి. ఇక్కడ "అలరు" అన్న పదం ద్రావిడ(తమిళ)భాషలోనుండి వాడుకున్నారేమో అని నాకనిపించింది. ద్రావిడ భాషలో, "అలఱు/అలఱల్" అనగా రోదించు/రోదనము అని అర్థమండి. అందుకే ఈ సందర్భానికి ఆ భావం సరియైనదనుకున్నాను.

    అరిది పదానికి మీరు చెప్పినట్టు "ఆశ్చర్యం", "అబ్బురం" అన్న అర్థాలే సరి అనుకుంటాను. మారుస్తానండి.

    ఇంత శ్రద్ధగా పరిశీలించి, తప్పులను సవరించమన్నందుకు ధన్యవాదములు.

    - భాస్కర్

    ReplyDelete
  3. భాస్కర్ గారు, మీరు చెప్పిన వివరణ బావుంది. అన్నమయ్య భాషను తెలుసుకోవాలంటే బ్రౌణ్యంతో పాటు ద్రావిడ భాషా నిఘంటువును కూడా పక్కన ఉంచుకోవలసిన అవసరం ఇప్పుడు తెలిసి వచ్చింది. (మొన్న ద్రవిడ విశ్వవిద్యాలయం స్టాల్ లో పుస్తకప్రదర్శనలో చూసాను..ఈ ద్రావిడభాషా నిఘంటువు...కానీ కాసులుసరిపోక కొనలేదు ఆరోజు)
    నిజమే. కాలాన్ని బట్టి కొన్ని అర్థాలు ఊహించాలి. వేపనూనెను అలా వాడేవారని ఇప్పుడు తెలుస్తోంది. అలాగే అలఱు అనే పదానికి ఆ అర్థం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చాలా బాగుంది. సంసార సాగరాన్ని భక్తి అనే నావతో.. దాటవచ్చనే భావం చాలు..అంతా ఆయనే చూసుకుంటాడు. అన్న నమ్మకం వచ్చేస్తుంది.. అందుకనేమో..ఆస్తికులు చాలా నిబ్బరంగా ఉంటారు.

    ReplyDelete
  5. :)))....annitikii aa paivadu unnadu !!
    jai annamayya...
    jai bhaskar garu :)

    ReplyDelete
  6. నమస్కారం భాస్కర్ గారు;

    మీరందించిన అర్థ తాత్పర్యాలు చాలా బాగున్నాయండి. ఇలాంటి సైట్ / బ్లాగ్ కోసం చాలా రోజులుగా చూస్తున్నాను. నాదొక్క చిన్న మనవి, ఈ కింది కీర్తనకు కూడా అర్థం బోధపడటం లేదండి, కొంచం మీరు వివరిస్తే సంతోషం....
    తెల్లవారనియ్యరో తెరువు యీ
    పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు ...

    విజయ సువర్ణ

    ReplyDelete
  7. నమస్కారం, మీరు ఇచ్చిన అర్థ తాత్పర్యాలు చాలా బాగున్నాయండి.నాదొక చిన్న మనవి, ఈ కింది కీర్తనకు కూడా అర్థం వ్రాస్తే సంతోషం.
    తెల్లవారనియ్యరో తెరువు యీ
    పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు...

    విజయ సువర్ణ

    ReplyDelete