08 December 2010

సరవిమాలినవాడూ ఘనుడే..

ఒక కులంవారు తక్కువ అని, మరో కులంవారు ఎక్కువ అని లేదు. కులం ఏదైనా, వ్యక్తిగత ప్రవర్తనలనుబట్టి వారి గొప్పతనము కొలువబడుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది.
 కులవ్యవస్తను మనుషులు కొన్ని సౌకర్యాలకోసం ఏర్పాటు చేసుకున్నారు. చేసే వృత్తినిబట్టి కుటుంబానికి, ఆ కుటుంబీకులకీ  పేరు పెట్టారు. ఆ రోజుల్లో అది అవసరంకూడానూ.

ఎందుకవసరం? ఉదాహరణకు, ఓ వ్యవసాయ కుటుంబంలోని యువకుడికి మరో వ్యవసాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయితో పెళ్ళిచేసినట్టయితే, ఆ అమ్మాయికి పూర్వమే వ్యవసాయం మీద అవగాహన ఉందిగనుక ఆ కుటుంబీకులతో కలిసి పనులు చేయగలదు. ఎందుకంటే వ్యవసాం అనేది కుటుంబమంతా కలిసి చేసే వృత్తి. అలాగాక, అగ్రహారంలో పెరిగిన ఓ అమ్మాయి ఓ కుమ్మరి యువకుణ్ణి పెళ్ళిచేసుకుంటే, ఉదయంలేవగానే ఈ అమ్మాయి ఏ గాయత్రి మంత్రమో పఠిస్తూ కూర్చుంటుంది, తనేమో కొలిమికెళ్ళాలి. ఇద్దరు కలిసి ఎలా పనులు చేసుకోగలరు? అందుకోసం, చేసె వృత్తిని ఆధారంగా తీసుకుని పెళ్ళిళ్ళు చేయటం‌ అనే ఆచారం మొదలైంది. అదే నానాటికి కులవ్యవస్థకు మూలమైంది.

ఇంకో 20-30 ఏళ్ళ తరువాయి, సాఫ్ట్వేర్లు, డక్టర్లు, వ్యవసాయిలు, ఏజెంట్లు, కన్సల్టంట్లు, బిల్డర్లు, అని ఇంకో కొత్త కుల వ్యవస్థ  ప్రారంభం కావచ్చేమో. ఆ పైన కొన్నాళ్ళకు ఓ కులం వారు ఎక్కువ మరో కులం వారు తక్కువ అని విభేదాలు వారి వారి ఆర్ధిక స్తోమతని బట్టి ఏర్పడుతాయి.

యుగమేదైనా, కాలం ఏదైనా ఇలాంటి కుల వ్యవస్థలు ఉన్నాయి. వాటికి ఎదురు తిరిగి కులవ్యవస్థమీద కత్తి విసిరిన మేధావులూ, వివేకవంతులూ అన్ని కాలాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారని మనకు చరిత్రలు చెప్తూనే ఉన్నాయి.

అన్నమాచార్య వారు ఎన్నో కీర్తనలలో ఈ కులభేదాలను నిందించారు. కొన్ని కీర్తనలలో మహా ఆక్రోశముతో కులంపేరిట జరిగే అట్టహాసాలను ఖండించారు.  ఈ సంకీర్తన కుడా అటువంటిదే. పరమాత్ముడూ, పరమాత్మబోధా కులాలకూ, మతాలకూ, చేసే వృత్తికీ అతీతం అంటున్నారు. మానవుడికి ఘనత పుట్టిన కులంవలన రాదు, విష్ణుతత్వమెరుగడం వలన వస్తుంది అంటారీకీర్తనలో అన్నమయ్య.

-----------------------------------------------------------------------------
రాగం : సామంతం
AUDIO శొభారాజు గళంలో
 
AUDIO నిత్యసంతోషిని గళంలో

-----------------------------------------------------------------------------

పల్లవి
ఎక్కువకులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు

చరణం 1
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
ఆదరించలేని సోమయాజికంటె
ఏదియునులేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు

చరణం 2
పరమమగు వేదాంత పఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవిమాలిన అంత్యజాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకునాతడే ఘనుడు

చరణం 3
వినియు చదివియును శ్రీవిభుని దాసుడుగాక
తనువు వేపుచునుండు తపసికంటె
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్నము
అనుభవించిన ఆతడప్పుడే ఘనుడు


ప్రతిపదార్థం /  Meaning :

నిక్కము =  సత్యము / పరమాత్మ తత్వము
ఘనుడు = గొప్పవాడు, పుణ్యపురుషుడు
విముఖుడు =పరాఙ్ముఖుడు, నిర్లిప్తుడు, one who behaves indifferently
సోమయాజి = శాస్త్రములలోను యజ్ఞములలోను ఆరితీరినవాడు
పరమము = ప్రధానము
పఠనము = చదువు
సరవి = క్రమం
మాలిన = చెడిన, నశించిన

తాత్పర్యం :

అవివేకులు ఏర్పరిచిన ఈ కుల వ్యవస్థలో అగ్రకులంలో పుట్టడంవలనో, తక్కువకులంలో పుట్టడంవలనో గొప్పబుద్ధులూ, ఘనతా రాదు. సత్యమేదో తెలిసి ఆ పరమాత్మను చేవించే వారే పుణ్యపురుషులు కాగలరు.

పౌరోహిత్యం చేసే కుటుంబంలో పుట్టడంవలన వేదాలు చదివి, మంత్రాలు నేర్చుకుని హరిభక్తి ఇంతయూలేక వృత్తిరిత్యా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికంటే, ఏటువంటి వేదాలు మంత్రాలు చదివే అవకాశంలేని తక్కువ కులస్తుల ఇంటిలో పుట్టి హరిపాదము సేవించే సామాన్యుడే గొప్పవాడు.

పరమాత్మ తత్వమంతా నిండియున్న వేదాంతాన్ని నిత్యమూ పారాయణం చేసే అవకాశం దొరికి భక్తి కించిత్తూ లేని సన్యాసికంటే, తనకప్పగించిన పనులను శ్రద్ధగా చేసుకుంటూ ఎప్పుడో దొరికిన కొద్దిపాటి సమయాన ఆ విష్ణుమూర్తిమీద మనసుపెట్టే అంత్యజాతి కులజుడే గొప్పవాడు.

హరికథలు వినీ, హరితత్వము చదివీ హరిశరణాలు చేరి దాస్యము చేయలేని తనువుశ్రమించు తపసికంటే, పరిపూర్ణమైన భక్తితో వేంకటేశుని శరణుకోరి ఆయన కరుణాకాటాక్షానికి నోచుకున్నవాడే గొప్పవాడు.

========================
నా విశ్లేషణ :

ఆదినుండి ఎందరో మహానుభావులు దేవుని ముందు అన్ని మతాలవారూ, కులాలవారూ  సమానము అంటూనే ఉన్నారు. అయినప్పటికీ, అవివేకమే తమ పథమని ఎంచుకున్న కొందరు ఆలయ నిర్వాహకులకీ, పూజారులకి ఈ విషయం అర్థం కాలేదనుకుంటాను. కొన్ని దశాబ్ధాల క్రితం  శ్రీరంగం గుడిలో కూడా కొన్ని కులాలవారికి ప్రవేశం ఉండేదికాదు. ఈ విషయాన్ని ఎదిరిస్తే ఎక్కడ తనని గర్భగుడినుంచి బయటకు గెంటేస్తారేమోనని రంగనాథస్వామి నిద్రపోతున్నట్టు నటించి లోలోపల క్రుంగిపోయాడట. మొన్నో రోజు చెప్పాడు నా కలలో.

ఎన్నోవేల పాటలను తన గళంద్వారా పలికించి ఆ చిలిపి కృష్ణుని మురిపిస్తున్న కే. జే. ఏసుదాస్‌ వారి చిరకాలపు కోరిక గురువాయూర్ గుడిలో ఉన్న ఆ కన్నయ్యను తనివితీరా దర్శించాలనేది. అయితే ఈయన క్రిస్తువుడు అనే నెపంతో ఆలయ ప్రవేశానికి అంగీకరించడంలేదు ఆలయ నిర్వాహకులు. ఆ ఆలయ నిర్వాహులకు తెలియదు పాపం తము పాటిస్తున్నది హైందవత్వం కాదు
మూర్ఖత్వమని. మరో నిజుంకూడా వారికి తెలియదు "ఆ గుడిలో ఉన్నది రాతి శిల మాత్రమే,  భక్తి శ్రద్దతో పాటల పాడుతుండగా ఏసుదాస్ దగ్గరకు చేరి ఆ శ్రీకృష్ణుడు చిన్నబాలుడీలా క్రిస్తువుడైన ఏసుదాసువారికి సేవలు చేస్తాడని".

నాలుగేళ్ళ క్రితం కేరళలోని రాజరాజేశ్వవరుడు గుడికి నిజమైనభక్తితో స్వామి దర్శనానికి నటి మీరా జాస్మిన్ వెళ్ళొచ్చింది.  క్రిస్తువుల వనిత ప్రవేశించటంవల్ల గుడి అపవిత్రం అయ్యిందనీ, వెంటనే పరిహారపూజలు చెయ్యాలనీ మీరా జాస్మిన్ మీద కేసుపెట్టి పరహార పూజకు ఖర్చుకయ్యే డబ్బులు లాగ్కున్నారు ఆ గుడి నిర్వాహకులు. ఆ పరిహార పూజలూ అయ్యాక, "అమ్మాయ్యా ఒక పెద్ద గండం తప్పింది! లేకుంటే ఆ పరమ శివుడు ఈ పాటికి హైందవ మతం వదిలి క్రిస్తుమతానికి Convert అయిపోయుండేవాడు. అంత పెద్ద విపత్తునుండి శివుణ్ణీ రక్షించాము" అని కాలర్లు ఎగరేసుకున్నారు కొన్ని హైందవ సమస్థలవారు.

ఓ పార్థసారథీ, మరో సారి నీ నందకాన్ని ఈ భూలోకంలో పుట్టించు. ఆ కారణ జన్ముడి చేతికి గేయాలూరాసే కలం ఇవ్వకు; నీ పేరు చెప్పుకుని మూర్ఖత్వాన్ని పోషించేవారిని ఖండించుటకు ఖద్గమివ్వు!


========================

rAgaM : saamantaM

pallavi
ekkuvakulajuDaina heenakulajuDaina
nikkamerigina mahaanityuDE ghanuDu

charaNaM 1
vEdamulu chadiviyunu vimukhuDai haribhakti
aadariMchalEni sOmayaajikanTe
EdiyunulEni kulaheenuDainanu viShNu
paadamulu sEviMchu bhaktuDE ghanuDu

charaNaM 2
paramamagu vEdaanta paThana dorikiyu sadaa
haribhaktilEni sanyaasikanTe
saravimaalina antyajaati kulajuDaina
narasi viShNuni vedakunaataDE ghanuDu

charaNaM 3
viniyu chadiviyunu Sreevibhuni daasuDugaaka
tanuvu vEpuchunuMDu tapasikaMTe
enalEni tiruvEnkaTESu prasaadaannamu
anubhaviMchina aataDappuDE ghanuDu 
================================================

AUDIO COURTESY : SRAVAN DEEPALA

================================================

4 comments:

 1. భాస్కర్ గారు, చక్కగా విశ్లేషించి చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు ఈ కులజాడ్యం మనల్ని వదలదు. ప్రవాసం లో ఉన్నా కూడ కులం పేర సాంస్కృతిక సంఘాలు, కుల ప్రాతిపదిక మీద స్నేహ బృందాలు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. రాజకీయాలలో కుల వర్గాలు తమ తమ కులాలకు మంత్రి వర్గం లో ప్రాతినిధ్యం ఇవ్వలేదని నిలదీస్తున్నాయి. ఈ కులము వలన వ్యాకులమే గాని మనసుకి శాంతి కలుగదు. విజ్ఞానానికి, వివేకానికి విలువ లేదు. తన కులం వాడైతే ఏం కూసినా చెల్లుతుంది. -సూర్య నారాయణ వులిమిరి

  ReplyDelete
 2. nijame sUryanaaraayaNagaru..marani vatini pattukuni badhapade kante manaceta ceyagaliginadi ceste baguntundi kada...
  annamayya sahityam loni bhavam kastainaa ardham cesukuni pravartiste calu gadaa..

  BALANTRAPU VENKATA SESHA RAMAKUMARI.

  ReplyDelete
 3. about jesudas..
  my kerala friend commented:
  the same jesudas songs were playing in the same temple...hearing the voice of Jesudas(his songs on guruvayur) was no problem in the temple....but the same person who sung the songs is not eligible to perform darshan!!!!
  bhakti... yelaa vastundandi manaki ... mana hinduvulaki??? okka saari aa jesudas paadina aiyyappa paatani vinandi... devude pulakistaadu...

  ReplyDelete
 4. Anonymous - meeru cheppinadi 100 ki 100 paaLLu satyaM.

  "jesudas paadina aiyyappa paatani vinandi... devude pulakistaadu..."

  What a great bhakti he has for Hindu gods!

  ReplyDelete