16 March 2011

పెదవియానినదాకా నిదే నోరూరే...

భగ్న హృదయంతో పతి రాసిన లేఖను చదివిన శ్రీదేవికి మనసాగక వైకుంఠానికి తిరిగొచ్చినది. వైకుంఠానికి తిరిగివచ్చింది కానీ హరి వద్దకు వెళ్ళలేదు; తన అంతఃపురంలోనే ఆగిపోయింది. చెలికత్తెను పిలిచి, "నాయంతట నేను తిరిగి రాలేదు. ఇక తనకి వెరే గత్యంతరంలేదు అని ఆయనగారు బ్రతిమాలుకుంటే తిరిగివచ్చాను. తిరిగివచ్చినంత మాత్రాన నేనేం తక్కువకాదు. అంతటి మనిషి దాసోహం అంటున్నాడు, పాపం పోనీలే అని వచ్చాను" అని ఆవేశం చూపింది. విన్న చెలికత్తె ముసిముసిగా నవ్వుకుంది, చెలికత్తె నవ్వుని గమనించిన అంబూజాక్షి కన్నెఱ్ఱజేసి, "నేను వచ్చి ఎంత సమయం అయ్యింది? ఇంకా నన్నొచ్చి పలకరించలేదు ఆ మహానుభావుడు! ఏమనుకుంటున్నాడసలు? నేనొచ్చాను తక్షణమే రమ్మని చెప్పు" అని చెలికత్తె ముందు అలకనటిస్తూ, బెట్టు చేస్తూ,  కోపం చూపింది మాటల్లో. (ఎంతైనా చంద్రుడి తోబుట్టువుకదా? చంద్రుడేమో తనదికాని వెలుగుని  తనలోనే ఉన్నట్టు చూపుతాడు. ఈ సోదరేమో లేని కోపాన్ని ఉన్నట్టు చూపుతుంది!)

చెలికత్తె వెళ్ళిపోయింది.

"అయ్యో! మతిపోయినట్టుంది నాకు! ఆయనగారిని గట్టిగా గద్దించటం ఏంటి? ఎంత వినయంగా లేఖ రాశారాయన? నాకేమన్నా పిచ్చా? అసలే ఆ మనిషి నా వియోగంతో మథనపడుతుంటే నా ఆక్రోశపు మాటలు ఆ బాధలో ఆజ్యంపోసినట్టుకావూ? నాకు ఎంత పొగరసులు?"  అని పశ్చాత్తాపడింది. వడివడిగా లేచి వెలుపటికొచ్చి వెళ్ళిపోతున్న చెలికత్తెను కేకవేసి వెనక్కి రమ్మంది.

వచ్చిన చెలికత్తెతో "నేను కోపంగా అన్న మాటలేమి ఆయనతో అనకు" అంది.

"మరేం చెప్పమంటారమ్మా?" చెలికత్తె  నాకు తెలియదా మీ సంగతి అన్నట్టు అడిగింది.

లక్ష్మీదేవి వినయంగా ఇలా సందేశం పంపుతూంది...
చెలియా, ఆ  రమణుని నా వద్దకు రమ్మని చెప్పు. నేనుకూడా వియోగంతో క్షోభిస్తున్నాని చెప్పు. ఇక పై ఎటువంటి ఎడబాట్లూ వద్దు. వెంటనే వచ్చి తన ప్రేమనిండిన మాటలతో నా కలతను పోగట్టమను!

ఎందుకట ఈ ఎడబాటు? త్వరగా రమ్మను. ఆయన అక్కునచేరి కళ్ళలోకి కళ్ళుపెట్టి చూసి, నా ప్రేమనంతా ఒలుకబోసేవరకు నా బెంగ తీరదని చెప్పు. కొంటే వయసుపిల్లలాగా నా అలకల్నీ, ఆశల్నీ, ముఖ్యంగా పిచ్చితనాన్ని, నా మొండితనంవల్ల అనుభవించిన వేదననీ ఆయన కౌగిటవాలి తెలియజేస్తేకానీ తీరదు నా వ్యధ అని చెప్పు.

ఇంకా మా మధ్య ఈ దూరాలూ, పంతాల తెరలూ వద్దన్నానని చెప్పు. మా ఇద్దరి చెమటలు ఏరైసాగి అలసిపోయేవరకు సరసాలాడాలనుందని చెప్పు. ఇన్ని రోజుల వియోగం భారం తీరిపోయేలా ఎదపైవాల్చుకుని లాలించాలనుందని చెప్పు.

పురుషోత్తముని బిగికౌగిట నలిగితేనేగానీ అదిరే చన్నుల వణుకుతీరదేమో! పెదవితేనెలు పంచుకోవాలని ఉవ్విళ్ళురుతున్నాననికూడా తెలియజేయి. నా శ్రేయస్సుకోరే  శ్రీవేంకటేశుడికి నా సమ్మతమూ పిలుపూ ఎందుకు? రమ్మని చెప్పవే చెలియా! నన్నుచేరుకోమను తక్షణమే వచ్చి!


=============================================
రాగం :: దేశాక్షి
అన్నమాచార్య ఈ కీర్తనని ఎంత తీపి తేనె మాటలతో రాశారో అంతే తీయగా చెవిలో పోస్తున్నారు ఈ గాయని!
 (గుంటి నాగేశ్వరనాయుడు గారు అద్భుతంగా స్వరపరిచారు. పాడినవారు ఆయన పుత్రిక కుమారి బినతి గారు)
=============================================



పల్లవి
రమ్మనవే చెలియా రమణుని నీడకు
యిమ్మనవే చనవులు యెలయింపు లేటికే
చరణం 1
కన్నుల జూచినదాకా కడలేదు తమకము
సన్నల మొక్కినదాకా చల్లీ గూరిమి
మన్నన లడుగుదాకా మలసీ గోరికలు
యెన్నిలేవు యెడమాట లింకానేటికే

చరణం 2
సరసమాడినదాకా జడివట్టీ జెమటలు
వరసకు వచ్చుదాకా వంచీ జలము
గరిమ పైకొన్నదాకా గమ్మీ నడియాసలు
ఇరవై నడుమ దెర యికనేటికే


చరణం 3
కదిపి కూడినదాకా కడు జన్ను లదరీని
పెదవి యానినదాకా నిదే నోరూరీ
అదన శ్రీవేంకటేశు డంతలోనె నన్ను గూడె
యెదుటనే వోడబాటు లింకానేటికే

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :

ఈడకు = ఇక్కడికి
చనవు = చెలిమి
ఎలయింపు = అనుమతి
ఏటికి =  ఎందుకు

తమకము = మోహము, విరహము
కూరిమి = చెలిమి, ఇష్టము
మన్నన = మురిపము, ప్రేమతో కూడిన సంజాయిషి
జెమటలు/చెమటలు = చెమట
వంచీ చలము = వంచించుతున్నది ఈ అహము
(జలము/చలము = పంతం, అహం, Ego)

దెర/తెర = తెర
కడు = చాలా, ఎక్కువగా
జన్ను = చన్ను
లదిరీని/అదిరీని = అదురుచున్నవి
యానిన/ఆనిన =  అతికించిన, తగిలిన
అదన = మేలైన, మేలిమి
వొడబాటు/ఒడబాటు =  సమ్మతము


=================================

rAgaM :: dESAkshi 

pallavi 
rammanavE cheliyaa ramaNuni neeDaku
yimmanavE chanavulu yelayiMpu lETikE


charanaM 1
kannula jUchinadaakaa kaDalEdu tamakamu
sannala mokkinadaakaa challee gUrimi
mannana laDugudaakaa malasee gOrikalu
yennilEvu yeDamaaTa liMkaanETikE


charanaM 2
sarasamaaDinadaakaa jaDivaTTee jemaTalu
varasaku vacchudaakaa vaMchee jalamu
garima paikonnadaakaa gammee naDiyaasalu
iravai naDuma dera yikanETikE

charanaM 3
kadipi kUDinadaakaa kaDu jannu ladareeni
pedavi yaaninadaakaa nidE nOrUree
adana SreevEnkaTESu DaMtalOne nannu gUDe
yeduTanE vODabaaTu liMkaanETikE

=================================


1 comment: