14 May 2011

చీమ కుట్టెనని చెక్కిట కన్నీరు జార వేమరు వాపోయేవాడు...

చిన్నపిల్లాడు చేసే అల్లర్లు చూసేందుకు ముద్దుగా ఉంటాయ్; శ్రుతిమించిపోనంతవరకు. గోకులంలోని కృష్ణుడు గొల్లభామలతో చేసే అల్లరి అంతా, ఇంతా కాదు. ఉట్లమీదున్న పాలు, పెరుగులను దొంగిలించే కృష్ణుడి మీద కొందరు గొల్లభామలు యశోదతో ఫిర్యాదు చేస్తారు. రోజు రోజుకీ వీడి అల్లరి ఎక్కువైపోతుంది! కృష్ణుడిని ఎలా దండించాలో తెలియక, చెట్టుకు కట్టేసి పనిచేసుకుంటుంది.

మఱికొందరు గొల్లభామలేమో ఆ అల్లర్లను ఆతిథ్యమిచ్చి ఆమోదిస్తున్నారు. రోజు వచ్చి అల్లరిచేసి పాలు, పెరుగు తాగి వెళ్ళే ఆ యశోదా తనయుడు ఇవేళ రాడేంటా అని ఒకరినొకరు విచారించుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పాలకడవనెత్తి వాడు కిందా మీదా కార్చుకుంటూ పాలు తాగే వైనం చూడ ముచ్చటగా ఉంటుంది వారికి. నల్లటి ఒంటి మీద తెల్లటి పాల చారలు! దానికితోడు వాడి నోట్లోనుంచి కారే చొంగ యొక్క జిడ్డు. భలే ముచ్చటగా ఉంటాడు. ఎక్కడున్నా వాణ్ణి పట్టుకురావలని వెతుకుతున్నారు.

వామన రూపంలో ఉన్నా, విశ్వరూపంలో ఉన్నా, బుల్లి కృష్ణుడి రూపంలో ఉన్నా ‘విష్ణు’ బలము తగ్గదుకదా? ఆ కట్లు తెంచుకుని మళ్ళీ తన అల్లరి చిల్లరి పనులు మొదలుపెడతాడు చిన్ని బాలుడు. అక్కడ ఓ గోకుల వనిత నెయ్యి చేసేందుకు వెన్నదీసి పెనంలో పోసింది. వెన్నకనబడగానే ఈ కృష్ణుడి కళ్ళు పెద్దవయ్యాయి; వివేకాన్ని గాలికొదిలేశాడు. వెళ్ళి  చేయిపెట్టేశాడు! వేడికి వేళ్ళు చురుక్కు మన్నాయి. పిల్లవాడు కాస్త దూరంగా వెళ్ళి నిల్చుని ఏడ్వడం మొదలుపెట్టాడు. బుగ్గలమీద కన్నీటి ధారలు. ఏడుపువిని అక్కడికొచ్చిన  గోకులపు నారీజనం విలపించే బాలుడిని సమీపించి “ఏమైంది, కన్నయ్యా?” అంటే; ఏమి ఎఱుగని అమాయకుడిలా, ఒక్క క్షణం ఏడుపాపి “చీమకుట్టింది” అని ఇంకా కాస్త ఎక్కువ శ్రుతిలో విలపించడం మొదలుపెట్టాడు. గోకుల వనితలకు కృష్ణుడి కపటం అర్థం అయిపోయింది. “ఓరి, దొంగ కృష్ణుడా!” అని ఓదార్చడం మొదలుపెట్టారు.
చిన్ని కృష్ణుడి అల్లర్లను గొల్లెతలు ఎలా వివరిస్తున్నారో అన్నమయ్య మాటల్లోనే వినేయండి.
================================
రాగం : దేవగాంధారి
శ్రీమతి చిత్ర గారి గళంలో
('చందమామకథ' సినిమాకోసం డా. రాజ్శేఖర్ శర్మ గారు స్వరపరిచినది)
 
BKP (గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్) గారి గళంలో
================================

పల్లవి

ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు - వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలువోయరే


చరణం 1
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమపూవుకడియాల చేయిపెట్టి
చీమగుట్టెనని తనచెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయేవాని వెడ్డు వెట్టరే


చరణం 2

ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి
తచ్చెడి పెరుగులోన తగ బెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరునెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే
 

 చరణం 3
ఎప్పుడు వచ్చెనో మాయిల్లుచొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండబట్టి వాని తలకెత్తరే!

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఇట్టి = ఇటువంటి
ముద్దులాడి = యశోద ("మొద్దొచ్చే యశోదమ్మ" అన్న అర్థంలో)
బాలుడేడ = (ఆ యశోద యొక్క) బాలుడెక్కడ
వాని = వాడిని
బట్టి = పట్టి
తెచ్చి = తీసుకొచ్చి
బాలువోయరే = పాలుతాగించండి

గామిడి = కఠినమైన, బలమైన, క్రూరమైన, Cruel

(గామిడై = గొప్పవాడులాగ, పెద్దవాడులాగ)
పారి = బారి = గొలుసు, Chain 
(పారి = పాలకుండ)
కాగెడి వెన్నలలోన = కాగుతున్న వెన్నల్లో
చేమపూవు = చేమంతి పువ్వులాంటి
కడియాలు = Anklet, కడియము
చీమగుట్టెనని = చీమ కుట్టిందని
తనచెక్కిట = తన బుగ్గపీన
గన్నీరు = కన్నీరు
వేమరు = వేమారు = మాటిమాటికి
వాపోవు = విలపించు, ఏడ్చే
వెడ్డు = కపటము, నటన
వెట్టరే = కనుగొనరే

ముచ్చువలే = దొంగలా (దొంగమొఖం)
ముంగమురువుల చేయి = కడియాలు తొడిగిన చేయి (ముంగమురువు = కడియము)
జొల్లుగార = చొంగ కారుతూ
వొచ్చెలి = అయ్యో అని
వాపోవువాని  = ఏడ్చే వాడిని
నూరడించరే = ఓదార్చరే

తాత్పర్యం :
ముద్దొచ్చే ఆ యశోద ఇంటి చిన్నబ్బాయి, బుల్లి క్రిష్ణుడు ఎక్కడున్నాడో వెతకండి. వాడికి పాలు, పెరుగు, వెన్నలంటే మహా ఇష్టం. వాడిని పట్టుకొచ్చి పొట్టనిండా పాలుపొయ్యండి అంటున్నారు గొల్లెతలు.

యశోద కఠినమైన గొలుసుతో సంకెల వేసి చెట్టుకి కట్టేసింది. సంకెల వాడికోలెక్కా? తెంచేశాడు! అల్లర్లపథంలో పడ్డాడు! అక్కడ ఓ వనిత నెయ్యికోసం వెన్నదీసి పెనములోపోసి లోపలికెళ్ళింది ఈ లోపల వెన్నచూసిన కృష్ణుడి మనసాగక కాగుతున్న వెన్నలో బంగారు కడియము తొడిగిన, చేమంతిపూవులాంటి తన చేతిని పెట్టాడు. చురుక్కుమని కాలాయి వేళ్ళు. బాలుడు ఓర్చుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. చుట్టూపక్కనున్న అమ్మలక్కలు వీడిచుట్టు చేరి అడిగితే “చీమకుట్టింది, చీమకుట్టేసింది...” ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. బుగ్గలమీద కన్నీటి చుక్కలు దొర్లుతున్నాయి. చూస్తున్న అమ్మలక్కలు గ్రహించారు వాడి కపటివేషాలను.

మరో సందర్భాన, ఈ చిన్ని కృష్ణుడు ఏమి చేశాడో తెలుసా?

దొంగలా వచ్చి నవరత్నాల కడియాలుతొడిగిన చేతులు తెచ్చి అమ్మేందుకు తీసిపెట్టిన గడ్డపెరుగుకడవలో పెట్టేశాడు. ఏమన్నా అంటే ఎక్కడ నొచ్చుకుంటాడో అని వాని చేయిపట్టుకుని, “వద్దు! నీకు వేరే పెరుగు ఇస్తాను” అన్నా వినడాయె. అలా
చేయిపట్టుకుని ఆపినందుకే కెవ్వుమని నోటిలో చొంగ కార్చుతూ ‘అయ్యో! అమ్మా!” అని వాపోతున్నాడు. అందరూ వచ్చి ఓదార్చండి అంటుంది ఈ భామ.

మరోభామ ఇలా అంటుంది...
తాళంవేసిన ఇంటిలోకి ఎలావచ్చాడో, ఎప్పుడు వచ్చాడో తెలియదుగానీ, మానికాలు, ముత్యాలు మెరిసే ఉంగరాలు తొడిగిన చేతులతో పెట్టెలన్నీ తనిఖీ చేస్తున్నాడు; తినడానికి ఏమున్నాయా అని. ఆకలి మీదున్న ఆ బాలుడెవరోకాదు, తిరుమలనుంచి దిగివచ్చిన ఆ అప్పడు శ్రీవేంకటేశుడే. వదలకుండ పట్టుకోండి, హాయిగా ఆడుకుందాం వాడితో అంటున్నది ఈ భామ.
===============================
rAgaM : dEvagAndhAri
pallavi
iTTi muddulADi bAluDEDa vaaDu - vaani
baTTi tecchi poTTaniMDa baaluvOyarE

charaNaM 1
gaamiDai paariteMchi kaageDi vennelalOna
chEmapUvukaDiyaala chEyipeTTi
cheemaguTTenani tanachekkiTa ganneeru jaara
vEmaru vaapOyEvaani veDDu veTTarE

charaNaM 2
muchchuvalE vachchi tana muMgamuruvula chEyi
tachcheDi perugulOna taga beTTi
nochchenani chEyideesi nOrunella jollugaara
vochcheli vaapOvuvaani nooraDiMcharE
 
charaNaM 3
eppuDu vacchenO maayilluchocchi peTTelOni
chepparaani vuMgaraala chEyipeTTi
appaDaina vEMkaTaadri asavaalakuDu gaana
tappakunDabaTTi vaani talakettarE!
===============================

1 comment:

  1. మా కోసం ఇంత బాగా ప్రతి కీర్తనని వివరిస్తున్నందుకు బోలెడు ధన్యవాదాలు..:)

    ReplyDelete