21 December 2010

పలువేడుకలతోనె పాయకుండరమ్మా

అలగడం భార్యలకు ముద్దు. అలుక తీర్చడం భర్తల వంతు.

అలకతీర్చేందుకు తనవల్ల అయినన్ని ప్రయత్నాలు చేసినా, భార్య అలుక మానలేదంటే ఆ రోజంతా వృథాయే. మనసంతా కలతల మేఘాలు తుంపర్లు చల్లుతుంటాయ్. దేని మీదా మనసు నిలువదు, ఏకాగ్రత కుదరదు. ఇద్దరూ వారి ఉద్యోగాలు సక్రమంగా చేసుకోలేరు. చిరాగ్గా, కోపంగా రోజేం బాగుంటుంది! కోపాలూ, అలుకలూ మాని మనసులు మళ్ళీ కలిసేవరకు ఇదే పరిస్థితి.

మామూలు మానవ పురుషుణ్ణి వరించిన వనిత అలగడంలో న్యాయం ఉంది. ఈ మానవ పురుషుడు ఆ అలుక తీర్చలేకపోవడంలోనూ ఓ అర్థం ఉంది. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ మాధవుణ్ణి చేపట్టిన శ్రీమహాలక్ష్మి అలగడం ఏంటీ?

మానవ ఆలు-మగల అలుకలవల్లా, గొడవలవల్లా పెద్ద నష్టం ఉండదేమో! ఆ జగన్మాత అలిగిందని ఆ లోకరక్షకుడు తనపనులు మానుకుంటే ప్రపంచం ఏం కావాలి? అని భయపడుతున్నాడు అన్నమయ్య. అందుకే శ్రీహరిని వరించిన తన చెల్లెలు అలమేలుమంగకు ఇలా హితవులు చెప్తున్నాడు అన్న(మ)య్య. "నీ పతిమీద చీటికి మాటికి అలుగకు తల్లీ, అతనూ నీయంత గొప్పవాడే! నీ పతిని ఎడబాయకు. అదే నీకూ, మాకూ, ప్రపంచానికీ శ్రేయస్కరం!"

"ఆయనేంటి అంత గొప్ప? హితవెల్లా నాకే చెప్తారేం? అతగాడికి చెప్పొచ్చుగా? నేనేం తక్కువ? నేనే ఎందుకు సర్దుకుపోవాలి? నాకు ఆయన ఎంత అవసరమో, ఆయనకూ నేను అంతే అవసరం! చెప్పండి ఆ మహాశయుడికి!" అంటుంది అలమేలుమంగ.

అందుకు అన్నమ్మయ్య "నీ గొప్పతనము మెచ్చి, నీ మేలిమి గుణములు నచ్చి, నీ సౌందర్యానికి పులకించి, నీ ప్రేమకోసం తపించి, నీ జతలో గడిపే జీవితంకోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మరిచావటమ్మా? ఆయన చేసిన తపములన్నీ నీకోసం కాదా? నిను చేరుకోవాలని ఎన్ని అవతారలెత్తాడో మరిచితివా? విను తల్లీ, నీ గొప్ప తనము నీది; ఆయన గొప్ప తనం ఆయనది! ఇద్దరి గొప్పతనాలూ సమానమే. నువ్వు తనకన్నా ఓ మెట్టు పైనుంటే చూసి ఆనందించాలని ఉంది. అదెలా వస్తుందో తెలుసా? సర్దుకుపోవాడానికి ఎవరైతే ఓ మెట్టు దిగుతారో వారి ఖాతాలో 'గొప్పతనం' మరో వంతు పెరుగుతుంది. కనుక గొప్పతనంలో నీదే పైచెయ్యి అవుతుంది! అతగారికి హితవెందుకు చెప్పం తెలుసా? అతని పెంపకం మీద మాకు అవగాహన లేదు. అతని గతం మేమెరిగినది తక్కువ. అయితే నీ గతము మేమెరుగుదుము. మా పెంపకం మీద మాకున్న విశ్వాసం ఎట్టిదంటే 'ఎటువంటి పరిస్థితులొచ్చినా దాన్ని మనోధైర్యంతో నువ్వు ఎదురుకోగలవన్న రీతిలోనేగా పెంచాం! అంతే కాదు, తల్లి-తండ్రి గొడవలుపడి ఎడముఖం-పెడముఖంగా ఉంటే పిల్లెలా బాగుంటారూ? ఈ ప్రపంచానికి తల్లి నీవు, తండ్రి అతడు! లోకకళ్యాణం మీ అన్యోన్యం!" అని అంటున్నాడు అన్నమయ్య.

ఈ కీర్తనలో విష్ణుమూర్తి ఎత్తిన పది అవతారలనూ ఎంత చక్కగా ప్రస్తావించాడో చూడండి అన్నమయ్య.


===================================================
రాగం : సారంగనాట

AUDIO కోసం

===================================================

పల్లవి
అలుగకువమ్మ నీవాతనితో ఎన్నడును
పలువేడుకలతోనె పాయకుండరమ్మా

చరణం 1
జలధి తపముసేసె, సాధించె పాతాళము
నెలత నీ రమణుడు నీకుగానె
ఇలవెల్లా హారించె నెనసె కొండగుహల
ఎలమి ఇన్నిటాను నీకితవుగానె

చరణం 2
బాలబొమ్మచారై ఉండె, పగలెల్లా సాధించె
నీలీలలు తలచి నీకుగానె
తాలిమి వ్రతము పట్టి ధర్మముతో గూడుండె
పాలించి నీవుచెప్పిన పనికిగానె

చరణం 3
ఎగ్గు సిగ్గు చూడడాయె ఎక్కెనుశిలాతలము
నిగ్గులనన్నిటా మించె నీకుగానె
అగ్గలపు శ్రీవెంగటాద్రీశుడై నిలిచె
వొగ్గి నిన్ను ఉరాన మోచి ఉండుటకుగానె


కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :
ఎన్నడును = ఎప్పటికీ
పలు = ఎన్నెన్నో, అనేకమైన
వేడుక = సంబరం, వినోదం
పాయక/బాయక = విడిపోకుండ

జలధి = సముద్రము
తపము =  తపస్సు
నెలత = వనిత, మగువ
నీకుగానె = నీకోసమేగదా
ఇలవెల్లా = భూలోకమంతా
హారించే = దాచేసే
నెనసె = ??
ఎలమి = సంతోషము, విలాసము
నీకు ఇతవుగానే = నీకు నచ్చినట్టు, ఇష్టమైనట్టు

బాల బొమ్మచారి = వామనుడు
పగలెల్లా = విరోధములు అన్నిటిని
తాలిమి = ఓర్పుతో
వ్రతము = యాగము
పాలించి = రక్షించెను

ఎగ్గు = అవమానము
సిగ్గు = బిడియము
శిలాతలము = చల్లని కొండ
నిగ్గు = నెగ్గు, గెలువు
అగ్గల = అగ్గలముగా, మొండితనంగా
వొగ్గి = పూనుకొని
ఉరానా = గుండెలపై


తాత్పర్యం :
ఆ కొండలరాయుడిని ఎన్నడూ ఎడబాయక పక్కనే ఉండి నిత్యకళ్యాణములు, పచ్చతోరణములతో వేడుకలు జరుపుకోవమ్మ, అలమేలూమంగా! అలుక శ్రుతి మించినా, కోపాలు మితిమించినా వేడుకలు కాస్త వేదనలవుతాయి.


క్షీరసాగరమథనవేళ వాసుకి పట్టునుండి జారిపోతున్న మందరగిరికింద ఊతగా నిలిచేందుకు తాబేలుగా మారలేదూ? వీపున మందరగిరి కవ్వంలా తిరుగుతు ఉంటే కాస్తయినా చలించకుండ నీటిలో కఠోర తపస్సుచేసేవాడిలా నిలిచి కష్టాలు పడినదెవరికోసమూ?(కూర్మావతారము). వేదములను సోమకాసురుడు నీటిలోపల దాచినపుడు మత్స్య అవతారమెత్తి కడలినీదినది నీకేగా? (వేదాములలో సారమే మహాలక్ష్మి). వరహావతారుడై భువిని కాపాడి ఉదయగిరి గుహలో కొలువైనదెవరికో? ఇన్ని వేదనలు కష్టాలు పడినది నీ ఎదలో చోటుకోసమేగా?

పొట్టివాడై అవతరించి మూడడుగులతో ముల్లోకాలను సంపాదించినది నీకోసమేగా?(వామనావతారము) జమదాగ్నికి రేణుకాదేవికి బ్రాహమణక్షత్రియుడై పుట్టి తనపరాక్రమాలతో పగవారిని హతమార్చలేదా? ఈ రెండు అవతారాలలోను నిన్ను తలచుకుంటూనే బ్రహ్మచర్యం చేపట్టలేదా? త్రేతా యుగములో రాక్షశులను తొలగించి ధర్మమార్గాన లోకాన్ని పరిపాలించాడు. నీ వియోగాన ఏకపత్ని వ్రతుడై నీ కనకప్రతిమతో అశ్వమేధయాగాలు చేయలేదా? అన్నీ నీకోసమే!

ఎగ్గు సిగ్గులని పక్కనబెట్టి ఎందరితో తిరిగినా, రాధకోసం శిలాతలమెక్కినా, తులాభారంలో నీ తులసిదళమేగా నెగ్గినది? అది ధ్వాపర యుగం కథ. ఇప్పుడు ఈ కలియుగాన తిరుమలగిరిమీదా నీకోసం శ్రీవేంకటేశుడై పట్టుదలతో, మొండిగా ఒంటరివాడై నిలుచున్నది ఎందుకో తెలుసా? నారసిమ్హ అవతారాన గుండెలపై నిన్ను మోచినట్లు ఇప్పుడూ నిన్ను తన గుండెలమీద నిలుపుకోవాలని వేచున్నాడు ఆ తిరుమలగిరిపై.

===================================================

rAgaM : sAraMganATa

===================================================

pallavi
alugakuvamma niivaatanitO ennaDunu
paluvEDukalatOne paayakunDarammaa

charaNaM 1
jaladhi tapamusEse, saadhimche paataaLamu
nelata nee ramaNuDu neekugaane
ilavellaa haarinche nenase koMDaguhala
elami inniTaanu neekitavugaane

charaNaM 2
baalabommachaarai unDe, pagalellaa saadhinche
neeleelalu talachi neekugaane
taalimi vratamu paTTi dharmamutO gUDuMDe
paalinchi neevucheppina panikigaane

charaNaM 3
eggu siggu chUDaDaaye ekkenuSilaatalamu
niggulananniTaa minche neekugaane
aggalapu SreeveMgaTaadreeSuDai niliche
voggi ninnu uraana mOchi unDuTakugaane
===================================================

08 December 2010

సరవిమాలినవాడూ ఘనుడే..

ఒక కులంవారు తక్కువ అని, మరో కులంవారు ఎక్కువ అని లేదు. కులం ఏదైనా, వ్యక్తిగత ప్రవర్తనలనుబట్టి వారి గొప్పతనము కొలువబడుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది.
 కులవ్యవస్తను మనుషులు కొన్ని సౌకర్యాలకోసం ఏర్పాటు చేసుకున్నారు. చేసే వృత్తినిబట్టి కుటుంబానికి, ఆ కుటుంబీకులకీ  పేరు పెట్టారు. ఆ రోజుల్లో అది అవసరంకూడానూ.

ఎందుకవసరం? ఉదాహరణకు, ఓ వ్యవసాయ కుటుంబంలోని యువకుడికి మరో వ్యవసాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయితో పెళ్ళిచేసినట్టయితే, ఆ అమ్మాయికి పూర్వమే వ్యవసాయం మీద అవగాహన ఉందిగనుక ఆ కుటుంబీకులతో కలిసి పనులు చేయగలదు. ఎందుకంటే వ్యవసాం అనేది కుటుంబమంతా కలిసి చేసే వృత్తి. అలాగాక, అగ్రహారంలో పెరిగిన ఓ అమ్మాయి ఓ కుమ్మరి యువకుణ్ణి పెళ్ళిచేసుకుంటే, ఉదయంలేవగానే ఈ అమ్మాయి ఏ గాయత్రి మంత్రమో పఠిస్తూ కూర్చుంటుంది, తనేమో కొలిమికెళ్ళాలి. ఇద్దరు కలిసి ఎలా పనులు చేసుకోగలరు? అందుకోసం, చేసె వృత్తిని ఆధారంగా తీసుకుని పెళ్ళిళ్ళు చేయటం‌ అనే ఆచారం మొదలైంది. అదే నానాటికి కులవ్యవస్థకు మూలమైంది.

ఇంకో 20-30 ఏళ్ళ తరువాయి, సాఫ్ట్వేర్లు, డక్టర్లు, వ్యవసాయిలు, ఏజెంట్లు, కన్సల్టంట్లు, బిల్డర్లు, అని ఇంకో కొత్త కుల వ్యవస్థ  ప్రారంభం కావచ్చేమో. ఆ పైన కొన్నాళ్ళకు ఓ కులం వారు ఎక్కువ మరో కులం వారు తక్కువ అని విభేదాలు వారి వారి ఆర్ధిక స్తోమతని బట్టి ఏర్పడుతాయి.

యుగమేదైనా, కాలం ఏదైనా ఇలాంటి కుల వ్యవస్థలు ఉన్నాయి. వాటికి ఎదురు తిరిగి కులవ్యవస్థమీద కత్తి విసిరిన మేధావులూ, వివేకవంతులూ అన్ని కాలాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారని మనకు చరిత్రలు చెప్తూనే ఉన్నాయి.

అన్నమాచార్య వారు ఎన్నో కీర్తనలలో ఈ కులభేదాలను నిందించారు. కొన్ని కీర్తనలలో మహా ఆక్రోశముతో కులంపేరిట జరిగే అట్టహాసాలను ఖండించారు.  ఈ సంకీర్తన కుడా అటువంటిదే. పరమాత్ముడూ, పరమాత్మబోధా కులాలకూ, మతాలకూ, చేసే వృత్తికీ అతీతం అంటున్నారు. మానవుడికి ఘనత పుట్టిన కులంవలన రాదు, విష్ణుతత్వమెరుగడం వలన వస్తుంది అంటారీకీర్తనలో అన్నమయ్య.

-----------------------------------------------------------------------------
రాగం : సామంతం
AUDIO శొభారాజు గళంలో
 
AUDIO నిత్యసంతోషిని గళంలో

-----------------------------------------------------------------------------

పల్లవి
ఎక్కువకులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు

చరణం 1
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
ఆదరించలేని సోమయాజికంటె
ఏదియునులేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు

చరణం 2
పరమమగు వేదాంత పఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవిమాలిన అంత్యజాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకునాతడే ఘనుడు

చరణం 3
వినియు చదివియును శ్రీవిభుని దాసుడుగాక
తనువు వేపుచునుండు తపసికంటె
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్నము
అనుభవించిన ఆతడప్పుడే ఘనుడు


కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :

నిక్కము =  సత్యము / పరమాత్మ తత్వము
ఘనుడు = గొప్పవాడు, పుణ్యపురుషుడు
విముఖుడు =పరాఙ్ముఖుడు, నిర్లిప్తుడు, one who behaves indifferently
సోమయాజి = శాస్త్రములలోను యజ్ఞములలోను ఆరితీరినవాడు
పరమము = ప్రధానము
పఠనము = చదువు
సరవి = క్రమం
మాలిన = చెడిన, నశించిన

తాత్పర్యం :

అవివేకులు ఏర్పరిచిన ఈ కుల వ్యవస్థలో అగ్రకులంలో పుట్టడంవలనో, తక్కువకులంలో పుట్టడంవలనో గొప్పబుద్ధులూ, ఘనతా రాదు. సత్యమేదో తెలిసి ఆ పరమాత్మను చేవించే వారే పుణ్యపురుషులు కాగలరు.

పౌరోహిత్యం చేసే కుటుంబంలో పుట్టడంవలన వేదాలు చదివి, మంత్రాలు నేర్చుకుని హరిభక్తి ఇంతయూలేక వృత్తిరిత్యా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికంటే, ఏటువంటి వేదాలు మంత్రాలు చదివే అవకాశంలేని తక్కువ కులస్తుల ఇంటిలో పుట్టి హరిపాదము సేవించే సామాన్యుడే గొప్పవాడు.

పరమాత్మ తత్వమంతా నిండియున్న వేదాంతాన్ని నిత్యమూ పారాయణం చేసే అవకాశం దొరికి భక్తి కించిత్తూ లేని సన్యాసికంటే, తనకప్పగించిన పనులను శ్రద్ధగా చేసుకుంటూ ఎప్పుడో దొరికిన కొద్దిపాటి సమయాన ఆ విష్ణుమూర్తిమీద మనసుపెట్టే అంత్యజాతి కులజుడే గొప్పవాడు.

హరికథలు వినీ, హరితత్వము చదివీ హరిశరణాలు చేరి దాస్యము చేయలేని తనువుశ్రమించు తపసికంటే, పరిపూర్ణమైన భక్తితో వేంకటేశుని శరణుకోరి ఆయన కరుణాకాటాక్షానికి నోచుకున్నవాడే గొప్పవాడు.

========================
నా విశ్లేషణ :

ఆదినుండి ఎందరో మహానుభావులు దేవుని ముందు అన్ని మతాలవారూ, కులాలవారూ  సమానము అంటూనే ఉన్నారు. అయినప్పటికీ, అవివేకమే తమ పథమని ఎంచుకున్న కొందరు ఆలయ నిర్వాహకులకీ, పూజారులకి ఈ విషయం అర్థం కాలేదనుకుంటాను. కొన్ని దశాబ్ధాల క్రితం  శ్రీరంగం గుడిలో కూడా కొన్ని కులాలవారికి ప్రవేశం ఉండేదికాదు. ఈ విషయాన్ని ఎదిరిస్తే ఎక్కడ తనని గర్భగుడినుంచి బయటకు గెంటేస్తారేమోనని రంగనాథస్వామి నిద్రపోతున్నట్టు నటించి లోలోపల క్రుంగిపోయాడట. మొన్నో రోజు చెప్పాడు నా కలలో.

ఎన్నోవేల పాటలను తన గళంద్వారా పలికించి ఆ చిలిపి కృష్ణుని మురిపిస్తున్న కే. జే. ఏసుదాస్‌ వారి చిరకాలపు కోరిక గురువాయూర్ గుడిలో ఉన్న ఆ కన్నయ్యను తనివితీరా దర్శించాలనేది. అయితే ఈయన క్రిస్తువుడు అనే నెపంతో ఆలయ ప్రవేశానికి అంగీకరించడంలేదు ఆలయ నిర్వాహకులు. ఆ ఆలయ నిర్వాహులకు తెలియదు పాపం తము పాటిస్తున్నది హైందవత్వం కాదు
మూర్ఖత్వమని. మరో నిజుంకూడా వారికి తెలియదు "ఆ గుడిలో ఉన్నది రాతి శిల మాత్రమే,  భక్తి శ్రద్దతో పాటల పాడుతుండగా ఏసుదాస్ దగ్గరకు చేరి ఆ శ్రీకృష్ణుడు చిన్నబాలుడీలా క్రిస్తువుడైన ఏసుదాసువారికి సేవలు చేస్తాడని".

నాలుగేళ్ళ క్రితం కేరళలోని రాజరాజేశ్వవరుడు గుడికి నిజమైనభక్తితో స్వామి దర్శనానికి నటి మీరా జాస్మిన్ వెళ్ళొచ్చింది.  క్రిస్తువుల వనిత ప్రవేశించటంవల్ల గుడి అపవిత్రం అయ్యిందనీ, వెంటనే పరిహారపూజలు చెయ్యాలనీ మీరా జాస్మిన్ మీద కేసుపెట్టి పరహార పూజకు ఖర్చుకయ్యే డబ్బులు లాగ్కున్నారు ఆ గుడి నిర్వాహకులు. ఆ పరిహార పూజలూ అయ్యాక, "అమ్మాయ్యా ఒక పెద్ద గండం తప్పింది! లేకుంటే ఆ పరమ శివుడు ఈ పాటికి హైందవ మతం వదిలి క్రిస్తుమతానికి Convert అయిపోయుండేవాడు. అంత పెద్ద విపత్తునుండి శివుణ్ణీ రక్షించాము" అని కాలర్లు ఎగరేసుకున్నారు కొన్ని హైందవ సమస్థలవారు.

ఓ పార్థసారథీ, మరో సారి నీ నందకాన్ని ఈ భూలోకంలో పుట్టించు. ఆ కారణ జన్ముడి చేతికి గేయాలూరాసే కలం ఇవ్వకు; నీ పేరు చెప్పుకుని మూర్ఖత్వాన్ని పోషించేవారిని ఖండించుటకు ఖద్గమివ్వు!


========================

rAgaM : saamantaM

pallavi
ekkuvakulajuDaina heenakulajuDaina
nikkamerigina mahaanityuDE ghanuDu

charaNaM 1
vEdamulu chadiviyunu vimukhuDai haribhakti
aadariMchalEni sOmayaajikanTe
EdiyunulEni kulaheenuDainanu viShNu
paadamulu sEviMchu bhaktuDE ghanuDu

charaNaM 2
paramamagu vEdaanta paThana dorikiyu sadaa
haribhaktilEni sanyaasikanTe
saravimaalina antyajaati kulajuDaina
narasi viShNuni vedakunaataDE ghanuDu

charaNaM 3
viniyu chadiviyunu Sreevibhuni daasuDugaaka
tanuvu vEpuchunuMDu tapasikaMTe
enalEni tiruvEnkaTESu prasaadaannamu
anubhaviMchina aataDappuDE ghanuDu 




================================================

AUDIO COURTESY : SRAVAN DEEPALA

================================================

21 November 2010

నీవలన కొరతేలేదు...

మనం దేవుడికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మతాలనెంచుకున్నా, దేవుడన్న నమ్మకం ఒకటే. ఏ పేరుతో పూజిస్తున్నా, ఎంత నమ్మకంతో, ఎంత చిత్తశుద్ధితో పూజిస్తామో అంత ఫలము దక్కుతుంది. కొలనులో నీటి మట్టం పైకున్నపుడు అందులో తేలుతున్న తామరపువ్వూ పైనే ఉంటుంది, నీళ్ళు తగ్గినపుడు నీటి మట్టంతోబాటు తామరపువ్వు కిందకి వెళ్ళిపోతుంది. అలానే మనసు నిర్మలంగా, నిస్వార్థ బుద్ధితో కొలిచినవారిని కరుణతో ఆదుకుంటాడు దేవుడు. కొలిచినవారి బుద్ధిని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో.


===============================================
రాగం : బౌళి 
===============================================
పల్లవి                                         
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములు ఎంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు

చరణం 1
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

చరణం 2
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనముల మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు

చరణం 3
నీవలన కొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :
అంతరాంతరములు = తారతమ్యము, తేడా
నిప్పటి = అరిసెలు, రాయలసీమలో ఇప్పటికీ నిప్పట్లు అనే అంటారు
కొలుతురు = మ్రొక్కుదురు,  సేవింతురు, ఉపాసింతురు
వైష్ణవులు = విష్ణుని పూజించువారు
కూరిమితో = ప్రేమతో, స్నేహముతోఅలరిపొగడుదురు = ఉత్సాహముగ(తాండవమాడుతూ) పొగడుదురు;
కాపాలికులు = ఉగ్రరూప శివుణ్ణి పూజించువారు, ఇప్పటికి వీరు కేరళ, తమిళనాడులో కాపాలికులుగానే గుర్తింపబడుతారు.
ఆదిభైరవుడు = ఉగ్రరూపు దాల్చిన ఈశ్వరుడు, గ్రామరక్షక దేవుడు, సుడలై మాడసామి, అయ్యనార్ సామి.
భజింతురు = సేవింతురు, మ్రొక్కుదురు
సిరులమిమ్మునే = ధన, ధాన్యాలను ఇవ్వమనే
అల్పబుద్ధి = నీచమైన బుద్ధి
గరిమ = మేలిమి; గౌరవమైన
నీరుకొలది = నీటిమట్టానికి
తామెర = పద్మము, తమ్మిపువ్వు, కమలము
ఆవల = అవతల, అటుపక్కనే
భాగీరథి = (గంగా) నది
దరి = గట్టు
బావి = నుయ్యి
చేకొని = అనుగ్రహించిన
పరతత్వము = అన్ని(దైవ) తత్వములు
 

తాత్పర్యం :
 
పిండి పరిమాణాన్నిబట్టి అరిసెయొక్క పరిమాణం. అలానే, ఎంతమాత్రం నిన్ను వేడుకుంటే అంత ఆదుకుంటావు.

వైష్ణవులు నిన్ను ముద్దుగా, ప్రేమగా విష్ణువంటారు. వేదాంతులు నువ్వే పరబ్రహ్మం అంటారు. శైవులు నిన్నే శివుడని అంటారు. కాపాలికులు తమని రక్షించే భైరవుడవు నీవని తాండవమాడుతూ పొగడుతారు.

శాక్తేయులు శక్తిరూపంగా ఎన్నుకున్నదీ నిన్నే. నానా వర్గాలవారు, నానాపేర్లతో దర్శించి పూజించేది నిన్నే. ఏ పేర్లతో నిన్ను పూజించినా, ధన ధాన్యాలూ, సిరులూ ఇవ్వమని పూజించే అల్పబుద్ధి కలిగిన వారికి అందవు నీవు. నిస్వార్థముతో, నిర్మల మనసుతో పూజించేవారిని ఘనంగా ఆదుకొనెదవు నీవు.

నీవలన కొరతేలేదు! నీటి మట్టాన్నిబట్టి తామెరపువ్వు తేలుతుంది (1). నిండుగా సాగే ఏటి పక్కన ఉన్న బావిలో నీరెలాగైతే ఇంకిపోకుండ ఊరునో(2) అలాంటిది నీ కరుణ ఓ వేంకటపతీ.  నీవే శరణు అనుకోవడమే పరతత్వము నాకు.
------------------------------------------------------------------
cf., (1)
వెళ్ళత్ తనైయ మలర్ నీట్టం మాందర్ తం
ఉళ్ళత్ తనైయదు ఉయర్వు.
-తిరువళ్ళువర్ (30 BC)
(வெள்ளத் தனைய மலர்நீட்டம் மாந்தர்தம்
உள்ளத் தனையது உயர்வு.)
అనగా, నీటిమట్టాన్ని బట్టి నీటిలోతేలే పువ్వు పెరుగుదల ఉంటుంది. అలాగే, మనుషుల ఉత్సాహాన్నీ, ప్రేరణనీబట్టి వారి ఎదుగుదల ఉంటుంది.

cf., (2)
తొట్టనైత్ తూఱుం మణఱ్ కేణి మాందర్ క్కుక్
కఱ్ఱనత్ తూఱుం అఱివు.
-తిరువళ్ళువర్ (30 BC)
(தொட்டனைத் தூறும் மணற்கேணி மாந்தர்க்குக்
கற்றனைத் தூறும் அறிவு)
ఏటిపక్కనున్న ఇసుకలో ఎంతకెంత(బావి) త్రవ్వితే అంతకంత నీరు ఊరుతుంది. అటులనే ఎంతకెంత చదువుతూ ఉంటే అంతకంత జ్ఞానం వస్తుంది.
------------------------------------------------------------------


ఈ కీర్తనకు మిత్రులు కొందరు ఇచ్చిన వివరణలు / తాత్పర్యాలు :



భాషా విశేషాలు -
సామెతలు
ఇందులో నాకు రెండు సామెతలు గోచరిస్తున్నాయి.
1. పిండి కొద్ది నిప్పట్టు - పిండి కొద్ది అత్తిరసం - పిండి కొద్ది అరిసె - పెండి కొద్ది రొట్టె , ఇది బహుశా మన పిండి కొద్ది రొట్టె సామెతకు జేజమ్మ అయ్యుంటుంది.
2. నీరు కొలది తామెరవు
ఇది కూడా మరో పురాతనమైన తెలుగు (ద్రావిడ) సామెతలాఉంది. చాలా మంచి సామెత. మనకు ఇప్పుడు నీరు పల్లమెరుగు (అర్థం వేరు) అనే సామెత వాడకంలో ఉంది కాని నీరు కొలది తామెరవు కనుమరుగైనట్టుంది.

మరొక విశేషం ఏమిటంట వేంకటేశ్వరుని ఇప్పటికీ కొందరు నిజంగానే శివునిగా, శక్తిగా, మురుగన్ గా, బుద్దునిగా, జైనునిగా వాదించేవారు ఉన్నారు. బహుశా అన్నమయ్య కాలంనాటికి కూడా వీరంతా ఉండి ఉండేవారేమో.

సర్వం ఆ గోవిందుని లీలే కదా.


Sravan Kumar DVN :

"ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు"  
-- అంటే, గంగా నది  పక్కన బావి తవ్వకుంటే  గంగా జలమే ఆ బావిలోకి ఊరుతాయి. మనం ఆ నేళ్ళని బావి నీళ్ళనుకుంటే బావి నీళ్ళు, గంగాజలం అనుకుంటే అదే పుణ్య తీర్తం. ఆలాగే సర్వాంతర్యామి ఒక్కడే, నువ్వు ఏ పేరు పెట్టు పిలుచుకున్నా.




శైలజ గారు:


పిండి పరిమాణాన్నిబట్టి అరిసెయొక్క పరిమాణం. అలానే, ఎంతమాత్రం నిన్ను వేడుకుంటే అంత ఆదుకుంటావు

ఇక్కడ ఆయన ఆదుకోవటం లో తేడా ఏం ఉండదు. మనం భావన చెయ్యడం లో ఉండే తేడా మాత్రమే. ఎంత తలిచిన వారికి, అంత గోచరిస్తాడు ఆయన. మనం తలచిన కొద్ది మనకి అనుభవం లోకి వస్తూ ఉంటుంది ఆయన తత్వం, ఆయన రూపం వంటివి

నీవే శరణు అనుకోవడమే పరతత్వము నాకు.

ఇక్కడ నీవు శరణు అనుకోవడం పరతత్వం కాదు. శ్రీవెంకటపతివి నీవే అయితే, నాచే చేకొనబడిన దైవము నీవే, నువ్ నాలో ఉన్నావ్ కనుకనే(నీకు శరణు వేడే తత్వం ఒక మనిషి గా నాది కాదేమో,నీవు నాలో ఉండటం వలన కలిగిన ఇది నాకు. అది పరతత్వం  నాకు). నీకు శరణు వేడాలనే తలపు నాకు కలిగింది. అందువలననే నీకు నే శరణను అన్నాను. ఇది యె పరతత్వం నాకు.నాలో ఉన్న నీకు నేను శరణు అనటమే పరతత్వం నాకు.

------------------------------------------------------------------

raagaM : bauLi
pallavi                                    
entamaatramuna evvaru talachina antamaatramE neevu
antaraantaramulu enchichooDa pinDantE nippaTi annaTlu

charaNaM 1
koluturu mimu vaishNavulu koorimitO vishNuDani
palukuduru mimu vEdaantulu parabrahmaMbanucu
talaturu mimu Saivulu tagina bhaktulanu SivuDanucu
alaripogaDuduru kaapaalikulu aadi bhairavuDavanucu

charaNaM 2
sarinennuduru SaaktEyulu Saktiroopu neevanucu
dariSanamula mimu naanaavidhulanu talapula koladula bhajinturu
sirula mimmunE alpabuddhi talachina vaariki alpaM bavuduvu
garimala mimunE ghanamani talachina ghanabuddhulaku ghanuDavu

charaNaM 3
neevalana koratElEdu mari neerukoladi taameravu
aavala bhaageerathi dari baavula aa jalamE UrinayaTlu
SreevEnkaTapati neevaitE mamu chEkonivunna daivamani
yeevala nE nee SaraNaniyedanu idiyE paratatvamu naaku



================================================================