06 May 2011

అన్నిటా చక్కనిదానవు...

తరతరాలుగా స్త్రీలను గౌరవించిన జాతి మనది. వివేకముగల ప్రతి భర్తా భార్య మాటలకు విలువిస్తాడు! అన్నివిషయములోనూ భార్య సలహాలు తీసుకుంటాడు. ఆమె చెప్పినమాటలు వింటాడు. చాలామటుకు, 'విజయము సాధించిన ప్రతి మగవాడి వెనుకా ఒక ఆడది ఉంటుంది ' అంటారు. ఇది మనుషులకే కాదు; దేవుళ్ళకుకూడా వర్తిస్తుంది. చెప్పాలంటే దేవుళ్ళలో ఇలాంటీ ఆనవాయితీ ఉందికాబట్టే మనుషుల్లోకూడా పారంపర్యంగా కొసాగుతోంది ఆ legacy.
 
ఆడవాళ్ళకు ఉన్నంత సున్నితత్వము మగవారికి ఉండదు. కష్టాలకు ఆడవాళ్ళు కరిగి కన్నీళ్ళు కార్చినట్టు మగవారు కరిగిపోరు.  అది manufacturing defect. అందుకే భిక్షమెత్తేవాడుకూడా "అమ్మా ఆకలీ", "తల్లీ అన్నంపెట్టు" అంటాడు.

అమ్మ Home-Minister! పైకికనబడకపోయినా home minister కి పవరెక్కువ. Home-ministry ఎలా dictate చేస్తే అలా నడవాల్సిందే ప్రభుత్వం బాధ్యత. అమ్మెలా చెప్తే నాన్న అలా చేస్తాడు. అమ్మే రిమోట్ కంట్రోల్!

పిల్లల మనసు అమ్మకు అర్థమైనట్టు నాన్నకి అర్థం కాదు. అలమేలుమంగ అమ్మ, శ్రీవెంకటేశుడు నాన్న, అన్నమయ్య పిల్లవాడు. అందుకే అమ్మతో చెప్పి recommend చెయ్యమంటున్నాడు అన్నమాచార్య.



==========================================

రాగం :  సాళంగనాట
కౌశల్య గారి గళంలో AUDIO ఇక్కడ వినండి
==========================================



            పల్లవి
            ఆతడు నీవాడినట్టె అన్నిపనులును జేసు
            శ్రీ తరుణివి మమ్ము రక్షించవమ్మ


            చరణం 1
            యేలవమ్మ మమ్మును యెక్కితివి పతి వురము
            నీలీల లేమి సేసినా నీకుజెల్లును
            బాలకి వన్నిటా నీవు పనిగొంటి వాతనిని
            కీలు నీచే నున్నది రక్షించవమ్మా

            చరణం  2

            మన్నించవమ్మ మమ్ము మగడు నీచేతివాడు
            సన్నల నీచేతలెల్లా సాగి వచ్చీని
            అన్నిటా జక్కనిదాన వటమీదట దొరవు
            యెన్నిక కెక్కె నీబ్రదు కిక గావవమ్మా

            చరణం  3

            యీడేరించవమ్మ మమ్ము నిట్టె యలమేల్మంగవు
            గూడితి శ్రీ వేంకటేశు గోరినట్టెల్లా
            యీడులేనిదానవు నే మూడిగాలవార మిదె
            వేడుక లెల్లా నీ సొమ్మే వెలయించవమ్మా
 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఆతడు = ఆయన
నీవాడినట్టే = నువ్వు ఎలా అంటే అలా
జేసు = చేసెదడు
శ్రీ తరుణివి = శ్రీయొక్క ఇల్లాలు

ఉరము = రొమ్ముస్థలము
బాలకి = యువతి, బాలిక
 పనిగొంటివి = ఆజ్ఞాపించేంత చనువు పొందావు
కీలు = సూత్రము; ఉపాయము; controlling power

మన్నించు = క్షమించు; కడతేర్చు
సన్నల = సైగలతో; కనుల భాషలతో
జక్కనిదాన = చక్కనిదానివి
వటమీదట = మర్రాకుపైన
దొరవు = రాణివి / (మర్రాకుమీద పవలించిన దొరయొక్క భార్యవు)
ఎన్నికకెక్కె = ప్రార్థన/స్తుతి పాటకెక్కే
గావవమ్మ = ఉత్తేజపరచవమ్మ

యీడేరించవమ్మ = ఈడేర్చవమ్మ
గోరినట్టేల్లా = కోరినట్టెల్లా
ఊడిగాలవారము = సేవలుచేసేవారము,
వెలయించవమ్మా = ప్రకాశించవమ్మా

తాత్పర్యం : 
అమ్మా శ్రీదేవీ, మీవారు జగత్గురువేకావచ్చు. లోకాలనంతా పాలించేవాడైయుండచ్చు. ఆయనను పాలించేది నువ్వే కదా? నువ్వెలా చెప్తే అలా చేస్తాడు శ్రీమన్నారాయణడు. మమ్ములను రక్షించమని చెప్పవమ్మా ఆయనకు.

(ఆయనకే direct గా చెప్పక నీకెందుకు మొరపెట్టుకుంటున్నాము? నువ్వు చెప్తే ఆయన ఎండుకు జవదాటడు? నీ గొప్పతనాలేమిటో తెలుసా? అని అమ్మవారి గొప్పతనమేంటే అమ్మవారికే గుర్తుచేస్తున్నాడు అన్నమయ్య)

ఆయన గుండెలమీదచేరి ఆయన మనసుని పాలించే అంతటి చనవు ఉంది నీకు. ఆ చనువు ఉందికాబట్టి నీదే పైచెయ్యి. ఆయన మానసాన్ని పాలించటమే కాదు, ఒక కంట మా క్షేమాన్ని కూడా చూసుకో. నువ్వేం చేసినా ఆయన  పల్లంత మాటైనా అనడు. చిరునవ్వులు ఒలకబోస్తూ అలా నీకేసి చూస్తూ ఉంటాడు. అన్నీ చెల్లుతాయి నీకు. నువ్వు చూసేందుకు అణ్యము పుణ్యము తెలియని బాలికలా ఉన్నా, ఆయనని ఆడించే ఉపాయము నీదగ్గరే ఉందిగనుక మమ్ములను రక్షించమని ఆయనకు ఆనతిస్తూ ఉండు.

మొగుణ్ణి ఎంతలా నీ చేతి గుప్పెట్లో ఉంచుకున్నావంటే కనుసైగలతోనే అన్నిపనులనూ సాధించుకోగలవు! మమ్ములను మన్నించమని నోరుతెరచి చెప్పనక్కఱ్లేదు. కనుసైగతో చెప్పు అది చాలు మాకు! మా చక్కని తల్లివి చేస్తావు కదూ? మార్రాకుమీద తేలిన ఆ బుజ్జి దొరని గెలిచిన రాణివి గనుకే భక్తులు నిన్నుకూడా స్తుతిస్తారు!

 శ్రీవెంకటేశుని అంతరాత్మనెఱిగి, ఆయన మనసుకనుగుణంగా నడుచుకునే గొప్పతనంగల తల్లీ, మేమందరం నీకు ఊడిగాలు చేసెదము మమ్ములను ఈడేర్చు! నీకెవరూసాటిలేరు; మేము చేసే జాతరలూ, వేడుకలూ నీకొరకే! నీకంటిచూపుకాంతిని మాపై చిందించవమ్మా!




====================================

rAgaM : sALaMganATa

pallavi
AtaDu neevADinaTTe annipanulunu jEsu
Sree taruNivi mammu rakshiMchavamma

charaNaM 1
yElavamma mammunu yekkitivi pati vuramu
neeleela lEmi sEsinA neekujellunu
bAlaki vanniTA neevu panigoMTi vAtanini
keelu neechE nunnadi rakshiMchavammA

charaNaM 2
manniMchavamma mammu magaDu neechEtivADu
sannala neechEtalellA sAgi vaccheeni
anniTA jakkanidAna vaTameedaTa doravu
yennika kekke neebradu kika gAvavammA

charaNaM 3
yeeDEriMchavamma mammu niTTe yalamElmaMgavu
gUDiti Sree vEMkaTESu gOrinaTTellA
yeeDulEnidAnavu nE mUDigAlavAra mide
vEDuka lellA nee sommE velayiMchavammA
===================================

6 comments:

  1. చాలా బాగుంది.. నడి రేయి ఏ జామునో.. స్వామీ నిన్ను చేర దిగి వచ్చునో.. గుర్తుకు వచ్చింది.బిడ్డలకి ఏమి కావాలో.. అడిగి ఇప్పించేది " అమ్మే" కదా!!ధన్యవాదములు

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు, వనజవనమాలి గారు :-)

    ReplyDelete
  3. "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అని రామదాసులవారు కూడా అమ్మ ద్వారానే మొర పెట్టుకున్నారు.

    ReplyDelete
  4. soooper .. :)...ఎంత బాగా వివరించారో..:)

    ReplyDelete
  5. చాలా బావుంది. అమ్మవారి ద్వారా అయ్యవారికి విన్నపాలు విన్నవించుకోవడం మన భక్తి పాటల్లో సాధారణమే. అలమేల్మంగ అయ్యవారి హృదయాన్ని కట్టేసుకుని ఉన్నది అనే భావన అన్నమయ్య పదాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని కొన్ని పాటల్లో ఆ వర్ణన మరీ సొగసుగా ఉంటుంది.

    ReplyDelete
  6. @అచంగ : Thanks for reading, అండి :-)
    రామదాసు కీర్తనని కూడా ఇక్కడ mention చేద్దాం అనుకున్న - అందరికీ తెలిసినదే కదా అని చెప్పలేదు.

    @kiran : Thanks.

    @కొత్త పాళీ గారూ, థేంక్స్ అండి. అమ్మవారి ద్వారా విన్నపాలు విన్నవించే కీర్తనలు ఇంకా ఎన్నో ఉన్నాయ్! త్వరలో మరికొన్నిట్ని ఇక్కడ వివరిస్తాను.

    ReplyDelete