నేను ఇదివరకే అన్నట్టు అన్నమయ్య సంకీర్తనాలకు వ్యాఖ్యానం రాయడం అన్నది కత్తిమీద సాములాంటిది. ఈ టపాలో నేను ప్రస్తావించే సంకీర్తనలోని భావం చాలా సున్నితమైనది. కొందఱు మిత్రుల కోరికమేరకు ఈ సంకీర్తనకు వివరణ రాసేందుకు సాహసిస్తున్నాను.
అన్నమయ్య కీర్తనలలో నాయకుడు శ్రీవెంకటేశుడు, నాయిక అలమేలుమంగ. ఈ నాయికుణ్ణి రేపల్లె బాలుడైన చిలిపి కృష్ణుడని, ఉగ్రరూపుదాల్చిన అహోబల నృసింహుడని, చెన్నకేశవుడని, ఆదిపురుషుడైన మహావిష్ణువని, శ్రీరాముడని, పొట్టి వామనుడని రకరకాల పేర్లతో కొలిచాడు అన్నమయ్య. నాయికను కూడ వేర్వేఱు పేర్లతో వేర్వేఱు రూపాలతో కొలిచాడు. పాలు పెరుగులమ్మే గొల్లెతగా, తాళ్ళపకవారింటి ఆడపడుచుగా, సరసాలాడే గోపికగా, పంతాల సత్యభామగా, చెంచితగా, జానపద నాయికగా, క్షీరాబ్ధి కన్యగా, గిరిజనస్త్రీగా, లంబాడిమగువగా, భూదేవిగా ఇలా ఒక్కొక్క కీర్తనలో ఒక్కోరూపం ఆమెకి. వేర్వేఱు సందర్భాలలో ఆ మగువ ప్రవర్తనలనూ, ఆమెలో కలిగే భావాలనూ ఎన్నెన్నో కీర్తనలలో అన్నమయ్య అద్భుతంగ పలికాడు; పలికించాడు.
అప్పుడప్పుడు నాయిక, నాయకుణ్ణి నిందిస్తుంది. తనతో ప్రేమగా కాసేపు కబుర్లు చెప్పలేదనో, నగలూ-చీరలూ కొనిపెట్టలేదనో, ఇరుగుపొరుగు వారు మంచి ఇల్లుకట్టుకున్నారనో(నువ్వెందుకు కట్టలేదన్న భావంతో), అలకతీర్చడం చేతకాదనో, ముద్దుచెయ్యలేదనో, షికారుకి తీసుకెళ్ళలేదనో ఇలా ఎవేవో కారణాలకులకు నిందుస్తుంది నాయిక. ఈ కీర్తనలో నాయిక ఎందుకు నిందిస్తుందో చూద్దాం. పని ఒత్తిడిలోపడో, మఱేవో కారణాలవలనో నాయకుడు శృంగార సంయోగాన్ని మఱచిపోయాడు. దేహ వాంచలనూ, ఇష్టాలనూ తీర్చు అని నేరుగ అడగడంలేదు ఈ నాయిక. తనదేహాన్ని ఇల్లుగా వర్ణించి ఆ ఇంటిని మఱచిపోయావు అని వాపోతుంది. ఆమె దేహం అనే ఇల్లు ఆయన కొలువుండేటి చోటట, ఆ చోటు తెలియదా నీకు అన్నట్టుగా ప్రశ్నిస్తుంది నాయిక. “మరుని నగరిదండ మాయిల్లెఱగా” ఈ కీర్తనలో నాయికే స్వయంగా తన అంగాంగవర్ణన చేస్తున్నట్టు రాశారు అన్నమయ్య. ఈ శృంగార సంకీర్తనలో కొన్ని philosophical thoughts కూడా ఉండటం విశేషం.
=================================
రాగం : శ్రీరాగం
(తి.తి.దే తాళ్ళపాక సాహిత్యం - 5వ సంపూటికనుండి)
=================================
పల్లవి
మరుని నగరిదండ మాయిల్లెఱగవా
విరుల తావులు వెల్లవిరిసేటి చోటు
చరణం 1
మఱగు మూక చింతల మాయిల్లెఱగవా
గుఱుతైన బంగారుకొండల సంది
మఱపు దెలివి యిక్క మాయిల్లెఱగావా
వెఱవక మదనుడు వేటాడేచోటు
చరణం 2
మదనుని వేదసంత మాయిల్లెఱగవా
చెదరియు జెదరని చిమ్మ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెఱగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు
చరణం 3
మరులుమ్మెతల తోట మాయిల్లెఱగవా
తిరువేంకటగిరిదేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెఱగవా
నిరతము నీ సిరులు నించేటిచోటు
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):
మరుని = మదనుడి
నగరి = భవనము
దండ = సమీపాన, పక్కన (మఱొక్క అర్థములో హారము, పూలమాల)
మాయిల్లెఱగవా = మా యిల్లెక్కడో తెలియదా?
విరుల = పూవుల
తావులు = పరిమళాలు
వెల్లవిరిసేటి = (పరిమళములు) చిమ్మేటి, చల్లేటి
మఱగు = అలవాటుపడు, చాటు (మఱొక్క అర్థం : అజ్ఞానము, మరిపించే)
మూక = గుంపు, సమూహము (మఱొక్క అర్థం : మందమతిగల )
చింతల = చింతచెట్లు (మఱొక్క అర్థం : కలతల)
గుఱుతు = మేర, చిహ్నము
సంది = వీధి, బీటిక
మఱపు = మఱిపించే
దెలివి = తెలివి
యిక్క = చోటు, స్థానము
వెఱవక = భాయములేకుండ
మదనుని = మన్మథుని
వేదసంత = వేదాధ్యయనమ (మదనుని వేదము అంటే కోరిక, ఆశ, కామము అని అర్థము)
చిమ్మచీకటి = గాఢమైన అంధకారము
కొదలేక = కొదవలేక, కొఱతలేక
కొలువుండేచోటు = నిత్యమువిహరించేచోటు
మరులు = మోహము, కామము
ఉమ్మెతల = ఉమ్మెత్త (ఈ చెట్టులోని కాయలు తింటే పిచ్చెక్కును)
(http://en.wikipedia.org/wiki/Datura)
(http://en.wikipedia.org/wiki/File:Datura_fruit.jpg)
మరుముద్ర = మదనుడి గుఱుతులు
వాకిలి = తలుపు, ద్వారము
నిరతము = మిక్కిలి ఆసక్తితో, ఎనలేని ఆనందముతో
నించేటి = నింపబడే
తాత్పర్యం :
మా యిల్లెక్కడో తెలియదా? మదనుడు దండ వేలాడే ప్రదేశమే! ఆ దండలోని పువ్వులు పరిమళాలు విరజిమ్మే చోటే మా యిల్లు. (నిత్యము గుండెలు చిలుకే మన్మథుడుండే చోటుకు సమీపాన ఉన్న నా మనసు అని మఱో అర్థం!)
కలతలతో కల్లోల పడే నీ మనసుని సుఖాలాతో కట్టిపడేసి, కష్టాలను మఱపించేచోటే మాయిల్లు. అటువంటి మాయింటిని ఎలా గుర్తుపట్టి చేరుకుంటావు? అక్కడ బంగారు కొండలుంటాయ్! ఆ సందే మాయిల్లు. ఆ చోటుకి ఇంకో ప్రత్యేకతకూడా ఉంది, ఎటువంటి మేధావినైనా, తన మేధస్సుని మఱిసిపోజేసే బలముగల స్థలం అది. (What a great Philosophical thought). ఈ ఒక్కచోటే మదనుడు భయంలేకుండా తన విల్లునెక్కుపెట్టి వేటాడుతుండేది. అక్కడె మాయిల్లు.
మన్మథుడి వేదమైన కామాన్ని అధ్యయనం(పఠనం) చేసేది ఇక్కడే. మఱొక్క గుర్తుకూడా ఉంది, అక్కడ చెదిరి చెదరని చిమ్మ చీకటి కమ్ముకుని ఉండ్టుంది. అక్కడే మాయిల్లు. అక్కడే నిన్ను దాచుకున్న నా మనసు ఉండేది. ఆ మనసులో మమతలకు కొరతలేదు.
మాయిల్లు మోహాల ఉమ్మెత్తతోట. ఉమ్మెత్త కాయతింటే ఎలా పిచ్చెక్కుతుందో అలాగే మాయిల్లు కూడా మోహాలమత్తులో ముంచ్చేస్తుంది. ఓ తిరుమలమలగిరి వెంకటేశుడా గుర్తుంచుకో, మాయింటి వాకిటి ద్వారానికి మన్మథుని చిహ్నాలుంటాయి. మిక్కిలి ఆనందం కలిగించే నీ వలపు సిరులతో నిండియుండేచోటే మాయిల్లు.
============================
rAgaM : SrIrAgaM
pallavimaruni nagaridaMDa mAyille~ragavAvirula tAvulu vellavirisETi chOTu
charaNaM 1ma~ragu mUka chiMtala mAyille~ragavAgu~rutaina baMgArukoMDala saMdima~rapu delivi yikka mAyille~ragAvAve~ravaka madanuDu vETADEchOTu
charaNaM 2madanuni vEdasaMta mAyille~ragavAchedariyu jedarani chimma jeekaTimadilOna neevuMDETi mAyille~ragavAkodalEka mamatalu koluvuMDEchOTu
charaNaM 3marulummetala tOTa mAyille~ragavAtiruvEMkaTagiridEvuDa neevumarumudrala vAkili mAyille~ragavAniratamu nee sirulu niMchETichOTu